“ఆ అమ్మాయిని వ్యభిచార వృత్తిలోకి దించింది కరోనానే.” అందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు.
వెంటనే తేరుకుని దీనికి దారితీసిన పరిస్థితులను ఎవరికి వారు అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా నరహరి ఏం చెబుతాడోనని ఆత్రుత నిండిన వదనాలతో చూస్తున్నారు.
“ అవును… ఆమె ఓ సాధారణ గృహిణి. చిన్నతనంలోనే పెళ్లెంది. ఆమె జీవితం సజావుగా సాగుతూ వచ్చింది.” చెప్పడం ఆరంభించాడు నరహరి. ” ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు?” అడిగాడు మధు. ” నేను స్వయంగా ఆమెను కలిశాను.” ఇపుడు మరింత ఆశ్చర్యపోయారు వారంతా. “ అవునా? ఎక్కడ కలుసుకున్నావు? ఆమె అడ్రస్ ఎవరు చెప్పారు?” ఆత్రుతగా వారంతా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
“ ఈ సంఘటన జరిగిన తర్వాత దీనిపై పరిశోధన మొదలుపెట్టాను. పోలీసుల ద్వారా ఆమె అడ్రస్ కనుక్కున్నాను. వాళ్లింటికి వెళ్లాను. వివరాలన్నీ ఆరా తీశాను. ఈ విషయాలన్నీ ఆమే నాతో స్వయంగా చెప్పింది.”
” ఏమని చెప్పింది?” అడిగాడు మధు. ఉత్కంఠను అణుచుకుంటూ.
” సజావుగా సాగుతున్న వారి సంసారంలో… రోడ్డు ప్రమాదం ఆమె భర్తను అవిటివాణ్ని చేసింది. ఆ నాటి నుంచి కూలీనాలీ చేస్తూ పిల్లలను సాకుతున్నది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి ఆమే పెద్ద దిక్కయ్యింది. కానీ ఈ కరోనా ఆ పేదరాలికి పని లేకుండా చేసింది. ఆమెతో పాటు ఆ
ఊర్లో చాలా మందికి పని లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఆమెకు ఆ ఊరిలో ఉన్న ఒకావిడతో పరిచయం ఏర్పడింది. నిత్యం సిటీకి వచ్చి వ్యభిచారం చేస్తే రోజుకు కనీసం ఐదొందల వరకు సంపాదించవచ్చని చెప్పింది. బలవంతంగా తనతో కొన్ని రోజులు తిప్పుకుంది. కరోనా కాలంలో పనిలేకపోవడంతో ఆమె అప్పటి నుంచి ఈ పనినే ఎంచుకున్నది. ఇంట్లో మాత్రం సిటీలో పని ఉంది | చేసి వస్తున్నానని భర్తకు,
పిల్లలకు చెబుతున్నది. ఉదయం వచ్చి రాత్రి 8 గంటల వరకు బస్టాండ్ సమీపంలో, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో వీరంతా తచ్చాడుతారు. విటులు రాగానే మాట్లాడుకుని దగ్గరలోనే ఉన్న లాడ్జ్ కు వెళ్తారు. ఆ తర్వాత మళ్లీ వచ్చి అదే ఏరియాలో విటుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇదే ఆమెకు నిత్యకృత్యం. మొన్న సంఘటన జరిగిన రోజు వచ్చిన విటుడు ఆమెకు గతంలో పరిచయం. తెలిసినవాడే కావడంతో బైక్ పై నమ్మకంగా వెళ్లింది. కానీ ఆమె ఒంటరిగా దొరకడంతో వాడిలో రాక్షసుడు నిద్రలేచాడు. తాను అనుభవించిందే కాకుండా నలుగురు దోస్తులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఊహించని పరిణామంతో ఆమెకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. అరిస్తే నీకే ప్రమాదం బయట పోలీసులు తిరుగుతున్నారు.. లోపలేస్తారని బెదిరించాడు. ఆ చీకట్లో ఆమె పులులకు చిక్కిన లేడి
పిల్లే అయ్యింది.” ” నలుగురూ చెరబట్టారు. సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఇదీ జరిగింది… ” చెప్పడం పూర్తి చేశాడు నరహరి.
” మరి ఇంత మంచి ఇన్వెస్టిగేషన్ స్టోరీ మీ ‘చీకటి • పేపర్లో రాయలేదెందుకు?” అని అడిగాడు మధు. ” నేను మా బాతో ఈ విషయమంతా చెప్పాను. కానీ మావోడు ఒప్పుకోలేదు. ఆ తతంగమంతా మనకవసరమా? స్పాట్ రాశాం కదా.. చాలు అన్నాడు” అని చెప్పాడు.
