(దండుగుల శ్రీనివాస్)
ఆ ప్రసంగంలో కేసీఆర్ ఊసులేకుండా ఉంటుందనుకున్నా. రేవంత్ కూడా ఆయన ప్రస్తావన లేకుండానే మాట్లాడుతామనుకున్నట్టున్నాడు. మొదట్ల కొంచెం ట్రై చేసిండు. నిన్ననే కదా ఆయన దవాఖన్ల షేరిఖయ్యింది. పాణం బాగలేకపాయె. తానే ఎట్లుంది ఏం కత అని అర్సుకునే. బాగా సూస్కోర్రని కూడా చెప్పె. మరిప్పుడు ఎట్ల తిట్టేది. తిట్టనిదే మాట ముందుకు సాగదు. ప్రసంగం పసందుగా ఉండదు. ప్రాసలో పస ఉండదు. ఎట్ల..? ఎట్ల…? మొదలు మాజీ ముఖ్యమంత్రి… అనే కాడి నుంచి షురువయ్యింది. చంద్రశేఖర్ రావూ…. అంటూ స్పీడందుకుంది. ఇగ ఆగలేదు బండి. మళ్లీ ప్రసంగం పరాకాయ ప్రవేశం చేసింది. వేదిక సందర్భం గుర్తు లేదు. కేసీఆర్ ఆస్పత్రిలో ఉంటే ఏంది..? ఏడుంటుంటే ఏంది..? అవునూ.. బాగనే ఉన్నాడంట కదా..! మరికెందుకు. దంచు. కానీ ఇంకా డిశ్చార్జి కాలేదే. కాకపోని. తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే. పరామర్శ… బాగోగులు కామనే. ఇక్కడ ముఖ్యమైన వేదిక. పెద్దల ముందు దంచి కొట్టే దంచేప్రసంగం కావాలి.
కేసీఆర్ మసాల లేకపోతే.. అంత దూకుడుగా ముందుకు పోదు. వేదిక మీదనే కాదు.. వేదిక ముందున్నోళ్లకు మంచి దంచుడు స్పీచ్ ఇస్తేనేగానీ .. కుదుటపడరు. అట్లనే నడిచింది ప్రసంగం. వంద లెక్కబెట్టి మరీ పంపించు షేర్ ఖాన్.. లెక్క తక్కువ కాకుండా చూస్కోఅని అక్కడ మగధీర.. షేర్‌ఖాన్‌కు సవాల్ విసిరితే.. ఇక్కడ రేవంతు.. ఖర్గేకు భరోసా ఇచ్చాడు. వంద తక్కు వ కాకుండా గెలిచి చేతికిస్తా .. మాలిక్…అదే మల్లిక్… ఒక్కటి తక్కువైనా నన్నడుగు. కరెక్టు సరిపోయింది. ఇక చూడు ఊపే ఊపు. వేదిక మీద కిందా. పనిలో పని బీఆరెస్‌కు కూడా సవాల్ విసిరిండాయన. ఏడాదిలో 60వేల సర్కార్ కొలువులిచ్చిన. ఇది యాడన్నదేశంల జరిగిందా..? మీకు డౌటుంటే.. ఈడికే.. ఎల్బీ స్టేడియంలకు ఆళ్లందర్నీ పిలిపిస్తా. తలకాయాలు లెక్కబెడదాం. ఒక్కటి ఒక్కటి తక్కువైనా.. మీ కాళ్ల దగ్గర వంగి పక్కకు పోతా. అన్నడు. ఇది కూడా మంచిగనే పేలింది. లాస్ట్‌కు పుసుక్కున… రా కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యి అసెంబ్లీకి రా.. అని అంటడేమో అనుకున్న అలవాటులో పొరపాటులా.
Dandugula Srinivas
Senior Journalist
8096677451
