(దండుగుల శ్రీనివాస్)
తొడలు చరుచుకుని చెప్పే సినిమా డైలాగులకు మించి వస్తోందా సౌండ్. చూస్కుందామంటే చూస్కుందాం. వస్తావా అంటే. రా. రా రా రా….. ఛాలెంజులు, ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా మారింది. ప్రతిపక్షం బలంగా ఉంటే.. అధికార పక్షం తొడలు చరిస్తే .. అందుకు ప్రతిగా రీసౌండ్ తొడల ఛాలెంజ్ చప్పుడు కూడా వస్తుంది. అదే వచ్చిందీరోజు కేటీఆర్ నుంచి. గట్టిగానే అర్సుకున్నాడు. రైతులకు మీరిచ్చిందేంది..? మీమిచ్చిందేందీ..?? ఏకరువు పెట్టాడు. ఏకిపారేశాడు. పిలిచినవ్ కదా చర్చకు. అయితే రా మరి. నేనే వస్తా. కేసీఆర్ ఎందుకు నీకు..? నేను సరిపోనా? అన్నడు. టైమ్ నువ్వు చెప్పినా సరే అన్నాడు. ప్రిపరేషన్‌కు మూడు రోజుల టైమ్ ఇచ్చాడు. నువ్వప్పటికీ ప్రిపేర్ కాకపోతే, రాకపోతే .. నేనే టైమ్ చెప్తున్న కాస్కో అన్నడు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో 11 గంటలకు వచ్చి కూసుంట. రా నీ మంది మార్బలమేసుకుని, రా నీ బలగాన్ని తోలుకుని.. అని ఛాలెంజ్ విసిరిండు.
రైతుభరోసా పేరిట 39వేల కోట్లు ముంచిండని లెక్కలు చెప్పిండు. రుణమాఫీ 50వేల కోట్లైతే 12వేల చేసి 21వేల కోట్లని అబద్దాలు చెబుతుండని, రైతులు గమనించాలని కోరిండు. వంద సీట్లు ఎట్ల గెలుస్తవోయ్… ఎవడేస్తడు నీకు ఓట్లు. ఇంకా ఆ మాయమాటలు చెబితే నమ్మెటోళ్లెవరు..? మీరూ పిచ్చోళ్లో ఎట్ల నమ్ముతరు వయా..? అని పనిలోపని విలేకరులనూ అర్సుకున్నడు. ఆ తరువాత సోమాజీగూడలో కలుద్దాం. చాయ్ బిస్కట్ తిందం అని లేచిండు. రేవంత్ తొట్టిగ్యాంగ్ ఒక్కటే సంతోషంగా ఉందని చెప్పిండు. వాళ్ల పేర్లు సోమాజీగూడలో చర్చించుకుందామన్నడు.
