థర్ఢ్ వేవ్ భయం వెంటాడుతున్నది. ఇది చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందనే ప్రచారం నేపథ్యంలో పిల్లలను స్కూళ్లకు పంపాలంటేనే తల్లిద్రండులు భయపడుతున్నారు. వచ్చే నెల 1నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఆన్లైన్క్లాసులు బంద్ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశిస్తున్నది. అంటే కచ్చితంగా స్కూళ్లకు పంపాల్సిందేననే సంకేతాలిస్తున్నది ప్రభుత్వం. కానీ ఏపీలో ఇక్కడి కంటే ముందే ఈ ప్రయోగం చేశారు. అక్కడక్కడా కేసులు నమోదువుతున్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు డిసెంబర్ వరకు థర్ఢ్ వేవ్ ముప్పు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. మూడో వేవ్ కూడా కాస్త వేగంగా వచ్చే అవకాశం ఉందని హెచ్చరికల మధ్య ..అది చిన్న పిల్లలను టార్గెట్ చేస్తుందనే ప్రచారం అన్నీ కూడా జనాలను కంగారు పెడుతున్నాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు ఆంక్షలు సడలించే దశలో ఉన్నాయి గాని ఏ మూలో ఒక భయం అలాగే ఉంది.
కొద్ది రోజుల కోసమే స్కూళ్లు తెరిచి.. ఫీజులు పేరుతో మళ్లీ దోపిడీ మొదలవుతుందని కొందరు.. కరోనా బారిన పడితే ప్రాణాలకే ముప్పు అని మరికొందరు వాదిస్తున్నారు. కాగా పాఠశాలల మేనేజ్మెంట్లు సైతం మళ్లీ కొద్ది రోజులకే స్కూళ్లు మూయాల్సిన పరిస్థితి ఏర్పడితే తమ ఆర్థిక స్థితిపై ఇంకా ఘోర ప్రభావం ఉంటుందని హడలిపోతున్నారు. ఇలా ఎవరికి వారే ఆలోచనలు చేస్తున్నారు. ఎవరి అంచనాల్లో వారున్నారు. పాఠశాలలు తెరిచే టైం దగ్గర పడుతున్నది. తల్లిదండ్రుల గుండెల చప్పుడు కూడా పెరుగుతున్నది.