మళ్లీ కొద్ది సేపు ఆగి తనే అన్నాడు.. ” ఆ తర్వాత నాకు అసలు విషయం తెలిసిందేమిటంటే… పోలీసుల నుంచి ఒత్తిడి వచ్చిందని. ఈ సంఘటనతో పోలీసు శాఖ పరువు పోయింది. పోలీస్ కమిషనరేటకు కూత వేటు దూరంలోనే ఇది జరగడం.. అదీ కలెక్టరేట్ ప్రెమిసెస్ కావడంతో జిల్లా యంత్రాంగం దీన్ని తమ పరువుకు సంబంధించిన విషయంగా భావించింది. అందుకే అందరూ ఆరోజు స్పాట్ వార్తకే పరిమితమై పోలీసులు చెప్పింది రాసుకొని వదిలేశారు. ఆ తర్వాత దీన్ని పట్టించుకోలేదు” చెప్పడం ఆపి ఊపిరిపీల్చుకున్నాడు.
” మొత్తంగా నేను తెలుసుకున్నదేమంటే…. కరోనా చాలా మందిని వ్యభిచార వృత్తిలోకి కూడా దింపుతోందని.” అన్నాడు నరహరి.
” ఇందులో ఇంకో విషాదమేమిటంటే…. ఎవరికి కరోనా ఉందో తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో పొట్టకూటికోసం పడుపు వృత్తిని ఎంచుకొని ప్రాణాలను, ఆరోగ్యాలను గాలిలో దీపంలా పెట్టడం.”
” అపరిచితుల వల్ల కరోనా అంటితే .. తాము రిస్కులో పడటమే కాదు… కుటుంబ సభ్యులనూ చావుకు దగ్గర చేయడమే.
ఇది తెలిసీ వారు దీన్ని ఎంచుకోవడం వెనుక ఎంతటి దుర్భర పరిస్థితులు దాపురించాయో అర్థం చేసుకోవచ్చు.” ఆవేదనతో అన్నాడు నరహరి.
వారందరి ముఖాల్లో విషాదం కనిపించింది. కొద్ది సేపు ఎవరేమీ మాట్లాడలేదు.
” ఈ రోజు కరోనా టెస్ట్ క్యాంపు ముగిసింది… వారంతా వెళ్లిపోతున్నారు. రేపు కూడా వస్తారంట….” మరో యూనియన్ నేత సాయిరాం అక్కడి వారికి సమాచారమిచ్చాడు.
“ఈ రోజు ఎంత మందికి పాజిటివ్ వచ్చింది?” “ వంద మంది టెస్టులు చేయించుకుంటే 35 మందికి వచ్చింది.” ” మరి వారి పరిస్థితేంటి?”
” కొందరు తమ ఇళ్లలోనే ట్రీట్ మెంట్ తీసుకుంటారంట. ఇంకొందరు సిటీ అవతల ఉన్న ఐసోలేషన్ సెంటర్కు వెళ్తారంట” అన్నాడు సాయిరాం. “సాయంత్రం ఇంటికి త్వరగా రా” భార్య వనజ మాటలు గుర్తుకు వచ్చాయి రాజారెడ్డికి.
కడుపులో ఆకలి కేకలు మొదలయ్యాయి. అక్కడే భోజనాలు ఏర్పాటు చేసినా… తినాలనిపించలేదతనికి. తన మిత్రుడు నరసింహ గుర్తుకువచ్చాడు. ఎక్కడున్నావని ఫోన్ చేశాడు.
కలెక్టరేట్ వెనుక వేప చెట్టు కింద ఉన్నానన్నాడు. ప్రెస్ క్లబ్ కు కొద్ది దూరంలో ఉన్న కలెక్టరేట్ వైపు బైక్ పోనిచ్చాడు రాజారెడ్డి.
“ నరసింహా ఏమి చేస్తున్నావిక్కడ? “అడిగాడు రాజారెడ్డి. “ ఏం ఉంది చేసేందుకు? ఎటూ పొద్దుపోక ఇక్కడ టైం పాస్ చేస్తున్న.” ” ఇంట్లోనే ఉండొచ్చు కదా.. అనవసరంగా ఈ సమయంలో బయటకు వచ్చుడెందుకు?” అన్నాడు రాజారెడ్డి. “ఇంట్లో ఉంటే పెండ్లాం ఊకుంటుందా? తిని కూసుంటే ఇళ్లు ఎట్ల నడుస్తదని ముఖం మీదే తిట్టేస్తుంది తెలుసా?” అన్నాడు ఏ మాత్రం సంకోచించకుండా. ” మరి బయటకు వచ్చినా ఎవరూ కలిసేది లేదు కదా?” అన్నాడు.
