(దండుగుల శ్రీనివాస్)
కవిత పార్టీ పెట్టడం ఖాయం. లేఖ రాజకీయాలు అందులో భాగమే. లీక్ ఉత్తదే. అంతా ప్లానింగ్ ప్రకారం జరుగుతున్న ఎపిసోడే. పార్టీలో ఎప్పటికైనా తన పరిస్థితి కరివేపాకు పాత్రేనని రెండున్నరేండ్ల కిందే డిసైడ్ అయ్యింది కవిత. కొత్త పార్టీ పెట్టాలనే తలంపు అప్పుడు వచ్చిందే. వచ్చిందే తడవు తన శ్రేయోభిలాషులతో ఆమె ఈ విషయంలో మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకున్నది. ఎప్పటికైనా కవిత సీఎం కావాలంటే బీఆరెస్‌లో ఉంటే కుదరదు… కొత్త పార్టీ పెట్టుకోవాల్సిందేననే అభిప్రాయాలే మెజారిటీగా వ్యక్తమయ్యాయి. ఇక సమయం కోసం వేచి చూస్తోంది ఆమె. జరుగుతున్న వరుస రాజకీయ పరిణామాలు ఆమెను మరింత డిప్రెషన్‌లోకి నెట్టేస్తున్నాయి. తన రాజకీయ ఉనికే గల్లంతు చేసే విధంగా బీఆరెస్‌లో అన్న పెత్తనం పెరిగిపోతూ వస్తోంది. ఇది ముందే ఆమె గ్రహించినా.. తన పరిస్థితి సొంత పార్టీలో ఇంత దారుణంగా ఉటుందని భావించలేదు. ఇక ఉపేక్షించేంది లేదనే నిర్ణయానికొచ్చింది.
రంగం సిద్దం చేసుకున్నది. కేసీఆర్‌కు లేఖ రాసేంత సీన్ ఎవ్వరికీ లేదు. అందులో ఆ కుటుంబంలో. అలాంటిది కవిత సాహసం చేసిందంటే అర్థం.. తనను పార్టీ నుంచి గెంటేయాలని. కేసీఆర్ అదే చేస్తాడు. తెలుసు ఆమెకు. ఆ తరువాత కవిత చేయాల్సింది చేస్తుంది. తెలంగాణ పేరునే లేకుండా చేసిన కేసీఆర్ లాగా .. తండ్రి వేసిన తప్పటడుగులు తను వేయకుండా చాలా జాగ్రత్తగా ప్రజల వద్దకు వెళ్లేందుకు రెడీ అవుతోంది కవిత. అందుకే తన పార్టీ పేరును తెలంగాణ జాగృతి పార్టీగానే ఉండేలా చూస్తున్నది. సామాజిక తెలంగాణే లక్ష్యంగా ఈ పార్టీ ఉండబోతుందనే ప్రచారం ముమ్మరంగా ఇప్పటికే చేసి ఉన్నారు.
కేసీఆర్ పాలనలో, పార్టీ నిర్వహణ, నిర్మాణంలో, తీసుకున్న నిర్ణయాల్లో జరిగిన తప్పిదాలే కవిత పార్టీకి ఆయువు పట్టుగా ఊతమిచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నదామె. ఇప్పటికే ఆమె అన్ని నియోజకవర్గాలలో కొందరితో టచ్‌లో ఉన్నది. సూత్రప్రాయంగా తను పెట్టే పార్టీ గురించి వారితో మాట్లాడి తనతో రావాల్సిందిగా కూడా ఆమె కోరింది. ఎక్కువ యువత ఆమె వెంటనే పోవడానికి సిద్దమవుతున్నారు. కేటీఆర్, కేసీఆర్ పెత్తనం, వారి పోకడలు నచ్చని హార్డ్ కోర్ బీఆరెస్ శ్రేణులు కూడా కవిత టార్గెట్ చేసింది. వారందరినీ లాక్కోనుంది.