అగ్రహీరోలు తమ పారితోషికంలో ఒక్క రూపాయి కూడా తగ్గించుకోరు. ఎంత కరోనా అయినా సరే సినిమాకు పాతిక కోట్లనుంచి డెబ్భైకోట్ల రూపాయలు గోళ్లు ఊడగొట్టి నిర్మాతల దగ్గరనుంచి వసూలు చేస్తారు.

ప్రభుత్వం మాత్రం సామాన్య ప్రేక్షకుల గోళ్ళూడగొట్టి టికెట్ ధరలను నాలుగురెట్లు పెంచెయ్యాలి. రోజుకు అయిదారు షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. కరోనా అయినా గిరోనా అయినా సరే, కుటుంబసభ్యులకు కడుపునిండా తినడానికి ఉన్నా లేకపోయినా హీరోల సినిమాలు మాత్రం వెయ్యి రూపాయలు ఖర్చు చేసి చూడాలి.

దానవీరశూరకర్ణ సినిమాకు ఇరవై లక్షలు ఖర్చయింది. అదే సమయంలో అయిదు లక్షల రూపాయల జ్యోతి, ఆమెకథ, బొమ్మరిల్లు, విజయ లాంటి సినిమాలు కూడా వచ్చాయి. నా సినిమాకు ఖర్చు ఎక్కువయింది కాబట్టి టికెట్ ధరలను పెంచాలని ఎన్టీఆర్ నాటి ప్రభుత్వాన్ని అడుక్కోలేదు.

పైగా మేము చెప్పే వందకోట్లు, మూడొందల కోట్లు కలెక్షన్లు అన్నీ బూటకమే అని ప్రముఖ నిర్మాత కళ్యాణ్ చెప్పడం చూస్తుంటే సినిమా వ్యాపారం ముసుగులో ఎన్నెన్ని అక్రమాలు జరుగుతున్నాయో తెలుస్తుంది.

జగన్ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ టికెట్ల ధరలను పెంచకూడదు. పదిమంది అగ్రహీరోల సినిమాలు లేకపోయినంతమాత్రాన దేశానికేమీ నష్టం లేదు. ఇష్టమొచ్చినవాడే సినిమాలు తీస్తాడు. జనం ఎవ్వరూ అగ్రహీరోల సినిమాలకోసం ఎదురుచూడటం లేదు. సినిమా నిర్మాణవ్యయం, హీరోల పారితోషిక ఒప్పందపత్రాల మీద కూడా ప్రభుత్వం నిఘా ఉంచాలి. ఒక ఉద్యోగికి వేతన వివరాలను స్లిప్ రూపంలో అందిస్తారు. అలాగే హీరోల, హీరోయిన్ల, సాంకేతిక నిపుణుల పారితోషిక వివరాలు కూడా బహిరంగం చేయాలి. అప్పుడే సినిమా వారి మోసాలకు చెల్లు చీటీ పలకడం వీలవుతుంది.

సినిమాహీరోలను కలవాలని జగన్ మోహన్ రెడ్డికి రూలేమీ లేదు.

మురళీ మోహన రావు ఇలపావులూరి