సోషల్ మీడియాలో ఓ సీనియర్ జర్నలిస్టు తన వాల్‌పై పెట్టుకున్నాడు. ‘విలేకరిబంధు’ కావాలి అని. దళితులకన్నా అద్వాన్నమైన స్థితిలో విలేకరులున్నారు నిజమే. బానిస బతుకులు బతుకుతున్నారు వాస్తవమే. ఫాల్స్ ప్రిస్టేజ్‌లో పడి జీవితాలు ఆగం చేసుకుని, కుటుంబాలను రోడ్డు పాలు చేసుకుంటున్నారు.. ఇదీ నిజమే! కాదనలేని సత్యమే.!! కానీ,
మన ఓట్లెన్ని..? మనతో ఏం పని సర్కారుకు. తెలంగాణ వచ్చిన తర్వాత విలేకరులను ఎవలన్నా దేకుతున్నరా? ఎవరైనా పట్టించుకుంటున్నరా? సర్కారైతే విలేకరులను గంజిలో ఈగలెక్క తీసి అవతల పడేసింది.
హెల్త్కార్డులన్నది. సంక్షేమ నిధి అన్నది. డబుల్ కాదు.. ట్రిపుల్ బెడ్రూంలన్నది. ఇంటి స్థలాలన్నది. అబ్బబ్బ.. ఏమోమో అన్నది. మనం మాత్రం ఉబ్బిపోయి.. ఉబ్బితబ్బిబ్బై.. ఇలా ఉబ్బసం వచ్చి ఓ మూలకు పడి ఉన్నాం. కాదంటావా మిత్రమా?
నీకో విషయం తెలుసో లేదో…
డబుల్ బెడ్రూంలపై పేదోళ్లకు ఆశపోయింది. ‘ఇగ ఈళ్లు కట్టిస్తరు. మేం సూస్తం’ అన్న కాడికి వచ్చిండ్రు.
కానీ, మన విలేకరులకు మాత్రం ఆశ చావలేదే అన్నో..! లైన్ అకౌంట్ల పేరుతో వార్తలు కొలిచి ఇచ్చే గొర్రెతోక బెత్తెడు మొత్తాన్ని కూడా ఏండ్లకు ఏండ్లు ఇయ్యకపోయినా .. ఓ చెట్టు కింద అలా పడి ఉంటారు. జీతాలు బత్తేలు లేకపోయినా.. ప్రెస్‌క్లబ్ దగ్గర అలా బాతాఖానీ వేసుకుంటూ బతుకీడుస్తూ ఉంటరు.
ఇంట్ల కుండలు కొట్లాడినా… ఇస్త్రీ నలగని అంగీ ఏసుకునేందుకు ఇబ్బందులు పడినా.. విలేకరి గిరిలోని దాదాగిరీని ఇష్టపడుతా ఉంటరు.
అయినా వదలరు. బేతాళుడిలా … గబ్బిలంలా పట్టుకుని వేలాడుతూనే ఉంటారు.
‘ఎందుకో తెలుసానే..?’
సర్కారు వాళ్లు రేపిచ్చే (?) డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం.
అంతటి నమ్మకం మనోళ్లకు. అంతటి ఆశావాదులు మనోళ్లు. అంతటి ఓపికమంతులు విలేకరులు.
ఈళ్లకు కచ్చితంగా ఇయ్యాల్సిందే విలేకరిబంధు. కానీ.. విలేకరిగిరే బందు అయ్యే ప్రమాదంలో పడిందే. దాని ఉనికే సచ్చిపోయిందే. ఇంక దీన్ని గుర్తించి .. ఇందులో పనిచేసేవాళ్ల గురించి పట్టించుకుని బంధులు, గింధులు ఇస్తారంటవానే రిపోర్టరన్నా..!
విలేకరిగిరే బందు చేసేస్తే పోతది కదా అని వాళ్లు ఆలోచించేలా ఉన్న ఈసమయంలో
‘విలేకరిబంధు’ అడగటం సమంజసంగా లేదేమోనే.