ఊరు స‌ర్పంచంటే ఊరికి పెద్ద దిక్కు. ఆ ఊరి ప్ర‌థ‌మ పౌరుడు. ప‌ల్లె అవ‌స‌రాలు తీర్చేవాడు. ప‌ల్లె జ‌నాల క‌ష్ట సుఖాల్లో పాలుపంచుకునేవాడు. ఓ ప‌ర‌ప‌తి, ఓ ద‌ర్పం. హుందాత‌నం. గౌర‌వ, మ‌ర్యాద‌లు .. ఇవ‌న్నీ ఆ ప‌ద‌వి వెంటే వ‌స్తాయి. కానీ ఈ ఊరు స‌ర్పంచుకు ఇదే పెద్ద శాపంలా మారింది. తీర‌ని అప్పుల పాలు చేసింది. ఈ ప‌ద‌వినే ప‌ట్టుకునే కూసుంటే తినేందుకు తిండి కూడా క‌ష్టంగా మారింది. ఎక‌రం భూమిలో అర ఎక‌రం అమ్మేసుకున్నాడు. ఇంతా చేసినా.. అత‌ని క‌ష్టాలు తీర‌లేదు.దీంతో అత‌నో నిర్ణ‌యానికొచ్చాడు.

నైట్ సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేయాల‌ని.

ఆరు నెల‌లుగా అత‌ను చేస్తున్న‌ద‌దే. పొద్దున స‌ర్పంచ్‌గిరీ.. సాయంత్రం 6 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల దాకా ఓ అపార్ట్‌మెంటుకు సెక్యూరిటీ గార్డు.

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండ‌ల ప‌రిధిలోని ఆరెప‌ల్లి స‌ర్పంచ్ ఎసురు మల్లేష్ దీన‌గాథ ఇది. ద‌ళితుడు. ఊరోళ్లంతా క‌లిసి ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ప్ర‌భుత్వం నుంచి ప‌దిహేను ల‌క్ష‌ల న‌జ‌రానా వ‌స్తుందేమో.. ఊరి బాగుకోసం ఉప‌యోగ‌ప‌డ‌తాయోమో అని అనుకున్నారు. అవి ఇంత వ‌ర‌కూ రాలే. నాలుగేండ్లు గడుస్తున్నాయి స‌ర్పంచ్ గిరీ చేయ‌వ‌ట్టి. నిధులు లేవు. జీతాలు ఇచ్చేందుకు కూడా స‌రిప‌డా ఆదాయం లేదు. దీంతో చిన్నా చిత‌క ఖ‌ర్చుల‌న్నీ త‌నే భ‌రిస్తున్నాడు. బిల్లుల వ‌చ్చిన త‌ర్వాత తీసుకుందాం లే అనుకున్నాడు మొద‌ట‌. ఈయ‌న పెట్టే ఖ‌ర్చులు త‌ల‌కు మించిన భార‌మే అయి కూర్చున్నాయి గానీ.. స‌ర్కారు నుంచి నిధులు లేవు.. బిల్లుల చెల్లింపు లేదు. చూసీ చూసీ .. త‌న‌కున్న ఎక‌రం భూమిలో నుంచి అర ఎక‌రం అమ్ముకున్నాడు ప‌దిల‌క్ష‌ల‌కు. ఇలాగే కొన‌సాగితే ఇక ఉన్న అర ఎక‌రం కూడా అమ్ముకోవాల్సి వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డి సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేసుకుంటున్నాడు.

స‌ర్పంచునైతే ఊరికి సేవ చేయొచ్చ‌నుకున్నా.. కానీ ఇలా ఉరేసుకునే ప‌రిస్థితులు వ‌స్తాయ‌నుకోలేదు. మూడు నెల‌లుగా జీతాలిచ్చేందుకే దిక్కులేదు. ఇక ప‌నులు చేసేందుకు పైస‌లేడుంట‌య్‌. ఎమ్మెల్యే ప‌ట్టించుకోడు. ప్ర‌భుత్వం ఫండ్స్ ఇయ్య‌దు. ఇగ ఈడ సర్పంచుగిరీ చేసి ఏం చెయ్యాలె. ఇంట్ల పెండ్లాపిల్ల‌ల‌కు తిండి కూడా పెట్ట‌లేని ప‌రిస్థితి ఉంది. అందుకే సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేసుకుంటున్న. అన్నాడు మ‌ల్లేష్‌.

You missed