(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ ఓ ట్రెండ్ సెట్టర్ అందులో అనుమానం లేదు. అది ఉద్యమకాలమైనా.. సీఎంగా పరిపాలనైనా. బాగా దగ్గరగా చూసిన కొద్ది మందికి మాత్రమే తెలుసు ఆయన మేకపోతు గాంభీర్యం. చాలా పిరికి. భయం. పైసా పిచ్చి లేదు గానీ అధికారం కోసం ఆయనేమైనా చేస్తాడు. ఎవరిని ఎలా వాడుకోవాలో.. ఎక్కడ ఎవరిని నిర్దాక్షిణ్యంగా తొక్కేయాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయాల్లో అందరినీ చూసుకుంటూ వచ్చాడు. అందరిలోంచి తనకు కావాల్సిన క్వాలిటీస్‌ను తీసుకుని తనను తాను తీర్చిదిద్దుకున్న రాజకీయ చాణక్యుడన్నమాట. అందుకే ఆయన ఇప్పటి రాజకీయాలకు ట్రెండ్ సెట్టర్.
తెలంగాణ రాకముందు.. వచ్చిన తరువాత రాజకీయాల నిర్వచనం మారింది. మార్చింది కేసీయారే. అధికారం వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవాలి. కాపాడుకోవాలె. పదికాలాలు పదిలంగా మనమే ఉండాలె. ఇదే తపన. ప్రభుత్వాన్ని కూల్చేస్తారనే భయం ఆదిలోనే అతన్ని వెంటాడింది. అందుకే ఆయన ప్రతిపక్షాలను బలహీనం చేసే పనిని తలకెత్తుకున్నాడు. దీనికి రాజకీయ పునరేకీకరణ అని పేరు పెట్టాడు. ఫోన్ ట్యాపింగ్ చేయడం కామనే. కానీ కేసీఆర్ దీనికి ప్రత్యేకతను తీసుకొచ్చాడు. ఎవరినీ వదల్లేదు. యథారాజా తథా ప్రజా అన్నట్టు కేసీయారే ఫోన్ ట్యాపింగ్‌ను ఎంకరేజ్ చేస్తుండని అంతా ఎగబడ్డారు. చివరకు నమస్తే తెలంగాణలో పనిచేసే జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపయ్యాయి.
ఏ చిన్న రిస్కూ తీసుకోదలుచుకోలేదు కేసీఆర్. ఎవరినీ నమ్మే పరిస్థితి లేదు. అందరినీ అనుమానించాల్సిందే. వాళ్ల ఫోన్లు ఏం మాట్లాడుకుంటున్నాయో వినాల్సిందే. ఏమాత్రం అనుమానం ఉన్నా.. దాన్ని ఫాలో అయి వ్యూహాన్ని విచ్ఛిన్నం చేయాల్సిందే. అప్పుడు గాని కంటినిండ నిద్రపట్టదు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాం పెరిగింది కేసీఆర్ పాలనలోనే. మరి అదే పంథా వేరే పార్టీలు అనుసరిస్తే మాత్రం దాన్ని ట్యాపింగ్‌ల ద్వారా తెలుసుకుని బట్టబయలు చేస్తాడు. పట్టిస్తాడు. పడేస్తాడు. ప్రతిపక్షాన్ని నిలబడనీయడు. అంతే. గెలిచి తీరాలి. అధికారం చేపట్టాలి. ఫోన్ ట్యాపింగ్ వర్దిల్లు గాక. పది కాలాలు బీఆరెస్ పాలన కొనసాగు గాక. ఇదే పాలసీ. కానీ కాలం మనం అనుకున్నట్టే సాగదు. తిరగబడుతుంది. అదే జరుగుతున్నది.
Dandugula Srinivas
Senior Journalist
8096677451