ప్ర‌శ్న: దేవుడు లేకుంటే.. మ‌రి మ‌న త‌ల్లి,దండ్రులెలా వ‌చ్చారు? పై నుంచి ఊడి ప‌డ్డ‌రా? దేవుడు లేకుంటే మ‌న త‌ల్లిదండ్రులు లేరు. మ‌న‌మూ లేము, అస‌లు ఈ సృష్టి లేదు. అర్ధ‌మైందా?

( ఒక మిత్రుడు ( త‌న అమాయ‌క‌త్వంతో లేదా గ‌డుసుత‌నంతో ) అడిగిన ప్ర‌శ్న ఇది. దేవుడు లేడు అని, నేను త‌ప్ప‌డు ప్ర‌చారం చేస్తున్నాన‌ని, ఆ మిత్రుడు (అత‌ను చిన్న వాడేం కాదు, పెద్ద‌వాడే..) నా మీద ఎంతో అస‌హ‌నంగా ఉన్నాడు..)

జ‌వాబు:
త‌ల్లీ, తండ్రీ లేకుండా ఏ పిల్ల‌లూ పుట్ట‌రు. ఇది అంద‌రికీ తెలిసిన నిజం. మ‌రి ఆ పిల్ల‌ల త‌ల్లీ, తండ్రీ ఎలా పుడ‌తారు, దేవుడు సృష్టించ‌క‌పోతే..? దేవుడు లేనిదే మ‌న త‌ల్లి, దండ్రుల సృష్టి జ‌రిగే అవ‌కాశం లేదు. అని చాలా అమాయ‌కంగా అడుగుతున్నారు. ఇది పూర్తిగా చిన్న పిల్ల‌లు అడిగే ప్ర‌శ్న. దీనికి ఎవ‌రైనా ఈజీగా స‌మాధానం చెప్ప‌గ‌ల‌రు. ఎవ‌రి త‌ల్లికైనా ఆమె స్వంత త‌ల్లి దండ్రులు ఉంటారు. అలాగే ఎవ‌రి తండ్రికైనా కూడా ఆయ‌న స్వంత త‌ల్లి దండ్రులుంటారు. మ‌రి ఆ త‌ల్లినే క‌న్న త‌ల్లిని (అంటే.. అమ్మ‌మ్మ‌ను) ఆమె భ‌ర్త‌ను సృష్టించాడా దేవుడు..? ఊహు కాదు! అలా కానే కాదు. వాళ్ల‌ను కూడా వారి వారి త‌ల్లిదండ్రులే కంటారు, క‌న్నారు. అంద‌రు వారి వారి త‌ల్లిదండ్రుల‌కే పుట్టాలి. అలాగే పుట్టారు కూడా? ఇంకా, ఇంకా వెన‌క్కి, వెన‌క్కి వెళ్లి స్ట‌డీ చేసి చూసినా స‌రే. అంటే.. మ‌న ముత్తాత‌కు, ముత్తాత‌, ఆ ముత్తాత‌కు, ఆపై ముత్తాత ఇలా ఎవ‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్లినా స‌రే.. వాళ్ల‌ను, వాళ్ళు భార్య‌ల‌ను కూడా.. వాళ్ల వాళ్ల త‌ల్లి దండ్రులే కంటారు. ఇది నిజం. ఇదే నిజం.. అంటే ఎంత‌టి వెనుక‌టి కాలానికి వెళ్ళి చూసిన, ప‌రిశీలించి, ప‌రిశోధించినా.. ఏ మ‌నుషుల లేదా ఏ జీవుల చ‌రిత్ర చూసినా… ఆ మ‌నుషుల‌కు లేదా ఆ జీవుల‌కు కూడా వారికి, వాటికి పూర్వం ఉన్న మ‌నుషులే జీవులే కంటాయి. కాని దేవుడ‌నే వాడు సృష్టించ‌డు.

