(దండుగుల శ్రీనివాస్)
ఒక రాజును గెలిపించుటకై… ఒరిగిన నరకంఠాలెన్నో…! కొడుకు కోసం ఆ తండ్రి చేస్తున్నదదే. ఆయన జీవిత లక్ష్యం అదే. చచ్చిపోయేలోపు అది జరగాలి. అధికార మార్పు జరిగి తీరాలె. యువరాజు పీఠం ఎక్కాలె. దాని కోసం ఏమైనా చేస్తాడు. పీఠం చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోతోంది. ఇంకా ఇంకా వెయిట్ చేయాల్సి వస్తోంది. ఆ తండ్రి లేకపోతే ఇక ఎప్పటికీ తను పీఠం ఎక్కడు. యువరాజు కాలేడు. అందుకే ఆ తండ్రి ఊపిరి ఇప్పుడు దీని కోసమే. ఒకే ఒక కారణం. తనను పీఠమెక్కించి ఆయన హాయిగా ఇక ఫామ్‌హౌజ్‌కే పరిమితమయిపోతాడు. అప్పటి వరకు ఆయన తపిస్తున్నాడు.
సమయం కోసం చూస్తున్నాడు. అందుకే నాన్నంటే ప్రేమ. నాకోసం పరితపిస్తున్న ఆయనంటే ప్రాణం. ఆయన కోరిక నెరవేరేందుకు నా వంతూ శ్రమిస్తున్నాను. వంశోద్దారకుడినై ఆయన పేరును నిలబెట్టి తండ్రి తగ్గ తనయుడని నిరూపించుకోవడమే మిగిలుంది. లక్ష్యం కోసం దేన్నీ లెక్క చేయని ఆయన తోవలో నడవాల్సి ఉంది. నాన్నంటే అందుకే ప్రాణం. అన్నీ నాకోసమే. అంతా గురించే ఆలోచన. ఇప్పుడాయన జీవితమే నా కోసం. అందుకే నాన్నకు ప్రేమతో… హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఇట్లు.. నీ వంశోద్దారకుడు.