“ ఏదో అలా రెడీ అయి ఇలా బయటకు వచ్చి టైంపాస్ చేసి ఇంటికి వెళ్లిపోవాలి. పెద్ద పనిచేసిన బిల్డప్ ఇంట్లో ఇవ్వాలి. లేదంటే రాత్రికి ఫుడ్ కట్ ” అన్నాడు నరసింహా. .
నవ్వుకుంటూ ఆ మాటలన్నా.. అతని ముఖంలో విచారం తొంగిచూస్తున్నది. దాన్ని దాచి ఉంచేందుకు తెచ్చి పెట్టుకున్న నవ్వును ప్రదర్శిస్తున్నాడు నరసింహా. అది గమనించాడు రాజారెడ్డి.
“బయట పరిస్థితులు అందరికీ తెలిసినవే కదా! యాజమాన్యం జీతాలు ఇవ్వదు. వారు పెట్టిన టార్గెట్లు మనం చెయ్యలేం… ఇవే కదా ఇప్పుడు పరిస్థితులు” అన్నాడు రెడ్డి.
” ఏమో రెడ్డి ఏమి అర్థం కావడం లేదు నాకు. వేరే పని కూడా ఏం దొరకడం లేదు. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. ఏదైనా ప్లాటు అమ్మిపించి కమీషన్ తీసుకుందామంటే.”
“పరిస్థితి ఘోరంగా ఉంది” మళ్లీ తనే అన్నాడు ఎటో చూస్తూ.
“ నన్ను గమనించావా?” అన్నాడు నరసింహా. కొద్దిసేపటి తర్వాత. అర్థం కాలేదు రాజారెడ్డికి. ” నేను రోజు క్లీన్ షేవ్ చేసుకుంటా…
కానీ రెండ్రోజుల నుంచి చేసుకోవడం లేదు. అందుకే ఈ మాసిన గడ్డం” అన్నాడు. మళ్లీ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. ఎడమ చేతితో కొంచెం కొంచెంగా పెరిగిన గడ్డాన్ని రుద్దుకుంటున్నాడు.
ఎందుకో తెలుసా? రాజారెడ్డి ఏదో చెప్పేలోపే తనే అన్నాడు…. ” షేవింగ్ బ్లేడ్ లు కూడా మనకు చాలా కాస్ట్లీ అయిపోయాయి
రెడ్డి” అన్నాడు. ఈ సారి అతని కళ్లల్లో కొంచెం తడి కనిపించింది. అది కనిపించకుండా అతను ముఖం పక్కకు తిప్పుకున్నాడు.
టాపిక్ చేంజ్ చేద్దామని … ” మరి క్రాపు మాత్రం నీట్ గా ఉందే… ఎప్పుడు చేయించుకున్నావ్? ” అన్నాడు రాజారెడ్డి.
ఒక్కసారిగా ఫక్కున నవ్వాడు నరసింహా.
వెంటనే నవ్వాపుకుంటూ … ” నువ్వు నవ్వనంటే చెప్తా” అన్నాడు. ” దీంట్లో నవ్వడానికేముంది నరసింహా! ” అన్నాడు రాజారెడ్డి.
” నేనే ఇంట్లో కుస్తీ పట్టిన….” అన్నాడు. ” లా డౌన్లో ఇది అందరూ చేసిందే కదా. నాకూ అలవాటైంది. బార్బరు వంద ఇచ్చే అవసరం లేకుండా పోయింది.” అన్నాడు మళ్లీ.
” యండమూరి వీరేంద్రనాథ్ కూడా తనే సొంతంగా క్రాఫ్ చేసుకుంటాడట తెలుసా నీకు?” అన్నాడు. అక్కడి వాతావరణాన్ని తేలిక చేసేందుకు.
రాజారెడ్డి ఏమి మాట్లాడలేకపోతున్నాడు. సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్టు వీడు నా కంటే దరిద్రుడే ఉన్నట్టున్నాడు అనుకున్నాడు మనసులో.
“సరే మరి నేను వెళ్తా” అన్నాడు రాజారెడ్డి. ఆకలి దంచుతుంది. ‘ఇంటికి వెళ్లి నాలుగు మెతుకులు గతికితే తప్ప ఆకలి రాముడు శాంతించేలా లేడు’ అనుకున్నాడు.
బండి స్టాండ్ తీశాడు. కిక్ కొట్టి స్టార్ట్ చేశాడు. గేరు మార్చి బండిని ముందుకు దూకిస్తుండగా….. ” రెడ్డి ఒక్క నిమిషం …..” పిలిచాడు నరసింహా. “ఏందన్నా?” ” ఓ వంద రూపాయలుంటే ఇస్తావా? పెట్రోల్ లేదు”
ఒక్కసారిగా మిత్రుడు నరసింహా అలా వంద రూపాయలు అడిగే సరికి రాజారెడ్డి మనస్సు కలుక్కుమన్నది.
