(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని గంటలలో శాసనసభలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రెండోసారి బడ్జెట్‌ను ఉభయ సభల ముందుంచనున్నారు. ఈసారి బడ్జెట్‌ను భారీగా పెంచుతారా..? పరిమితంగా ఉంచుతారా..? లేక మళ్లీ అంకెలమాయ చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ బడ్జెట్ రూ. 3.10 లక్షల కోట్లుంటే కొంత వాస్తవికతను పాటించినట్టవుతుంది. కానీ రూ. 3.10 లక్షల కోట్లు దాటితే అది మళ్లీ కాకిలెక్కల తప్పుల తడకగా మారిపోతుంది. వాస్తవానికి, గత సంవత్సరం రూ. 2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ రెవెన్యూ పరంగా భారీలోటు ఏర్పడింది.
బడ్జెట్ పద్దులో అప్పుల భాగమే ఎక్కువ కనిపిస్తుంది. ఆదాయానికి, వ్యయానికి మధ్య ద్రవ్యలోటు దాదాపు రూ. లక్ష కోట్ల వరకు ఎగబాతుండటం ఆందోళన పరిణామంగా మారింది. రికార్డుల పరంగానే ద్రవ్యలోటును.. అంటే అప్పులను ఒక సంవత్సరానికి రూ. 70వేల కోట్ల బడ్జెట్‌లో చూపకతప్పని పరిస్థితి. ఈ ఏడాది ఇప్పటికే ఆ పరిమితి దాటిపోయింది. ఆదాయం చారాణా, ఖర్చు బారాణా అన్నట్లు పరిస్థితి మారిన క్రమంలో బడ్జెట్ కూర్పులు చేర్పులు మార్పులు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
స్వయంగా ముఖ్యమంత్రే అప్పులు కొండంత, ఆదాయం అంతంత అని ముందు నుంచే ఫీలర్ వదలడంతో బడ్జెట్ సైజును మరీ పెంచడానికి వీలు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీయలేదు. గత ప్రభుత్వం తప్పులను సరిచేస్తున్నాం అని చాటి చెప్పడానికి బడ్జెట్ సైజును మరీ అమాంతంగా పెంచకుండా, మధ్యేమార్గాన్ని అనుసరించే పరిస్థితి కనబడుతున్నది. పన్నేతర ఆదాయాన్ని మళ్లీ భారీగా చూపే అవకాశం ఉంది. భూముల అమ్మకం ద్వారా భారీగా నిధులను సమీకరించుకుంటామని బడ్జెట్‌లో చూపనున్నారు.
వాస్తవానికి ఇసుక మైనింగు వంటి రాబడిని పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు విఫలమైంది. రియల్ ఎస్టేట్‌లో బడాభవనలకు అనుమతులు ఇవ్వకుండా కట్టడి చేయడంతో అక్కడ కూడా ఆదాయానికి, రాబడికి గండిపడింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 20 శాతానికి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను కూడా భారీగా పెంచి చూపనున్నారు. ఈ రెండు పెంచి చూపకపోతే బడ్జెట్ సైజు అసలు పెరగడానికి వీలులేదు.
అది పెరగాలంటే ఇది పెంచి చూపక తప్పని పరిస్థితి. దీంతో పాటు రాష్ట్ర సొంత పన్నుల రాబడికి ఎంత వరకు పెంచి చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి సొంత పన్నుల రాబడి మొత్తం ఆదాయంలో 70 శాతంగా ఉంది. రూ. 2.10 లక్షల కోట్లలో సొంత పన్నుల రాబడే రూ. 1.60 లక్షల కోట్లు దాటుతుంది. కానీ, ప్రతి ఏడాది ప్రస్తుత రాబడి కంటే 15శాతం నుంచి 17 శాతం మేర పెరుగుతుందనే అంచనా వేసి బడ్జెట్ సైజును అమాంతంగా పెంచుతుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరంలో ఆరు గ్యారెంటీల అమలు కోసం దాదాపు రూ. 54వేల కోట్లు కేటాయించింది. ఈసారి అది కొంత పెంచే అవకాశం ఉంది. ఎంత పెంచినా ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి అది రూ. 70వేల కోట్లు మించే పరిస్థితి లేదు. అంటే ఆరు గ్యారెంటీల అమలు ప్రభుత్వానికి గుదిబండగా మారింది. గ్యారెంటీలలో కోత విధించినా ఆశ్చర్యం లేదు.
కానీ, గత కొన్ని సంవత్సరాలుగా రాబడిలో అంత భారీ స్థాయిలో పెరుగుదల లేదు. ఈసారి ఆ పరిస్థితి మరింత తీసికట్టుగా మారింది. ఈ రాబడిని 10 శాతం నుంచి 15శాతానికి మించి పెంచి చూపించే పరిస్థితి లేదు. ఒక్క కేంద్ర పన్నుల వాటాలో మాత్రమే పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం దాదాపు రూ. 20వేల కోట్ల వరకు వాటాను మరో రూ. 5వేల కోట్లకు పెంచి చూపే పరిస్థితులున్నాయి. ఇక సంక్షేమ రాజ్యంగా మారిన తెలంగాణలో ఆర్థిక సంక్షోభం మితిమీరుతోంది. లక్ష్మణ రేఖను దాటింది. అభివృద్ధికి , భవిష్యత్ ప్రాజెక్టుల నిర్మాణానికి భారీగా నిధులను కేటాయించే పరిస్థితి లేదు.
పెట్టుబడి వ్యయాన్ని ఈసారి 10 శాతం నుంచి 12 శాతం వరకు .. అంటే రూ. 40వేల కోట్ల వరకు చూపే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా ఈ అభివృద్ధిపై కేటాయించే నిధుల శాతం తగ్గుతూ వస్తోంది. మరో వైపు మన రాష్ట్ర స్థూల ఆదాయం , రాష్ట్ర దేశీయ స్థూల ఆదాయం (జీఎస్‌డీపీ) ఎంత వరకు రికార్డులో చూపుతున్నారనేది ఆసక్తికరంగా ఉంది. వాస్తవానికి , ఆ లెక్కలు కూడా గాడి తప్పుతున్నాయనే విమర్శలు ఉండనే ఉన్నాయి. రూ. 16లక్షల కోట్లుగా ఉన్న జీఎస్‌డీపీని ఈసారి పదిశాతం అంటే… రూ. 18లక్షల కోట్లకు అంచనా వేసి చూపే అవకాశం ఉంది.