(దండుగుల శ్రీ‌నివాస్‌)

అదేందీ..? ఈ హెడ్డింగ్ ఏదో తేడా కొడుతోంది అనుకుంటున్నారా?  అమ్మ‌కు అన్నం పెట్ట‌నోడు.. పిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేపిస్తాన‌న్న‌డ‌ట‌! ఇదీ అసలైన సామెత‌. కానీ దీన్ని మార్చాను కేటీఆర్‌కు అన్వ‌యిస్తూ. మ‌ధ్య‌లో ఆయ‌నేం చేశాడో పాపం! పాపం చెల్లెను బ‌య‌ట‌కు పంపి.. ప‌ట్టించుకోవ‌డ‌మే లేదు. తెలుసు కదా. అన్నీ నాకే. అంతా నేనే. పార్టీ నాదే. పార్టీపై పెత్త‌నం నాదే. కాబోయే సీఎంనూ నేనే! అందుకే  క‌దా చెల్లె క‌విత అలా బ‌య‌ట‌కు వ‌చ్చి బాహాటంగా ద‌య్యాల గురించి బ‌య‌ట‌పెట్టింది.

స‌రే, ఇప్పుడు అస‌లు సంగ‌తికొస్తా. మొన్న‌నే ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో క‌విత అన్న‌ది. ఏమని?  రాజ‌కీయం రాజ‌కీయ‌మే… అన్న అన్న‌నే. నేను అన్న కేటీఆర్‌కు రాఖీ కడుతా. డౌటేముంది? త‌న వైపు నుంచి క్లారిటీ ఇచ్చిందామె. మ‌రి కేటీఆర్ ఏం చేశాడు. జంప్ జిలానీ అయ్యాడు. రాఖీ పండుగ‌కు ఒక రోజు ముందే అంటే .. శుక్ర‌వారం రాత్రే ఢిల్లీ పారిపోయాడు. చెల్లె నుంచి త‌ప్పించుకోవ‌డానికి. రాఖీ క‌ట్టుకుంటే నీ సొమ్మేం పాయె కేటీఆర్‌! ఎంతైనా ఒక్క‌గానొక్క చెల్లె. గారాల చెల్లె. ఆమె పార్టీ కోసం ఎంతో చేసింది. ఇప్పుడు ఆమెను ఒంట‌రి చేసి.. రాజ‌కీయ కోణంలోనే చూస్తున్నావు త‌ప్ప‌.. ప్రేమ‌, మ‌మ‌తానురాగాలు, ఆప్యాయ‌త‌, అనురాగం.. నీలో మ‌చ్చుకైనా లేవే! ఇదే అనుకుంటున్నారంతా.

పాపం .. క‌విత‌క్క‌.. అన్న కోసం రాఖీ ప‌ట్టుకుని రెడీగా ఉంది. కానీ అన్నే ఢిల్లీ వెళ్లిపోయాడు. ఎందుకో తెలుసా? త‌నకు అక్కడ సోమ‌వారం ఓ ప‌ని ఉంది. దాని కోసం ఇప్పుడే అర్జెంటుగా ఎవ‌రో పిలిచిన‌ట్టు.. అక్క‌డ కొంప‌లు మునిగిపోతున్న‌ట్టు… పారిపోయాడు. క‌విత‌క్క లాంటోళ్లు చాలా మందే నీకు రాఖీ క‌ట్టేందుకు వ‌స్తార‌ని కూడా తెల్వ‌దా కేటీఆర్‌! ఎట్లాగూ అధికారంలో ఉన్న‌ప్పుడు మీరెవ్వ‌రికీ దొర‌క‌లేదు. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా అదే  తీరా?  మార‌రా?  మీ వాళ్లే అనుకుంటున్నారు. స‌రే గానీ, క‌విత‌క్క త‌రుపున రామ‌న్న‌కు రాఖీ పండుగ శుభాకాంక్ష‌లు.