(దండుగుల శ్రీనివాస్)
బీసీల మనసు గెలుచుకున్నది కాంగ్రెస్. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో చివరి అంకంగా ఎంచుకున్న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నా సక్సెసయ్యింది. ఇండియా కూటమికి చెందిన వంద మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లంతా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఢిల్లీ వేదికగా కేంద్రానికి వార్నింగ్ ఇచ్చి, తొడగొట్టి సవాల్ విసిరింది ఈ ధర్నా. బిల్లు ఆమోదం చేసే ఉద్దేశం మోడీకి లేదని చెబుతూనే.. ఢిల్లీలో ఇక ఇదే ఫైనల్ ఆందోళన.. ఇక గల్లీలో చూసుకుందాం రా! అని బీజేపీకి సవాల్ విసిరింది టీపీసీసీ. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. చిత్తశుద్దితో మేం బీసీల రిజర్వేషన్లు అమలు చేసేందుకు రెడీగా ఉన్నామని, డ్రామాలు ఆడటం డ్రామారావు అండ్ ఫ్యామిలీకే అలవాటని పనిలో పనిగా కేటీఆర్‌ను కూడా అర్సుకున్నారు రేవంత్‌రెడ్డి.
ఒకరేమో బీసీల కోసం పోరాడుతామంటున్నారు… ఇంకొకరేమో బీసీల మీద ఏం మాట్లాడటం లేదు.. ఈ బీఆరెస్సేమో అటూ ఇటూ కాకుండా ఉన్నది. అటూ ఇటూ కాని కేటీఆర్ వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నాడని ఘటుగా స్పందించారు రేవంత్‌రెడ్డి. బీఆరెస్ మోడీ చెప్పులు మోస్తున్నదని తీవ్రంగా విమర్శించారు సీఎం. అందుకే ఈ ధర్నాలో ఆ పార్టీ నేతలు పాల్గొనలేదని దుయ్యబట్టారు. 300 మంది ముఖ్యమంత్రులు చేయని సాహసోపేతమైన బీసీ కులగణనను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేపట్టిందని, 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. ఇప్పుడు అమలు చేసేందుకు చిత్తశుద్దితో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు సీఎం.
ఢిల్లీ ధర్నాలో సీఎం మాట్లాడిన మాటలు చూస్తే.. తాము బీసీలకు అమలు చేయబోయే 42 శాతం రిజర్వేషన్ల గురించి ఢంకా బజాయించి చెప్పేందుకే అన్నట్టుగా అనిపించాయి. కేంద్రం మీద , మోడీ విధానాలపై నమ్మకం లేదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసేందుకే అన్నట్టుగా కనిపించాయి. బీసీ వ్యతిరేక పార్టీ బీజేపీ అని మరోసారి చెప్పేందుకేనా అనే విధంగానే సాగింది ఆయన ప్రసంగం. ఇక ఢిల్లీలో బీసీల లొల్లి ఉండదు.. గల్లీలో చూసుకుందాం రా బిడ్డా అన్నట్టుగానే సీఎం సవాల్ విసిరి మరీ ధర్నాకు ముగింపునిచ్చారు. కాంగ్రెస్ చేపట్టిన ఈ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. బీఆరెస్, బీజేపీలు బీసీల విషయంలో ఒంటరైపోయాయి. వారిని ఒంటరి చేయడంలో కూడా ఈ ధర్నా సక్సెసయ్యింది.
Dandugula Srinivas
Senior JOURNALIST
8096677451
