(దండుగుల శ్రీనివాస్)
కేటీఆర్‌తో పోల్చితే హరీశ్ చాలా బెటర్. కింది స్థాయి నుంచి ఎదిగివచ్చిన లీడర్. కార్యకర్తల మనసెరిగి నడుచుకునే నాయకుడు. కష్టకాలంలో పార్టీని ఎలా విజయతీరాలకు చేర్చాలో తెలిసిన వ్యూహకర్త. మామను మించిన అల్లుడు. కేసీఆర్‌కు తెలుసు హరీశ్ సత్తా. కానీ పార్టీ పగ్గాలివ్వలేడు. పార్టీలో నెంబర్ టూ నూ చేయలేడు. పోనీ కేటీఆర్‌కు ఇద్దామా..? అంటే కొడుకుపై ఇంకా నమ్మకం కుదరలేదు కేసీఆర్‌కు. కేటీఆర్ చేస్తున్న చేష్టలలా ఉన్నాయి మరి. ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువు. ఇప్పుడైతే మరీనూ. అధికారం పోయిన తరువాత సోషల్ మీడియానే నమ్ముకున్నాడు.
ఆ సోషల్ మీడియాను కేటీఆర్ నడిపిస్తున్నట్టు లేదు. కేటీఆర్‌నే ఆ హ్యాండిల్స్ హ్యాండిల్ చేస్తున్నట్టున్నాయి. అందులో ఏది రాస్తే అదే కేటీఆర్ స్పీచ్ అవుతుంది. కొన్ని సార్లు చాలా చిల్లరగా. మరీ దిగజారి కూడా. ఏమన్నా అంటే అవును సీఎంగా ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడతలేడా..? అని సమర్థించుకుంటున్నాడు. కానీ హరీశ్ అలా కాదు. సమయానుసారం మాట్లాడతాడు. ఎక్కడ ఆవేశపడాలో అక్కడే. ఎక్కడ ఏం మాట్లాడాలో అదే సబ్జెక్టు. ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షాన్ని ఎలా ఇరుకున పెట్టాలో తెలుసు. అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షాలకు ఎలా ధీటుగా సమాధానం ఇవ్వాలో తెలుసు. అందుకే పార్టీలో ట్రబుల్ షూటరయ్యాడు. సరే, ఇప్పుడిదింతా ఎందుకట…? వస్తున్న.
ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ మా బాస్. ఆయనే సీఎం. ఆయనే పార్టీ ప్రెసిడెంట్ అని తనను ప్రశ్నలతో విసిగించే విలేకరులకు హరీశ్ చెబుతూ వచ్చే సమాధానాలు. కానీ ఇప్పుడు స్వరం మారింది. ఒకవేళ కేటీఆర్‌కే పార్టీ పగ్గాలిస్తే కూడా తను కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడిదే చర్చ. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలిస్తే ఇదే దుందుకుడుతనంతో పోతే అంతే సంగతులు. ఇప్పటికే కేటీఆర్‌కు ఏమాత్రం అహంకారం తగ్గలేదు. పైపెచ్చు కాంగ్రెస్ పాలనా లోపాలు శాపాలైన వేళ అది కేటీఆర్‌లో మరింత అహంకారాన్ని పెంచిందనే టాక్ ఆ పార్టీలోనే ఉంది. అంతో ఇంతో కేసీఆర్ మీదే ఆపార్టీ శ్రేణులకు నమ్మకం. ఇప్పుడు ఇదే సమయమని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటే పార్టీ ఇక లేచే పరిస్థితి ఉండదు.
మరి హరీశ్‌కు ఇస్తాడా..? అంటే. కుదరదు. హరీశ్ కేవలం కష్టకాలంలో పార్టీని కాపాడే ట్రబుల్ షూటర్. ఎన్నో అవమానాలు భరించాడు కేసీఆర్ చేత. కేటీఆర్ వల్ల. ఏదో ఒకరోజు కేసీఆర్ తనకలవాటైన దోరణిలో హరీశ్‌నూ మెడలు పట్టుకుని బయటకు నూకుతాడు. అదే వేరే విషయం. ప్రస్తుతానికైతే కేటీఆర్‌కు పగ్గాలిచ్చేందుకు సమయం కాదు. అనుకూలత లేదు. కేసీఆర్‌కు అసలు నమ్మకమే లేదు. అందుకే హరీశ్ … అది అయ్యేది కాదు పొయ్యేది కాదు.. అని తెలుసు. తన మానాన తను పనిచేసుకుంటూ పోతున్నాడు. ఒక్కసారి బయటకు వదిలారో. కేసీఆర్, కేటీఆర్‌ను తలదన్నే లీడర్ కాగల సత్తా హరీశ్‌కుంది.