(దండుగుల శ్రీనివాస్)
చెప్పేవి నీతులు.. చేసేవి ఇలాంటి చేష్టలు… అచ్చంగా కేటీఆర్ పనులు ఇట్లనే ఉన్నయి. పదేండ్లు పార్టీని భ్రష్టుపట్టించేశాడనడానికి అతని వ్యవహార శైలి, పార్టీకి జరుగుతున్న నష్టం.. కేసీఆర్‌కు మనసున పట్టకుండా చేస్తున్న పరిణామాలు .. ఇవన్నీ జనాలకు అర్థమవుతున్నాయి ఇప్పుడిప్పుడే. అంతా నాదే. అంతా నాకే. అంతా నేనే. మొత్తం మేమే.. ఇవే పోకడలు పార్టీని అధఃపాతాళానికి తొక్కితే.. అధికారాన్ని అందనంత దూరం చేశాయి. పాపం పండిందన్నట్టుగా ఓడిన తరువాత అన్నీ బయటపడుతున్నాయి. ఇంటి నుంచే మొదలైంది పోరు. పొట్ట చించుకుంటే కాళ్లమీద పడుతుందన్నట్టుగా కవిత నుంచే వచ్చింది తొలత బహిరంగ తిరస్కరణ. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరికిన దగ్గర నుంచే మొదలైంది పతనానికి నాంది. ఆమెను విడిపించేందుకు మొదలైన బీజేపీ ముందు మోకరిల్లే సన్నివేశం ఇవాళ ఇలా జనం ముందు ఆవిష్కృతమవుతోంది. కవిత దీన్ని బయటపెట్టింది.
ఉన్నదంతా కక్కేసింది. తనను విడిపించేందుకు బీజేపీతో దోస్తానకు సిద్దమైంది దయ్యం అని. దయ్యం అంటే అతగాడే. అదే అన్నగాడు. మరి కేసీఆర్ సపోర్టు లేదా? ఎందుకుండదు. పరిస్థితులు. తప్పలేదు. తనను జైలు పాలుచేసేందే బీజేపీ అంటే.. మళ్లీ దానితోనే జతకడతారా అనేది కవిత వాదన. తిరస్కరణ. బెదిరింపు. కానీ అంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు అదే బీజేపీతో అంటకాగినప్పుడు తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆశపడి ఊహల పల్లకిలో ఊరేగింది ఈమే కదా? అంటే ఇప్పుడెందుకు బీజేపీ అంటే మింగుడు పడటం లేదు. అదంతా తన రాజకీయ అస్తిత్వం కోసం తండ్రిని, అన్నను ఇరుకున పెట్టే ప్రయత్నమే.
అంతకు మించిన డ్యామేజీ లేదు. అంతకు మించిన బెదిరింపు కూడా లేదు. ఇప్పుడు మళ్లీ దీన్ని రచ్చ చేశాడు సీఎం రమేశ్. నా బంగారు పుట్లలో వేలు పెడితే నే కుట్టనా? అన్నట్టగా సీఎం రమేశ్ రెచ్చిపోయాడు. ఉన్నదున్నట్టు లేదు కనికట్టు అన్నట్టుగా అన్నీ బయటపెట్టాడు. ఇప్పుడు బయటపెట్టాల్సింది మరిన్ని బలమైన ఆధారాలే. దాదాపు కేటీఆర్ బట్టలిప్పేసినంత పనిచేశాడు. బీఆరెస్‌ను బరిబాతల నడి బజారులో నిలబెట్టినంతా చేశాడు.
కేసీఆర్‌ను మళ్లీ దవఖాన పాలు చేసేలానే ఉన్నాయి రమేశ్ మాటలు. ఇదంతా కేటీఆర్ నోటిదూల ఫలితం. ఇప్పుడే అంతగా రెచ్చిపోవాలా? ఉన్న లోపాలన్నీ తమ వద్దే పెట్టుకుని.. పనిగట్టుకుని పొద్దస్తమాను బీఆరెస్ సోషల్ మీడియా వేదికగా, తన నోటి దూల తోడుగా ఒకటే వాగుడు. బాగైందా?
Dandugula Srinivas
Senior Journalist
8096677451