తెలంగాణ ప‌ల్లెలు ఇప్పుడు వెండితెర‌పై జిగేల్‌మంటున్నాయి. హైద‌రాబాద్ మాత్ర‌మే షూటింగుల‌కు ఉప‌యోగ‌ప‌డేది. ఆంధ్ర‌లో వైజాగ్‌, చిత్తూరు ఆ ప‌రిస‌రాల్లో కూడా చాలా సినిమాలే షూటింగ్ చేసుకున్నారు. ఆంధ్ర‌కుచెందిన వారే సినీ ఇండ‌స్ట్రీని ఏల‌డం.. వారికి తెలంగాణ అంటే చిన్న‌చూపు ఉండ‌టం వ‌ల్ల ఇక్క‌డి ప‌ల్లెలు చాలా మ‌టుకు వెండితెర‌కు ప‌రిచ‌యం కాలేదు. అన్నల సినిమాల‌కో, అడ‌వుల నేప‌థ్యం ఉన్న‌వాటికో అప్పుడ‌ప్పుడు ఉప‌యోగ‌ప‌డేవి. హైద‌రాబాద్‌ను కూడా తామే అభివృద్ది చేశామ‌ని సినీ పెద్ద‌లు చెప్పుకునేవారు. అందుకే హైద‌రాబాద్‌పై త‌మ హ‌క్కు ఉన్న‌ట్టుగానే భావించేవారు.

అడ‌పాద‌డ‌పా హైద‌రాబాద్, దాని చుట్టు ప‌క్క‌ల షూటింగులు చేసుకునేవారు. సెట్టింగులు వేసుకునేవారు. కానీ తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక్క‌డ ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు దొరుకుతున్నాయి. ఇక్క‌డి ప్ర‌తిభ‌కు ఓ గుర్తింపు వ‌స్తున్న‌ది. అదే స‌మ‌యంలో ఇక్కడి ప‌ల్లెల‌పైనా ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు దృష్టి కేంద్రీక‌రిస్తూ వ‌స్తున్నారు. తెలంగాణ యాస‌ను ఒక‌ప్పుడు విల‌నీ భాష‌గా చూసేవారు. తెలంగాణ మాండ‌లికం కేవ‌లం విల‌న్ల‌కు, మొర‌టు మ‌నుషుల‌కు మాత్ర‌మే ఉప‌యోగించాల‌నే క‌చ్చిత‌మైన ఆలోచ‌న‌ల‌తో ఉండేవారు.

ఒక‌రిద్ద‌రు తెలంగాణ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కూడా ఇదే పంథాను కొన‌సాగించేవారు త‌ప్ప‌.. తెలంగాణ భాష‌కు మంచి గుర్తింపు ఇచ్చే పాత్ర‌లు చేయ‌లేక‌పోయారు. ఆ సాహ‌సం చేయ‌డానికి ముందుకు రాలేదు. చేతులు కాల్చుకోవ‌డ‌మే అనుకున్నారు. అందుకే దూరంగా పెడుతూ వ‌చ్చారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. తెలంగాణ ఆత్మ‌గౌర‌వం వెండితెర‌ను కూడా ఏలుతున్న‌ది. ఇక్క‌డి ప‌ల్లెలు షూటింగుల‌కు ప‌నికొస్తున్నాయి. ఇక్క‌డి నేటివిటీ సినిమాకు ప్రాణం పోస్తున్న‌ది. ఇక్క‌డి భాష, యాస, న‌డవ‌డిక ఆ సినిమాల‌కు కొత్త ఊపిరిలూదుతున్నాయి. ఇవే వాటికి ఆయువు ప‌ట్టుగా ఉంటున్నాయి.

ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల హైద‌రబాదీ భాష‌తో కొత్త ఒర‌వ‌డిని సృష్టిస్తూ సినిమాలు తీశాడు. ఆ త‌ర్వాత ఇదే పంథాలో చాలా సినిమాలు వ‌చ్చాయి. ఫిదాతో బాన్సువాడ‌ను ట‌చ్ చేశాడు. సిర్నాప‌ల్లి,అలీసాగ‌ర్ త‌దిత‌ర‌ నిజామాబాద్ జిల్లాలోని ప్రాంతాల‌ను చూపి అందిరినీ ఫిదా చేశాడు. తాజాగా ల‌వ్‌స్టోరీలో ఆర్మూర్ ప్రాంతాన్నిచూపాడు. పిప్రి విలేజ్‌లో షూటింగ్ జ‌రిగింది. సిద్దుల గుట్ట పైనుంచి ఆర్మూర్ అందాలు చూపించాడు. మొన్న నాని ఎంసీఏ లో దిల్‌రాజు వ‌రంగ‌ల్‌ను ఎంచుకున్నాడు. అంత‌కు ముందు ప్ర‌భాస్ వ‌ర్షం సినిమా కూడా వ‌రంగ‌ల్ లోకొంత సినిమా షూటింగ్ జ‌రిగినా.. ఎంసీఏలో ఎక్కువ‌గా వ‌రంగ‌ల్ అందాలు క‌నిపించాయి.

ఒక‌ప్పుడు ఛీత్కారాల‌కు, అవ‌మానాల‌కు గురైన ఇక్క‌డి ప్రాంతం, భాష‌.. ఇప్పుడు త‌లెత్తుకొని ఆత్మ‌గౌర‌వంగా నిల‌బ‌డ్డ‌ది. ఆ ఆత్మ‌గౌరవం ముందు సినీ ఇండ‌స్ట్రీ వ‌రుస క‌ట్టింది.

You missed