ఒక్క ఈటలను ఎదుర్కొనేందుకు కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. అందరినీ బరిలోకి దింపాడు. శక్తులన్నింటినీ మోహరించాడు. నోటిఫికేషన్ త్వరలో ఉందనే సంకేతాలు అందుకున్న అధికార పార్టీ తన దూకుడును మరింత పెంచింది. ట్రబుల్ షూటర్ హరీశ్‌రావును రంగంలోకి దింపింది. ఇక అసలైన ఫైట్ ఇప్పుడే మొదలైంది. మొన్నటి వరకు మిత్రులుగా కలిసి మెలిసి ఉన్న హరీశ్, ఈటల ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో మాటల యుద్దానికి దిగారు. హరీశ్ తన సహజశైలిని హుజురాబాద్ ఎన్నికల కోసం త్యగాం చేశాడు. అబద్థపు ప్రచారాలు చేసేందుకు , ప్రలోభాల హామీలిచ్చేందుకు కూడా వెనుకాడడం లేదు.
పనిలో పనిగా ఈటలను ఆత్మ సంరక్షణలో పడేసేందుకు బట్ట కాల్చి మీదేస్తున్నాడు. బద్నాం చేస్తున్నాడు. ప్రజల వద్ద విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు. హరీశ్ కదలికలకు, వ్యవహర శైలికి ఈటల నోరెళ్లబెడుతున్నాడు. ఇక తాను మాటల యుద్ధానికి తెర తీశాడు. హరీశ్ రావు ఎన్ని సార్లు ఏడిచాడో తెలుసునని హరీశ్‌ను ఆత్మ సంరక్షణలో పడేసే ప్రయత్నం చేశాడు ఈటల. ఇంకొ అడుగు ముందుకేసి నీ వ్యవహరం నాకు తెలుసు.. అని కూడా నర్మగర్భంగా హరీశ్ రహస్యాల చిట్టా విప్పుతానని కూడా చెప్పుకొచ్చాడు.
పుట్టి పెరిగిన బుద్ధి మేనమామలకెరుక అంటారు. ఇప్పుడు ప్రగతిభవన్‌లో ఏం జరుగుతుందో, జరిగిందో.. ఫాంహౌజ్‌లో ఏం జరిగిందో ఈటలకు తెలుసు. హరీశ్‌కూ తెలుసు. పొట్టచించుకుంటే కాళ్లమీద పడుతుందన్నట్లు ఈ ఇద్దరి వ్యవహరం గడీల రహస్యాలను రోడ్డున పడేసేలా ఉన్నాయి. అబద్ధపు ప్రచారాలతో ఈటలను సమాధి చేద్దామని హరీశ్ చూస్తుండగా.. రహస్యాల చిట్టాలన్నీ విప్పుతాననే రేంజ్‌లో ఈటల సైలెంట్ కిల్లింగ్ మాటలు వదులుతున్నాడు.
పనిలో పనిగా నా లెక్కనే నీ పనీ అవుతుంది హరీశ్ అని ఈటల వ్యంగ్యంగా మాట్లాడిన తీరు చర్చనీయాంశమైంది. తనను ఏ విధంగా అవసరానికి వాడుకుని, అవమానించి బయటకు గెంటేశారో .. కేసీఆర్ హరీశ్‌ను కూడా మెడలు పట్టి గెంటేసే రోజు వస్తుందని ఈటల జోష్యం చెప్పడం అక్కడి గడీల రహస్యాల బహిర్గతంలో భాగంగానే అనుకోవచ్చు.
ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ ఇద్దరు బస్తీ మే సవాల్ అనే రీతిలో కుస్తీ పడుతున్నారు.
ఇక మున్ముందు ఈ మాటల దాడి ఎంత వరకు పోతుందో చూడాలి. కొత్త రహస్యాలు ఎన్ని ప్రజలకు తెలియజేస్తారో ఆసక్తిగా వినాలి.