(దండుగుల శ్రీనివాస్)
వేరు కుంపటి పెట్టి సాధించేదేమీ లేదు. కానీ తండ్రిని మాత్రం సాధిస్తున్నది. గారాల బిడ్డెను గుండెలపై పెట్టుకుని పెంచితే ఆ పాదాలే ఇప్పుడు గుండెలపై ఆ తండ్రిని తంతున్నాయి. ఇప్పుడు ఇదే టాపిక్ సోషల్ మీడియాలో. గత కొన్ని రోజులుగా కవిత దూకుడు నిర్ణయాలు, ఆలోచనలు, కార్యక్రమాలు బీఆరెస్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఓ వైపు కేసీఆర్‌కు ఆరోగ్యం బాగాలేదు. బయటకు రాని పరిస్థితి. ప్రశాంతంగా ఫామ్‌హౌజ్ లో సేదతీరని దుస్థితి. దీనికి ప్రధాన కారణం సొంత బిడ్డె కావడం దురదృష్టకరం. కనీసం ఆయన కలలో కూడా ఇప్పుడూ ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు.
కొడుకును సీఎం చేయాలనుకున్నాడు. అందుకనుగుణంగానే పావులు కదుపుతున్నాడు. ఓడిపోయి జనం బతికిపోయారు గానీ, ఇప్పటికే కేటీఆర్‌ను సీఎం చేసినా చేసి ఉండేవాడే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రానున్న రోజుల్లో కొడుకు పట్టాభిషేకం చేసి మరీ రాజకీయ జీవితానికి గుడ్‌బై చెప్పాలని యోచిస్తున్న పెద్దాయనకు బిడ్డె రూపంలో ఆటంకం వచ్చిపడింది. అది ఆషామాషీ ఆటంకం కాదు. తండ్రికే జై కొడుతుంది. కానీ ఆయనకు ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలే చేస్తుంది. బీఆరెస్ గొడుగు కిందనే ఉన్నా అంటుంది.. ఆ పార్టీ ముడ్డి కిందకే నీళ్లు తెచ్చేలా మాట్లాడుతుంది. ఆ దెయ్యం అన్నైతే కాదంటుంది.. టీవీల ఇంటర్వ్యూలలో తానే సీఎం.. ఏం తప్పేం ఉంది అని మనసులో మాట బయటపెడుతున్నది. రోజుకో రకంగా ఆమె చేస్తున్న చేష్టలు, మాట్లాడుతున్న మాటలు ఆ తండ్రిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఈ క్రమంలో గా షర్మిలే ఈమె కన్నా వంద రెట్లు నయం.. తండ్రిని బాధపెట్టే పని ఏనాడు చేయలే అని పోల్చి చూస్తున్నారు. పోలిక పెడుతున్నారు. కేసీఆర్‌పై సానుభూతి చూపుతున్నారు. షర్మిల అన్నకోసం పాదయాత్ర చేసింది. అన్న కాపాడుకోలేకపోయాడని, పట్టించుకోక ఆత్మగౌరవం దెబ్బతీశాడు కనుకే ఆమె బయటకు వచ్చి పార్టీ పెట్టే ఆలోచన చేసిందే తప్ప.. కవితలా అధికారం పోగానే సీఎం కుర్చీకే ఎసరు పెట్టేద్దామనే ఆలోచనతో కాదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రిని ఇబ్బంది పెట్టడం, అన్నకు అన్నింటా అడ్డుతగలడమే ఇప్పుడు కవిత ముందున్న తక్షణ కర్తవ్యం. కాదంటారా..?
Dandugula Srinivas
Senior Journalist
8096677451