(దండుగుల శ్రీనివాస్)
ఏ చిన్న కారణం దొరికినా దాన్ని రాజకీయం చేసి నానా యాగీ చేసి హంగామా చేయడం ఇప్పటి రాజకీయాల్లో కామన్‌గా మారింది. ఇప్పుడు నడుస్తున్న టాపిక్ యూరియా కొరత. రైతులకు యూరియా సరిపడా అందడం లేదు. అంతటా ఈ కొరత ఉందా? అంతటా లేదు. కొన్ని చోట్ల ఉంది. ఎందుకు ఉంది. రావాల్సిన యూరియా స్టాక్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రాలేదు. ఎందుకు రాలేదు. ఏవో కారణాలు చెబుతూ కేంద్రం తాత్సారం చేస్తున్నది మాత్రం వాస్తవం. మహబూబాబాద్ ఇంకా పలు జిల్లాల్లో సరిపడా యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్న మాట నిజమే. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది. సర్కార్ ముందస్తు చర్యలు తీసుకోలేదా? బఫర్ జోన్ మెయిన్టేన్ చేయలేదా? బీఆరెస్ ఆరోపిస్తున్నట్టు… కేసీఆర్ అప్పుడు అన్ని చర్యలు తీసుకున్నారు.. ఇప్పుడు ఈ సర్కార్ పట్టింపులేనితనంతోనే ఇలా జరుగుతోందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేందీ? అధికార యంత్రాంగం చెబుతన్నదేందీ? అసలు వాస్తవలేమిటీ??
గత రెండేండ్లుగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. గతంతో పోలిస్తే ఈ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి గత సాగు విస్తీర్ణానికి కంటే 20 శాతం పెరిగింది. ఈ గణాంకాలు వ్యవసాధికారులే చెబుతున్నారు. ఈ సాగు విస్తీర్ణం వివరాలు ఏ ఏడాదికాయేడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి సేకరిస్తుంది.సాగు విస్తీర్ణం పెరగడంతో యూరియా వినియోగమూ పెరిగింది. సీజన్ ప్రారంభానికి ముందే అంటే మార్చి, ఏప్రిల్‌లోనే ఈ సీజన్‌కు సంబంధించిన కావాల్సినంత యూరియాను సరఫరా చేయాలి. కేంద్రం అంచనాల ప్రకారం రాష్ట్రానికి ఈ సీజన్లో 9.50లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపాలి. కానీ ఇప్పటి వరకు పంపింది మాత్రం 7.16 లక్షల మెట్రిక్ టన్నులే. ఇంకా 2 లక్షల మె.టన్నుల యూరియా రావాల్సి ఉంది. ఉక్రెయిన్ యుద్దాలని ఇంకేవో కారణాలను చెబుతూ కేంద్రం సరిపడా యూరియా పంపలేదు. దీనికి తోడు మనకు అందుబాటులో ఉన్న రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆరెఫ్సీఎల్)లో సాంకేతిక లోపాల కారణంగా ఉత్పత్తి ఆగిపోవడం కూడా కారణమైంది. దీంతో కేంద్రం పంపకున్నా.. ఇక్కడి నుంచి అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ వద్ద 20వేల మె. టన్నులు, సొసైటీల వద్ద 16వేల మె. టన్నులు, ప్రైవేటు డీలర్స్ వద్ద 35వేల మె. టన్నుల యూరియా ఉంది. దీన్ని సర్కార్ అవసరమైన చోటకు తరలిస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చేస్తున్నదని అధికారులు చెబుతున్నారు.
యూరియా కోసం బారులు తీరారని, చెప్పులు పెట్టారని ప్రతిపక్షాలు గట్టిగానే అర్సుకుంటున్నాయి. కానీ ఇక్కడి బీజేపీ నేతలు రాజకీయాలు మాట్లాడినట్టుగా రైతుల కోసంచేయాల్సింది మాత్రం చేయడం లేదు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి .. వీళ్లిద్దరూ ఇప్పటి వరకు కేంద్రాన్ని యూరియా గురించి అడగలేదు. అది తమకు పట్టని విషయంగానే చూస్తున్నారు. ఇక బీఆరెస్ మాత్రం సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు రైతు మీద సానుభూతి చూపే విధంగా రాజకీయానికే యూరియా కొరతను వాడుకుంటున్నదే తప్ప.. బీజేపీని మాత్రం డిమాండ్ చేయడం లేదు. కేంద్రాన్ని కనీసం మాటవరుసకైనా అడగడం లేదు. ప్రశ్నించడం లేదు. నిలదీయడం లేదు. వాస్తవంగా అక్కడి నుంచి సరైన సమయానికి యూరియా రాకపోవడమే ప్రధాన కారణమని బీజేపీ, బీఆరెస్‌లకు తెలుసు. కానీ ఈ రెండు పార్టీలకు రైతుల మేలు కన్నా రాజకీయాలే ప్రధానమైనట్టుగా వ్యవహరిస్తున్నాయి.
Dandugula Srinivas
Senior Journalist
8096677451