(దండుగుల శ్రీనివాస్)
ఇప్పుడు ఈ పత్రిక గురించి కాదు చెప్పుకోవాల్సింది. అది ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే చదవడం లేదు. ఇక్కడ అది కాదు విషయం. పొగిడీ, పొడిగీ.. పొగడ్తల్లో ముంచి ముంచీ.. అతిశయోక్తే అచ్చెరువొందేలా కీర్తించి కీర్తించి .. చివరకు కొంప ముంచి.. ఫామ్‌హౌజ్‌కే పరిమితం చేసినా తీరు మారలేదు. అదీ ఇప్పుడు ఇక్కడ చెప్పుకోబోయే టాపిక్. కాళేశ్వరంపై రగడ నడుస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రానే వచ్చింది. దోషులుగా కేసీఆర్, హరీశ్‌లని తేల్చారు. దీనిపై హరీశ్ వివరణ ఇచ్చుకున్నాడు. ఇంకా ఏమైనా ఉంటే ప్రజాభిప్రాయం తీసుకోవచ్చు. దాన్ని ప్రచురించుకోవచ్చు.
కానీ ఇలా బట్టలు చింపుకున్న చందంగా… స్వామిభక్తి పరాకాష్టకు చేరినట్టు ఈ హెడ్డింగేందీ? ఈ పోలికేందీ మూర్తీ? కేసీఆర్‌కు కీర్తి కండూతి జాస్తే. అది అందరికీ తెలుసు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మోసీ మోసీ కొంపముంచి ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేశారు. ఏదీ మంచి? ఏదీ చెడు?? ఎక్కడ నష్టం జరుగుతోంది? ప్రజలేమనుకుంటున్నారో మీరు చెప్పకపోతిరి. సారు తెలుసుకునేంత సీన్ లేదాయె! అందరూ నన్ను కీర్తించాలె. జాతిపితగా గాంధీ ఫోటో పక్కన నా ఫోటో పెట్టే రేంజ్ నాది అని ఆయన అనుకోవడము… మీరు దాన్ని గ్రహించి.. వీర విహారం చేయడమూ సరిపోయింది.
పర్యవసానం చూస్తేనే ఉన్నాం. ఇలా ఇప్పుడు.. ఇంకా.. ఈ సమయంలో కూడా మీరు మారకుండా .. సారూ మారకుండా.. ఆ పాత వాసనల వార్తలు.. ఆ కీర్తి కండూతి పరాకాష్ట పతాక శీర్షికలు అబ్బబ్బ చూడతరం కావడం లేదు మూర్తీ! ఎంతైనా పెద్దాయన నాడి తెలిసిన ఎడిటర్‌వే నువ్వు. అందుకే నీ సీటు సేఫ్‌గా ఉంది. ఆయన సీటే ముంచేశారు. అది తేలే వరకైనా మనం నోరు మూసుకుంటే బాగుంటుందేమో! మనం మంచి చేస్తున్నామనే ముసుగులో ఆసాంతం ముంచేస్తున్నామనే సోయి లేకనేనా? తెలిసీ చేస్తున్నామా? ఇది ఇప్పటికీ తెలుసుకోలేనంత అజ్ఞానంలో మన సారున్నాడా? లేక ఆ కీర్తి కండూతి మత్తు ఇంకా వదల్లేదా?

Dandugula Srinivas
Senior Journalist
8096677451
