నిన్న మండలిలో ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా మాట్లాడింది. సమస్యలను ఏకరువు పెట్టింది. స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎన్నికైంది కాబట్టి ఆ సమస్యల్నే ప్రధానంగా చర్చించింది. తొలిసారే సమస్యల తోరణం కట్టడం అందరికీ నచ్చింది. నిధులెట్లైనా ఇస్తలేరు. కనీసం ఎంపీటీసీలకు గౌరవమైనా ఇవ్వండి. వారికి కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవని ఉన్నదున్నట్టు మాట్లాడటం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
పనిలో పనిగా.. పంద్రాగస్టు, చెబ్బీస్ జనవరి రోజున.. జెండా పండుగలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు అవకాశం ఇవ్వాలని కోరింది. వాళ్లు జెండా ఎరగేసే విధంగా అవసరమైతే కొన్ని సవరణలు చేయండి ప్లీజ్ అని మంత్రిని కోరింది. అంతా బాగానే ఉంది. దీనిపై ఇప్పుడు కొత్త వివాదం లేచింది. కొందరు సోషల్ మీడియాలో కవిత మాట్లాడిన ఈ జెండా ఎగురేసే అంశాన్ని తప్పుబుడుతూ కామెంట్లు, పోస్టింగులు పెడుతున్నారు.
మరి ప్రధానోపాధ్యాయులు ఎందుకు? రాజకీయ నాయకులనే పాఠాలు చెప్పుకోమనండి… అని కొందరు. రాజకీయాలు చేయాలంటే పాఠశాలలే దొరికాయా? అని ఇంకొందరు. పాఠశాలలను పార్టీ ఆఫీసులుగా చేస్తున్నారా? మరి మరికొందరు. ఇలా.. తమకు తోచిన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ పోతున్నారు. తెలంగాణ పాఠశాలల్లో విద్యా కమిటీలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పాత్ర ఏమిటీ? జాతీయ విద్యావిధానంలో మన పాఠశాలలు నడుస్తున్నాయా? పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ, మంచినీటి సరఫరా పైన శ్వేతప్రతాలు విడుదల చేయమని చెప్పండి కవిత గారు.. అని కూడా కొందరు కామెంట్లు పెట్టారు.
