తెలంగాణలో విద్యా వ్య‌వ‌స్థ ఆగ‌మాగ‌మైంది. క‌రోనా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్ప‌టి నుంచి పాఠాలు అట‌కెక్కాయి. చ‌దువులు మూల‌ప‌డ్డాయి. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల పేరుతో విద్య కొంద‌రికే ప‌రిమిత‌మైంది. ప్ర‌భుత్వ విద్య‌ను న‌మ్ముకున్న విద్యార్థులంతా న‌ష్ట‌పోయారు. ప్రైవేట్ వ్య‌వ‌స్థ మీద ఆధార‌ప‌డ్డ విద్యార్థుల‌కూ అర‌కొర చ‌దువులే అందాయి.

ఏపీలో తెలంగాణ కంటే ముందు పాఠ‌శాల‌లు తెరిచారు. కొన్ని క‌రోనా కేసులు కూడా క‌నిపించాయి. మ‌రోవైపు థ‌ర్డ్‌వేవ్ ముప్పు పొం చివుంద‌నే సంకేతాలున్నాయి. ఇన్ని కార‌ణాలు, స‌మ‌స్య‌ల న‌డుమ మొత్తానికి తెలంగాణ ప్ర‌భుత్వం రేప‌టి నుంచి పాఠ‌శాల‌ల‌ను ప్రారంభించాలనుకుంది. కేజీ టు పీజీ విద్యా సంస్థ‌ల‌న్నీ తెర‌వాల‌ని భావించింది. కానీ హైకోర్టు ఈ రోజు హాస్ట‌ల్స్ మిన‌హా ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు నిర్వ‌హించుకోవ‌చ్చున‌ని చెప్పింది. త‌దుప‌రి విచార‌ణ అక్టోబ‌ర్ 4కు వాయిదా వేసింది. దీనిపై తెలంగాణ స‌ర్కారు అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని ఏర్పాటు చేసి హైకోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు రేప‌టి నుంచి పాఠ‌శాల‌ల ప్రారంభానికి స‌న్న‌ద్ధ‌మైంది.

ప్ర‌భుత్వ గురుకులాల‌తో పాటు, ప్రైవేట్ హాస్ట‌ళ్లు కూడా మూసివేసి ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల సౌక‌ర్యం కూడా క‌ల్పించింది. అయితే దీని పై ప్రైవేట్ స్కూల్స్ య‌జ‌మాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. కేవ‌లం డే స్కాల‌ర్ పిల్ల‌ల‌కే విద్య‌నందించి హాస్ట‌ల్ విద్యార్థుల‌కు చ‌దువును దూరం చేయ‌డం అవుతుంద‌ని భావిస్తున్నారు. అక్టోబ‌ర్ నాలుగు వ‌ర‌కు వేచిచూసి పూర్తి స్థాయిలో విద్యా సంస్థ‌లు, హాస్ట‌ళ్లు తెరిస్తే బాగుండేద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ గంద‌ర‌గోళ నిర్ణ‌యాల‌తో ఎవ‌రూ సంతోషంగా లేర‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. హ‌డావిడి నిర్ణ‌యాలు మ‌రింత ఆగ‌మాగం చేస్తున్నాయే త‌ప్ప విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా లేవ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రేప‌టి నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభ‌మైన త‌రువాత ఎదురుకాబోయే స‌మ‌స్య‌ల పై ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంది? ఎలా స్పందిస్తుంది? త‌ల్లిదండ్రులు అస‌లు పిల్ల‌ల‌ను స్కూళ్ల‌కు పంపుతారా? స్కూళ్లు తె ర‌వ‌డ‌మే త‌రువాయి ఫీజుల పేరుతో బ్లాక్‌మెయిల్ కొన‌సాగుతుందా? ఇవ‌న్నీ బ‌య‌ట‌ప‌డ‌నున్నాయి.

You missed