(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు..)
ముందుగా ఊహించినట్టే వాస్తవానికి దగ్గరగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత పంథాకు శ్రీకారం చుట్టింది. భారీ అంచనాలకు పోకుండా రాష్ట్ర ఆర్థిక దీన పరిస్థితి పరిగణలోకి తీసుకుని ఆచితూచి బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 7 శాతం అంచనాలు పెంచి ఊహల పల్లికిలో ఊగకుండా కాస్త తగ్గి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 వార్షిక బడ్జెట్ రూ. 2.91 లక్షల కోట్లుగా ఉంది. ఆ బడ్జెట్ రూ. 3.15 లక్షల కోట్ల నుంచి రూ. 3.30 లక్షల కోట్లకు ఇస్టిమేట్ బడ్జెట్ అంచనా వేస్తారని భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా తెలంగాణ సర్కార్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను కేవలం రూ. 3.04 లక్షల కోట్లకే పరిమితం చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఆర్థిక పరిస్థితి దీన దయనీయంగా మారిందని చెబుతూ బడ్జెట్ సైజు తగ్గవచ్చనే విధంగా పరోక్షంగా హింట్ ఇస్తూ వచ్చారు. కానీ ఆర్థిక నిపుణులు మాత్రం ఎంత కాదన్నా .. రూ. 3.10 లక్షల కోట్లకు బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని భావించారు. వాస్తవం మాత్రం చాలా తక్కువ అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ముందే వెల్లడించింది. ఈ బడ్జెట్ పెన్షనర్లకు టెన్షన్ మిగిలింది. 2వేల పింఛన్ 4వేలకు పెంచుతామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. మహిళలకు మహాలక్ష్మీ కింద 2500 ఇస్తామన్న విషయాన్ని, నిరుద్యోగ భృతిని బడ్జెట్‌లో ఎక్కడా పేర్కొనలేదు. రైతుబంధు, చేయూత, మహాలక్ష్మీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కేవలం రూ. 56వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నది. ఆరు గ్యారెంటీల అమలుకు కనీసం రూ.80వేల కోట్లు కావాలి. ఇదిలా ఉండగా..రై\తుబంధుకు రూ. 18వేల కోట్లు కేటాయించింది. ప్రస్తుత సంక్షేమ పథకాల అమలుకు మరో రూ. లక్ష కోట్లు కేటాయించారు.
ఇక బీసీలకు గత సర్కార్ కంటే కొంత నయంగా రూ. 11వేలు కేటాయించింది. ఇక బడ్జెట్‌లో భారీ అంచనాలు లేకపోయినా గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం కూడా కొన్నింటిని పునరావృతం చేసింది. బడ్జెట్‌ను కొంత పెంచి చూపడానికి కృత్రిమ ఎత్తుగడలను ప్రయోగించింది. పన్నేతర రాబడిని ఎకాఎకిన రూ. 31వేల కోట్లకు పెంచి చూపింది. ప్రస్తుత పరిస్థితిలో పన్నేతర రాబడి రూ. 10వేల కోట్లకు మించడం లేదు. ఆ మాటకు వస్తే ఈ ఏడాది పన్నేతర రాబడి రూ. 6వేల కోట్లు మాత్రమే ఉన్నది. ఏకంగా రూ. 20వేల కోట్లు పెంచి చూపినట్లు స్పష్టమవుతున్నది. కానీ ,
ప్రభుత్వం ఇసుక తరలింపు, గనుల తవ్వకాలు వాటిపై దృష్టి సారించకపోవడం వల్ల ఈసారి రాబడి మరింత తగ్గింది.
గతంలో లాగే ఈసారి కూడా భూముల వేలం పై సర్కార్ ఆశలు పెట్టుకున్నది. బీఆరెస్ సర్కార్ పతకానికి ముందు ఎన్నికల హామీలలో భాగంగా రుణమాఫీ చేయడానికి కోకాపేట భూములను అమ్మి తంటాలు పడింది. ప్రస్తుత ప్రభుత్వం అదే బాటలో గచ్చిబౌలి భూములను వేలం వేస్తున్నది. ఇంకా ఆశలే లేని కేంద్ర ప్రాయోజిక పథకాల కింద రావాల్సిన గ్రాంట్లకు రూ. 22వేలు కోట్లు వస్తుందని అంచనా వేసింది. కానీ నిజానికి అది రూ. 5వేల కోట్లకు మించడం లేదు.
సొంత పన్నుల రాబడి ఈసారి 1.45 లక్షల కోట్లుగా రావచ్చని అంచనా వేసింది. ఈ రాబడి కాస్తా అటూ ఇటూగా ఉన్నా బడ్జెట్‌లో కొంత పెంచి చూపారనే చెప్పవచ్చు.
అయితే సొంత పన్నుల రాబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ సంక్షేమ ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్నది. ఆదాయానికి, వ్యయానికి మధ్య భారీ తేడా కనిపిస్తున్నది. దాదాపు రూ. 70వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు కనిపిస్తున్నది.
ఒకే ఒక ఆశ ఏమిటంటే.. కేంద్ర పన్నులలో రాష్ట్ర వాటాగా వచ్చే మొత్తం పెరగుతున్నది. ప్రస్తుత సంవత్సరం రూ. 25వేల కోట్లు సమకూరుతుందని భావించగా, అది ఈ సారి రూ. 26వేల కోట్లు దాటింది. జీఎస్టీ తరువాత మద్యం ఆదాయం అంతోఇంతో ఆదుకుంటున్నది. మద్యం ప్రత్యక్ష అమ్మకాలు వ్యాట్ పన్ను విధింపు ద్వారా అబ్కారీ శాఖ నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా రూ. 40వేల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నది.
ఇక రాష్ట్ర పరిస్థితి బాగా లేకున్నా..ప్రజల తలసరి ఆదాయం బాగా పెరుగుతున్నదని సోషియో ఎకానమీ సర్వేలో వెల్లడించింది. రాష్ట్ర మొత్తం స్థూల ఉత్పత్తి, మొత్తం సంపద ఈసారి పది శాతానికి పెంచుతూ అంచనా వేసింది. అయితే గత సంవత్సరం రూ. 15లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీకి ఈసారి రూ. 16,50 లక్షల కోట్లకు అంచనా వేసింది.
దీని ద్వారా 3 లక్షలుగా ఉన్న ప్రజల తలసరి ఆదాయం రూ. 3.30లక్షలకు పెరిగింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ను రైతు తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వాస్తవానికి కొంత దగ్గరగా ఉండటంతో ఈసారి భిన్నంగా కనిపిస్తుంది.