“మీరింకా నిద్రపోరా..? రోజు లేట్ నైట్ దాక టీవీలు చూడటం.. ఏ అర్ధరాత్రో నిద్రపోవడం.. పొద్దున 9 గంటల వరకు ముసుగుతన్ని పడుకోవడం….
బాగా అలవాటైంది మీకు.” అరిచాడు రాజారెడ్డి.
లేచి టీవీ బంద్ చేసి బయటకు నడిచాడు. పిల్లలు బిక్కుబిక్కు మంటూ నేల మీద చాప వేసుకొని పడుకున్నారు. వనజ కూడా వారితో పాటే నిద్రకుపక్రమించింది.
ఆరుబయట చల్లటి గాలిలో అటు ఇటూ తిరుగుతున్నాడు రాజారెడ్డి. ఏమి చేయాలో దిక్కుతోచకుండా ఉంది తనకు.
“ఈ నెలవారీ టార్గెట్లు చేయడం తనవల్ల అవుతుందా?” అదే ఆలోచన అతన్ని ప్రశాంతంగా ఉండనీయడం లేదు. “ప్రెస్ ఫీల్డు వదిలి వేరే పనిచేసుకోగలనా?” అతనికి సమాధానం దొరకడం లేదు. “శ్రీధర్ లా నేనూ ఒక సొంత పత్రిక పెట్టుకుంటే….?”
ఆలోచన వచ్చిందే తడవు మళ్లీ శ్రీధర్ కు ఫోన్ చేయాలనుకున్నాడు. ఇంత రాత్రి వేళ వద్దనుకొని ఊరుకున్నాడు. రేపు ఉదయం నేరుగా కలిసి దీనిపై మాట్లాడి ఓ నిర్ణయానికి రావాలనుకున్నాడు. ఇపుడు మనసు కొంత ఊరట చెందినట్లనిపించింది. పడుకుందామని లోనికి వెళ్లాడు. పక్కరూములో భార్య,
పిల్లలు పడుకుని ఉన్నారు. లైట్ బంద్ చేశారు. రాజారెడ్డి వెళ్లి లైట్ వేశాడు.
భార్య వనజ పిల్లల మధ్యలో పడుకున్నది. తన మీద కోపం వచ్చినపుడు అలా పిల్లల మధ్యలో పడుకొని నిరసన తెలపడం తనకలవాటు.
అక్కడి పరిస్థితిని అర్థం చేసుకొని వెనక్కి తిరిగి తన గదిలోకి వచ్చాడు, చిన్న నిట్టూర్పు విడిచాడు. బెడ్ పై పడుకొని కళ్లు మూసుకున్నాడు. భార్యపై తన ఆలోచనలు మళ్లాయి.
పెళైన కొత్తలో తనకెంత మర్యాద ఇచ్చేది వనజ. ఎంత ప్రేమ ఒలకబోసేది?
ఇంటికి రావడం ఆలస్యమైతే నా కోసం ఎదురుచూసేది. పిల్లలు తిన్నా… నా కోసం తినకుండా గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ కూర్చునేది. “ఏం వనజ నువ్వు తినలేదా?” అని అడిగితే…… “మీరొచ్చినంక తిందామని ఆగానండి…” అని ఆమె అంటుంటే మనసెంత పులకరించిపోయేది. చేసిన ప్రతి వంట నాకు నచ్చుతుందా లేదా అని ఆత్రుతగా చూసే ఆమె చూపులు ఇంకా తనకు గుర్తున్నాయి. ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టుకోగానే నా ముఖం వైపే చూసేది. నేనేమంటానా అని.
“పర్వాలేదు బాగుంది” అని నా నోటి నుంచి వస్తే చాలు ఆమె ముఖం ఎంతలా వెలిగిపోయేది. నేను మెచ్చుకుంటే చాలు జీవితం ధన్యం అనేలా ప్రవర్తించేది.
నా మెప్పు పొందేందుకు తపన పడేది.
