శ్రీధర్ అడగకున్నా రాజారెడ్డే చెప్పాడు….. ” మరో ఐదు రోజులు అవకాశం ఇస్తాడంట… టార్గెట్ చెయ్యకపోతే మానేసుకో అంటున్నాడు” అన్నాడు. శ్రీధర్ కళ్లలోకి చూసి మాట్లాడలేకపోతున్నాడు రాజారెడ్డి.
” తీసేసుకోమను రెడ్డి… వాడు.. వాడి పేపర్… ” అన్నాడు కోపంగా. వెంటనే మళ్లీ బాటిల్ ఓపెన్ చేశాడు. రెండు గ్లాసులు నింపాడు.
వెంటనే ఏదో గుర్తొచ్చినవాడిలా…… “ నాకు నిన్న మధు ఫోన్ చేశాడు. అదే మీ దాంట్లో పనిచేసే క్రైం రిపోర్టర్…..” అన్నాడు శ్రీధర్. “ఎందుకు? ” అన్నట్లుగా కళ్లతోనే అడిగాడు రాజారెడ్డి.
” చందా కాపీల కోసం సీనియర్ లీడర్, మీ ఎండీకి దగ్గర చుట్టమైన కిషన్ రెడ్డి దగ్గరకు పోయాడంట… ” అని
ఆగాడు .
“ఏమన్నాడు?” అన్నట్లు చూశాడు రాజారెడ్డి. అతని చూపులను అర్థం చేసుకున్న శ్రీధర్ చెప్పసాగాడు.
” ఏం పత్రికవయా ఇది. దీన్నిపుడు ఎవలు సదువుతున్నరు. నేనెవరికి చెప్పి చేపియ్యాలె… అని ముఖం మీదనే చెప్పడంతో మన క్రైం రిపోర్టర్ కంగుతిన్నాడంట ” అన్నాడు ముసిముసిగా నవ్వుతూ.
ఆశ్చర్యంగా చూశాడు రాజారెడ్డి. “అదే విషయాన్ని ఈనికి చెప్తే ఈడేమన్నాడో తెలుసా? ”
“ ఆళ్ల దగ్గరకు ఎందుకు పోయావోయ్… ఆళ్లదే కదా పేపర్ అని అన్నాడంట.” చెప్పడం పూర్తి చేశాడో లేదో గట్టిగా నవ్వసాగాడు శ్రీధర్.
” అంటే వాళ్ల పేపర్ మీద వాళ్లకే ఇంట్రస్ట్ లేదు.. ఇంక బయటోడు ఎవడు చదువుతాడంట… ” నిలదీసినట్లుగా అడిగాడు శ్రీధర్. ” ఇగో ఇదీ పరిస్థితి … నీతో చేతకాదు కానీ, నాతో కాదురా బై అని దానికి గుడ్ బై చెప్పెయ్……. ” అన్నాడు. “ నువ్వే చూస్తావు కదా… వాడెంత మంది ఉసురు తీసుకుంటాడో….?” అన్నాడు భవిష్యత్తును ఊహించుకుంటూ.
గ్లాసులోని పెగ్గును ఒక్క గుక్కకు ఖతం చేశాడు రాజారెడ్డి. చల్లని చెమటలు పడుతున్నాయి అతనికి. ఫీల్డు నుంచి తప్పుకోవడం తన తరం కావడం లేదు. తెగేసి చెప్పే ధైర్యమూ లేదు.
రాజారెడ్డి ఆలోచనలను పసిగట్టిన శ్రీధర్ మరో పెగ్గు రెడీ చేశాడు. అతనిలో ధైర్యం నింపేందుకు.
కళ్లు తిరిగినట్లుగా అనిపిస్తుంది రాజారెడ్డికి. శరీరం గాలిలో తేలియాడుతున్నట్లు చూపులు తేలికగా మారుతున్నాయి. అలాగే గడ్డి మీదకు ఒరిగాడు. ఆకాశాన్ని చూస్తున్నాడు.
