గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టుల నిర‌స‌న దినం.. బాగుంది. ప‌ది డిమాండ్లు. అన్నీ పాత‌వే. ఎప్పుడూ చెప్పుకునేవే. అర‌ణ్య రోధ‌న‌గా మిగిలిపోయిన‌వే. మ‌రోమారు ఈ రోజు వేదిక‌గా ఓసారి మ‌ళ్లా గుర్తు చేశార‌న్న‌మాట‌. అవును.. అప్పుడ‌ప్పుడ‌న్నా ప్ర‌భుత్వానికి మేమున్నామ‌నే విష‌యం గుర్తు చేయ‌క‌పోతే మ‌రిచిపోయే ప్ర‌మాదం ఉంది. కానీ అన్ని డిమాండ్ల‌లో ఈ రోజు ఒక్క డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాల‌నే డిమాండ్ క‌నిపించ‌లేదెందుకో? జాతీయ నిర‌స‌న దినం కాబ‌ట్టి.. లోక‌ల్ ఇష్యూ కింద దీన్ని తీసుకున్నారేమో బ‌హుశా. లేక ఇక డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని ఆశలు చాలించుకున్నారో తెలియ‌దు.

తెలంగాణ ఏర్ప‌డిన నాటి నుంచి నేటి వ‌ర‌కు చాలా మంది జ‌ర్న‌లిస్టులు చాలీ చాల‌ని వేత‌నాలు, ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌ని లైన్ అకౌంట్ జీవితాల‌తో ఎందుకు వెళ్ల‌దీస్తున్నారో తెలుసా? అక్రిడియేష‌న్‌, డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు. ఈ రెండే వారిని ఇంకా ఈ ఫీల్డును వ‌దిలిపెట్ట‌కుండా ఉండేలా చేస్తున్నాయి. ఇవ్వాలో రేపో డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు రాక‌పోతాయా? అని ఆశ‌తో ఎదురుచూస్తున్నారు. మ‌ళ్లీ ఎన్నిక‌ల నాటికి డ‌బుల్ ఇండ్లు ఇస్తామ‌నే హామీ అయితే వ‌స్తుందేమో గానీ, ఇండ్లు మాత్రం ఇవ్వ‌డం సాధ్యం కాదు. మీ కోసం ప్ర‌త్యేకంగా ఇండ్లు క‌ట్టి ఇస్తాం అనేది కాలం చెల్లిన మాట‌. న‌మ్మ‌కం లేని హామీగా మిగిలిపోయింది. నిరుపేద ప్ర‌జ‌ల‌కే ఇంత వ‌ర‌కు క‌ట్టించిన ఇండ్లు ఇవ్వ‌లేని స్థితిలో ప్ర‌భుత్వం ఉంది. ఒక‌రికిచ్చి మ‌రొక‌రికి ఇవ్వ‌క‌పోతే అదో తంటా. అందుకే ఎవ్వ‌రికీ ఇవ్వ‌డం లేదు.

ల‌బ్దిదారుల ఎంపిక పేరుతో వాటిని ఉత్స‌వ విగ్ర‌హాలుగా ఉంచేశారు. అవి గృహ‌ప్ర‌వేశాల‌కు నోచుకోక‌.. ఆక‌తాయిల‌కు అడ్డాలుగా మారుతున్నాయి. కొన్ని చోట్లైతే బ‌ల‌వంతంగా ఇళ్ల‌లోని చొర‌బ‌డి ఇళ్ల‌ను సొంతం చేసుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల నిరాహార దీక్ష‌లు చేస్తున్నారు. ఇదంతా చూసి మ‌న జ‌ర్న‌లిస్టు మిత్రులు .. ఇక త‌మ డిమాండ్ల నుంచి డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాల‌ని కోర‌డం వేస్ట్ అనే నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టున్నారు. అందుకే ఆ జాబితా నుంచి దీన్ని తీసేశారు. స‌రే మ‌రి మిగిలిన డిమాండ్లేమేన్నా నెర‌వేరుతాయా? ఎప్ప‌టి నుంచి ఈ డిమాండ్లు చేస్తున్నారు? ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? ఇందులో స‌గ‌మైనా నెర‌వేరుతాయ‌నే న‌మ్మ‌కం ఉందా? ఈ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు దొర‌క‌వు.

 

You missed