ప్రేమను పంచేందుకు పరితపించేది.. నా కోసం తన ఇష్టాలను, సంతోషాలను వదలుకునేందుకు వెనకాడేది కాదు.
సండే వస్తే చాలు… ఇంట్లో నుంచి బటయకు వెళ్లనిచ్చేది కాదు. ” ఈ రోజు కూడా బయట ఏం పని. ఇంట్లోనే ఉండొచ్చు కదా “అనేది.
ఇంట్లో అందరితో కలిసి టీవీ చూడటం తనకిష్టం అందరం కలిసి రౌండ్ గా కూర్చుని భోజనం చేయడం తనకెంతో సంబురం.
“రాత్రికి చపాతీలు చెయ్యి” అని అంటే… ” నేను చపాతీలు చేసినా… మళ్లీ అన్నం తింటారు. ఇంతదానికి చపాతీలెందుకు?” అని అన్నమే పెట్టేది.
నేను అన్నం పరిపూర్ణంగా తింటే తన కడుపునిండినంత సంతోషపడేది. “మరి ఇపుడెందుకు ఇలా…?” నన్ను చీదరించుకుంటున్నట్లుగా…. నన్నో అసమర్థుడి కింద లెక్కగడుతున్నది. బయట నాకు దొరికే గౌరవం, మర్యాద తనకు తెలియక కాబోలు. ఒక్కసారి తన వెంట వస్తే వనజకు తెలిసేది. అధికారులు, పోలీసులు… వీరు వారు అని కాదు అందరూ తనకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎక్కడికెళ్లినా ఎంత మర్యాద? రండి…! కూర్చోండి! అని ఆప్యాయంగా ఆహ్వానించి, టీ,కాఫీలతో మర్యాద చేసి… ఆ పరపతి ఎవరికైనా దొరుకుతుందా? మరి అది తెలుసుకోదెందుకో ఈ వనజ? ఎవరు చెప్పాలి తనకు. హాస్టల్ వార్డెన్ గా తనకు ఉద్యోగం ఎలా వచ్చింది?. నేను నా పరపతి ఉపయోగించే కదా పెట్టించింది. ఇపుడు నాకు ఎలాంటి ఆదాయం లేకపోవచ్చు. కానీ సమాజంలో ఎంత గౌరవప్రదమైన హోదాలో బతుకుతున్నానో గుర్తించదే? రాజారెడ్డి మనసులో ఇవే ఆలోచనల అలజడులు రేపుతున్నాయి… నిద్రరాకపోవడంతో బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు.

చుట్టూ కొండలు, పచ్చటి చెట్లు. అది దట్టమైన అడవి అని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు రాజారెడ్డికి. ఇలాంటి ప్రకృతంటే తనకెంతో ఇష్టం. తనకిష్టమైన ప్రాంతానికి రావడం హాయిగా ఉంది. చుట్టూ పక్షుల కిలకిలరావాలు వినసొంపుగా ఉన్నాయి. నెమళ్లు పురివిప్పి నాట్యమాడుతున్నాయి. ఆహా ఎంతటి రమణీయమమైన దృశ్యం. పచ్చటి పచ్చిక మీద కూర్చొని తన్మయత్వంతో అలా చూస్తూ ఉన్నాడు రాజారెడ్డి. తన పక్కనుంచి జింకలు గంతులు వేస్తూ వెళ్తున్నాయి. ఆ సందడికి రాజారెడ్డి మనస్సు తుళ్లిపడుతున్నది. జీవితం అంటే ఇలా ఉండాలి. ఇంత ఆహ్లాదంగా గడపాలి. ఏ బాదరబందీ ఉండొద్దు. మనసులో అనుకుంటూ లేచి అలా ముందుకు వెళ్తున్నాడు. కనుచూపు మేరలో ఓ లోయ ఉన్నట్లుంది. పెద్ద లోయ.
