సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నేపథ్యం చర్చకు దారి తీస్తున్నది. విభిన్న కోణాల్లో ఎవరికి వారే విశ్లేషించుకుంటున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా ఈ సంఘటనలో తప్పులు వెతుక్కుంటున్నారు. ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందనే వాస్తవాన్ని మెగా అభిమానులు, సినీ పెద్దలు జీర్ణించుకోవడం లేదు. మెగా కుటుంబం మెప్పు కోసం నోరు జారి కొన్ని కామెంట్లు చేసి నవ్వుల పాలవుతున్నారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సాయిధరమ్ తేజ్ పై ఓవర్ స్పీడ్ కింద కేసు పెట్టిన పోలీసులను తప్పుబడుతు నిన్న ఒక కామెంట్ చేశాడు. కాంట్రాక్టర్ను, కార్పొరేషన్ బాధ్యుల పై కూడా కేసులు పెట్టాలంటూ ఏవేవో సంబంధంలేని కామెంట్లు పెట్టి నవ్వుల పాలయ్యాడు.
తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఇదే తరహలో మెగా కుటుంబం మెప్పు కోసం జర్నలిస్టులను కించపరిచినట్లుగా కామెంట్ పెట్టాడు. తప్పుడు వార్తలు రాస్తూ.. బతికేస్తున్నారంటూ వ్యంగ్యంగా స్పందించడంతో నెటిజన్లు సైతం అదే తరహాలో హరీశ్ శంకర్ పై దాడికి దిగారు. ‘మీ దృష్టి జర్నలిస్టుల తిండి గురించా? లేక చిరంజీవి కుటుంబం అభిమానం సంపాదించి నాలుగు తిండి గింజలు సంపాదించుకోవాలనే ఎత్తుగడనా?’ అని విమర్శలు గుప్పించారు. ప్రమాదం జరిగి ఎవరి బాధలో వారుంటే మధ్యలో తగుదునమ్మా అని వీళ్లంతా తమ నోటి దురుసును ప్రదర్శించి అభాసుపాలవుతున్నారు.