ఒక‌వేళ అంద‌రి కంటే ముందు ఈ భూమ్మీద ఎవ‌రైతే ఉన్నారో, వారిని మాత్రం దేవుడే సృష్టించాడు. ఆ త‌ర్వాత త‌రం, త‌ర‌త‌రాలుగా పిల్ల‌ల్ని కంటూ నేటి వ‌ర‌కు చేరుకున్నారు అని దేవున్ని న‌మ్మేవారు వాదిస్తే.. మ‌రైతే ఆ దేవున్ని ఎవ‌రు సృష్టించారు అనే ప్ర‌శ్న వేయాల్సి వ‌స్తుంది. అదేంటి , దేవున్ని ఒక‌రు సృష్టించ‌డ‌మేంటి..? అని అంటారా? మ‌రైతే ఆ దేవుడు మ‌నుషుల్నీ, జీవుల‌ను సృష్టించ‌డ‌మేంటి అనే ప్ర‌శ్న రాదా? త‌ప్ప‌కుండా వ‌స్తుంది క‌దా.. కాబ‌ట్టి ఏ దేవుడూ, ఏ దేవ‌త ఈ జీవుల్నీ, ఈ ప్ర‌కృతిని. ఈ భూమిని లేదా ఈ విశ్వాన్ని సృష్టించ‌లేడు, సృష్టించ‌లేదు. ఎందుకంటే దేవుడ‌నే వాడు లేదా దేవ‌త అనేటామె ఎవ‌రు లేరు!! ఉండ‌రు!! అస‌లు దేవుడ‌నే వాడిని లేదా ఆ భావాన్ని, ఈ మ‌తాలను, మ‌తాచారాల‌ను సృష్టించిందే మ‌నిషి. మ‌నుషులు సృష్టించ‌క‌పోతే ఆ దేవుళ్ళూ, ఆ దైవ భావ‌న‌లూ ఉండ‌నే ఉండ‌వు. ఇవ‌న్నీ అర్ధం కావాలంటే జీవప‌రిణామా సిద్దాంతం, అలాగే మాన‌వ ప‌రిణామా క్ర‌మం ఇంకా విశ్వ ఆవిర్భావం, విశ్వ ప‌రిణామం, ప్ర‌పంచ నాగ‌రిక‌త‌, ప్ర‌పంచ చ‌రిత్ర, మ‌రీ ముఖ్యంగా పాఠ‌శాల స్థాయి నేచుర‌ల్ సైన్స్ స‌బ్జెక్టులు మొద‌లైన‌వి చ‌ద‌వాలి. లేదంటే అవి చ‌దివిన వారి నుంచి ఏదో ఒక ర‌కంగా తెలుసుకోవాలి. అంతే కానీ మా పెద్ద వాళ్లు న‌మ్మారు, ఆచ‌రించారు అని మ‌నం కూడా గుడ్డిగా దేన్నీ న‌మ్మ‌కూడ‌దు. అంటే దేవుడితో స‌హా ఏ మూఢ‌న‌మ్మ‌కాన్ని మ‌నం న‌మ్మ‌కూడ‌దు. ఆచ‌రించ‌కూడ‌దు. మోస‌పోకూడ‌దు. కావున సైన్స్ చెప్పే నిజాలేమిటో అంద‌రూ తెలుసుకోవాలి. హేతుబ‌ద్ధంగా ఆలోచిస్తూ ముందుకెళ్లాలి. మాన‌వుడు సంఘ జీవి. ఈ సంఘంలో, ఈ స‌మాజంలో సాటి మ‌నుషుల‌కు, ప్ర‌కృతికి న‌ష్టం చేయ‌కుండా, ఏ హానీ త‌ల‌పెట్ట‌కుండా … మ‌నం బ‌త్ర‌కాలి, ఇత‌రుల‌ను బ్ర‌త‌క‌నివ్వాలి.
SO YOU LIVE AND LET OTHERS ALSO LIVE…

ఫోటో వివ‌ర‌ణ‌: ప్ర‌స్తుతం ఈ భూమ్మీద నివ‌సిస్తున్న స‌మ‌స్త (Home Erectus అన‌బ‌డే ) మాన‌వ జాతి పూర్వీకురాలు ఒక‌ప్పుడు ( సుమారు 2ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల క్రితం) ఆఫ్రికా ఖండంలో రెండు కాళ్ళ‌పై తిరుగాడిన ఒక మ‌హిళ అని శాస్త్ర‌వేత్త‌లు ఒక అంచ‌నాకు వ‌చ్చారు. ఆవిడ‌కు కూడా త‌ల్లీ, తండ్రీ ఉంటారు. ఆవిడ ఎవ‌రితో పిల్ల‌ల్ని క‌న్న‌దో… అత‌నికి కూడా త‌ల్లీ తండ్రీ ఉంటారు. ఆ గ్రేటెస్ట్ గ్రాండ్ మ‌ద‌ర్ ఊహాచిత్ర‌మే ఈ ఫోటో.

చెలిమెల రాజేశ్వ‌ర్‌, జేవీవీ తెలంగాణ