కానీ చూపులు ఒక్కదగ్గర నిలవడం లేదు. మేఘాలు శరవేగంగా ఎటో అర్జంటు పని మీద వెళ్తున్నట్లుగా ఉరుకుతున్నాయి. తను కూడా ఆ మేఘాలతో పోటీ పడుతున్నట్లుగా వేగంగా ఆకాశానికేసి వెళ్తున్నట్లు వాటిని తాకుతున్నట్టుగా రాజారెడ్డికి అనిపిస్తున్నది. గట్టిగా కళ్లు మూసుకున్నాడు. అయినా అతని దేహం మాత్రం గాలిలో తేలియాడటం మానలేదు. లోపల పేగులు లోపుతున్నట్లు అనిపిస్తున్నది.
లేచి బలవంతంగా కూర్చున్నాడు రాజారెడ్డి శ్రీధర్ పక్కకు వెళ్లి ఎవరితోనే మాట్లాడుతున్నాడు. తన
జీవితాన్ని తలుచుకుంటే ఒళ్లు జలధరించినట్లవుతున్నది రాజారెడ్డికి. భవిష్యత్తు భయానకంగా తోచింది. వెంటనే ముందున్న గ్లాసును లేపి మొత్తం మందును గొంతులోకి పోశాడు. దమ్ము తీయకుండా గుక్క మీద గుక్క లాగించి పూర్తయిన తర్వాత దాన్ని తీసి దూరంగా విసిరేశాడు.
కానీ ఎదురుగా వస్తున్న గాలితో అది తిరిగి వచ్చి రాజారెడ్డి ముఖం మీదే పడింది. అందులో అడుగుకు మిగిలి వున్న లిక్కర్ బొట్లు రాజారెడ్డి ముఖం మీద నీళ్లు చిలకరించినట్లు పడ్డాయి. చేతితో ఆ తడిని తుడుచుకున్నాడు. లేచేందుకు ప్రయత్నిస్తున్నాడు. శరీరం సహకరించడం లేదు. అయినా లేవ్వాలనుకుంటున్నాడు. ఇదంతా పక్కనే ఉన్న శ్రీధర్ గమనించడం లేదు. ఎవరితోనో ఫోన్ లోనే పెద్దగా మాట్లాడుతున్నాడు. కాదు పోట్లాడుతున్నాడు.
నేలకు చేతులానించి మెల్లగా సగం వరకు లేచాడు రాజారెడ్డి. కాళ్లలో పట్టుతప్పి దబ్ మని ఆమాంతం కింద పడిపోయాడు. ఇక లేవడం తన వల్ల కాదని తెలిసిపోతూనే ఉంది. నక్షత్రాలు తన కళ్లముందు తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతున్నది. నోట్లో ఒక్కసారిగా లాలాజలం ఉబికి ఉబికి వస్తున్నది. పడుకొనే ఆ వచ్చిన లాలాజలాన్ని పక్కకు ఉ మ్మేస్తున్నాడు. ఆ ఉమ్మి పక్కకు పడటం లేదు. తన మూతి దగ్గరే పడి అక్కడే పచ్చటి గడ్డిలో కలిసిపోతున్నది. లాలాజలం ఆగడం లేదు. పాతాళ గంగలోంచి నీరు ఉబికి వచ్చినట్లు చివ్వున నోట్లో చిమ్ముతుంది.
ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నట్లుగా భళ్లున వాంతి చేసుకున్నాడు రాజారెడ్డి,
కడుపులో ఉన్నదంతా బయటపడింది. కానీ వాంతి మాత్రం ఆగడం లేదు. అలాగే కక్కుతున్నాడు. లోపల నుంచి మాత్రం ఏమీ రావడం లేదు. ఎక్కిళ్లు వచ్చినట్లుగా వెక్కుతున్నాడు. వాంతి చేసుకుంటున్నాడు. లోపల నుంచి పేగులు నోటి ద్వారా బయటకు వస్తాయోమో అన్నట్లుగా ఉంది రాజారెడ్డికి. నోరు పెగలడం లేదు. శ్రీధర్ ను పిలవాలనుకున్నా పిలవలేకపోతున్నాడు. చేతి పైకెత్తి అతనికి సంజ్ఞ చేస్తున్నాడు.
కానీ అతడు చూడటం లేదు. కొద్ది సేపటికే కళ్లు మగతగా మూసుకోసాగాయి.
స్పృహ కోల్పోతున్నట్టు అతనికి తెలుస్తోంది.

(ఇంకా ఉంది)

You missed