బాయిల్డ్ రైస్ తీసుకోబోమని ఎఫ్‌సీఐ చెప్పడంతో ఇప్పుడు రైస్ మిల్లర్లు, రైతుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఇది ప్రభుత్వానికీ ఓ ప్రధాన సమస్యే. మొన్నటి వరకు ప్రభుత్వం మద్దతు ఇచ్చి, కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడమే కష్టమనే భావనలో ఉంది. ఇప్పుడు కొత్తగా కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమని ప్రకటించిన నేపథ్యంలో వరి కొనుగోలు సమస్య ఇటు ప్రభుత్వానికి , రైస్‌మిల్లర్లకు భారంగా మారనుంది.
- ఈ సమస్యకు పరిష్కారం.. వరి విస్తీర్ణం తగ్గించుకోవడం లేదా సన్న రకాలు వేసుకోవడం. ఈ రెండూ రైతులు పాటించడం కష్టమే. నీటి పారుదల పరిధి పెరిగింది. పుష్కలంగా సాగునీటి వనరులున్నాయి. వరి వైపే ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు.
- తక్కువ పెట్టుబడితో వరి సాగు చేయొచ్చనే స్థిరమైన అభిప్రాయంతో రైతులున్నారు. వేరు ఇతర పంటల వైపు మొగ్గు చూపడం లేదు. ఇక సన్న రకాల ప్రయోగం.. ప్రభుత్వం చేపించి చేతులు కాల్చుకుంది. సన్న రకాలకు ఎక్కువ పెట్టుబడి అవసరం. చీడపీడలు ఎక్కువ. రిస్క్ ఎక్కువ. మద్దతు ధర కచ్చితంగా ఇంత అని మార్కట్లో వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా దీనిపై చేతులెత్తేసింది.
- హరియానాలో ఓ సీజన్‌కే వరిని పరిమితం చేస్తారు. ఇంకో సీజన్‌లో ఇంకో పంట. కానీ మన దగ్గర రెండు సీజన్లూ వరి సాగే. ఖరీఫ్‌లో నయం… బాయిల్డ్ రైస్ తక్కువగా వస్తుంది. కానీ రబీలో 80 శాతం బాయిల్డ్‌కే వెళ్లాలి. లేదంటే అన్నీనూకలే. అందుకే మిల్లర్లు అటువైపు వెళ్తారు. ఈ ఉప్పుడు బియ్యాన్ని కేరళ, తమిళనాడులో మాత్రమే తింటారు.
- ఇప్పుడ ఈ బాయిల్డ్ రైస్ నిల్వలు మా దగ్గర సరిపడా ఉన్నాయంటున్నది కేంద్రం. మరి ఇప్పుడు రాబోయే ఖరీఫ్, వచ్చే రబీలో పరిస్థితి ఏంటీ? ఆ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి .. మిల్లర్లకు ఇస్తుంది. కానీ ఇలాంటి సమయంలో ఆ మిల్లర్లు తీసుకుంటారా?
- కొన్నిసార్లు రైతు మంచి రేటు వస్తే బహిరంగ మార్కెట్లో కూడా వడ్లు అమ్ముకుంటాడు. ఇప్పుడా పరిస్థితి ఉండదు.
- ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.