హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసే సమయానికి ఇంకెన్ని చూడాలో. చిత్ర విచిత్రాలన్నీ అక్కడే జరుగుతున్నాయి. గెలుపు కోసం ఎన్ని పక్కదారులు తొక్కాలో ఇక్కడ చూసి వేరే వాళ్లు నేర్చుకోవాలేమో. సోషల్ మీడియాను ఎన్ని వక్రవంకలు తిప్పాలో.. ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో.. ఎన్ని ఫేక్‌లు క్రియేట్ చేయాలో.. ఎన్ని మార్ఫింగులతో మాయ చేయాలో ఇక్కడ చూసి నేర్చుకోవాలి ఇతర లీడర్లు. గతంలో ఎన్నడూ ఇంతటి వికారాలు చూడలేదు.
ఈ ఎన్నికే ఓ ప్రాధాన్యత సంతరించుకున్నది. సీఎం కేసీఆర్ ఇక్కడ గెలుపును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. శక్తులన్నీ అక్కడే మోహరించాయి. డబ్బుల సంచులు దిగుతున్నాయి. విచ్చలవిడి పంపకాలు జరుగుతున్నాయి. అన్నింటికీ తోడు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు చేసుకునే ఫేక్ న్యూస్‌ల దాడి జగుప్స కలిగించే రీతిలో కొనసాగుతున్నది. మొన్నటి వరకు టీఆరెస్ పార్టీ ఈటల రాజేందర్‌పై ఏ మాత్రం అవకాశం ఉన్న బట్టకాల్చి మీదేసేందుకు ప్రయత్నించారు. తప్పుడు వార్తలు సృష్టించారు. ఫేక్ న్యూస్‌తో పరువును బజార్లో పెట్టే ప్రయత్నం చేశారు. వీటిని తిప్పి కొట్టే పనిని ఈటల వర్గం విజయవంతంగా చేస్తూ వచ్చింది.
ఇక వీళ్లు కూడా ఫేక్ న్యూస్‌ను నమ్ముకున్నట్టున్నారు. తాజాగా హరీశ్‌రావు మాట్లాడిన ఓ వీడియోను తమకనుకూలంగా మార్చుకుని దాన్ని బయటపెట్టారు. దాన్ని చూస్తేనే తెలుస్తుంది అది పక్కా ఫేక్ వీడియో అని. కానీ ఈ ఫేక్ న్యూస్‌ల ద్వారా దొరికే శునకానందంలో వీరంతా పరవశించిపోతున్నారు. ఎవరి గురించి పట్టించుకోవడం లేదు. ఎవరేమనుకుంటే మాకేంది..? ఎంతో కొంత డ్యామేజీ చేశాం కదా. బద్నాం అయ్యాడు కదా.. అది చాలు మాకు. అనే స్థాయికి దిగజారిపోయారు. మీరు ఓ మీటరు లోతుల్లోకి దిగజారితో.. మేం పదిమీటర్లు కిందకు దిగజారిపోతామంటూ ఈ ఫేక్‌న్యూస్‌ల విషయంలో శునకానందం పొందుతున్నారు.