అది ఓ జలపాతం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన నీరంతా పాయలు పాయలుగా ఒక్కచోట చేరి అది చిన్న వాగులా మారి… కొండలు గుట్టలు దాటి ఇలా జలపాత సూరులో కలిసి పరవళ్లు తొక్కుతున్నాయి.
పాలనురగలు కక్కతూ ఎలా ఆ నీటి ప్రవాహాం కిందకు దూకుతుందో..? మధ్యలో గాలిలో వయ్యారాలు పోతూ నీటి తుంపరల రూపంలో చిరుజల్లలు వానలా కళ్లకు ఎంతటి కనువిందునిస్తుందో.
అలా అనుకుంటూ లోయలోకి తొంగిచూడసాగాడు.
జాలువారిన నీటివాలు ఎక్కడో పాతాళంలోకి పడిపోయినట్లుగా ఒంపులు తిరుగుతూ వెళ్లి కింద నేలకు తాకుతున్నాయి. మరో పెద్ద ప్రవాహాంలోకి ఆ నీటివాలు కలిసిపోతున్నది.
అలా కళ్లప్పగించి చూస్తున్న రాజారెడ్డి కాలు ఒక్కసారిగా బండరాయిపై పట్టుతప్పి జారిపోయింది.
సర్రున జారి నీటి ప్రవాహంతో ముందుకు పోయి జలపాతంలో కలిసిపోయాడు. నీటితో పాటు కలిసి కిందకు జారిపోసాగాడు.
అప్పటివరకు కనువిందు చేసిన పచ్చటి ప్రకృతి అతనికి భీతావహంగా కనిపించసాగింది. కాళ్లు చేతులు ఆడిస్తున్నాడు. ఎక్కడా ఏ ఆదరువు లేదు. పట్టుకొని ప్రాణాలు నిలుపుకుందామంటే.
ప్రాణాలు గాలిలోనే తేలిపోతున్నట్లుగా వెయ్యి మైళ్ల వేగంతో పాతాళానికి తాను విసిరేయబడుతున్నట్లుగా కిందకు జారిపోతున్నాడు. పసిపాపను పొత్తిళ్లలో పట్టుకొని ఉయ్యాల ఊపుతున్నట్లే జలపాతం నీటివాలు తనను పట్టుకొని కిందకు తీసుకెళ్తున్నట్లుగా అనిపిస్తున్నది. “రక్షించండి….” అని గట్టిగా అరవాలనుంది. “ఎవరైనా వచ్చి కాపాడండీ ” అని గొంతు చించుకోవాలనుంది.
కానీ శ్వాసే ఆడనీయకుండా చుట్టూ నీరు… నిండా నీరు…
అలా వెళ్లి వెళ్లి….. ఒక్కసారిగా కింద పడిపోయాడు రాజారెడ్డి. “ఫట్” సముద్ర కెరటం ఉవ్వెత్తున లేచి నేలను తాకినట్లు జలసవ్వడితో కలిసిపోయిందా చప్పుడు.
తల నేలకు బలంగా బండరాయికి తగిలింది. అది మాత్రమే గుర్తుంది అతనికి. ఆ తర్వాత ఆ ప్రవాహంతో పాటు కొట్టుకుపోతున్నాడు.
బండరాయికి బలంగా కొట్టుకోవడంతో తల పగిలి అందులోంచి చివ్వున చిమ్ముతున్న రక్తం తెల్లని పాలనురగలాంటి నీటిని ఎర్ర ఎర్రగా మారుస్తూ ఆ ప్రవాహంలో కలిసి ముందుకు సాగుతున్నది.
మరికొన్ని క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలుస్తాయని తెలిసిపోతున్నది రాజారెడ్డికి. “అమ్మా ” అని గట్టిగా అరిచాడు
అరిచానని అనుకున్నాడు. కానీ ఆ అరుపు బయటకు రాకముందే అతని ఆయువు అనంత వాయువుల్లో కలిసిపోయింది.

(ఇంకా ఉంది)

You missed