వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. సినీ ఇండస్ట్రీలో రాజకీయ జోక్యం పెద్దగా ఉండేది కాదు. వారి గోల వారిది. వారి సమస్యలు వారివి. కానీ చాలా ఏండ్ల తరువాత తెలుగు ఇండస్ట్రీకి కొత్త సమస్య వచ్చి పడింది. అది కార్మికుల వేతన పెంపుదల రూపంలో. దీన్ని పరిష్కరించడం నిర్మాతల తరం కాలేదు. చర్చలు చేయడం .. ఆ చర్చలు విఫలం కావడం.. ఇలా నెలల తరబడి జరగుతూ వచ్చింది. సినీ ఇండస్ట్రీ పెద్దలు, హేమాహేమీలు కూడా జోక్యం చేసుకున్నా సమస్య పరిస్కారం కాలేదు. తెలుగు సినిమా షూటింగులన్నీ నిలిచిపోయాయి. కోట్ల ప్రాజెక్టులు పడకేశాయి.
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో చివరకు చిరంజీవి కూడా రెండు మూడు పర్యాయాలు నిర్మాతలు, కార్మికులతో కలిసి చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. తెలుగు ఇండస్ట్రీని అంతర్జాతీయంగా ఆకట్టుకునేలా హైదరాబాద్‌ను అన్ని విధాలుగా రెడీ చేస్తున్న సర్కార్‌కు ఇది పంటికింద రాయిలా మారింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ఎంట్రీ ఇవ్వక తప్పలేదు. దిల్‌రాజు అధ్యక్షతన జరిగిన చర్చలు కొలిక్కి వచ్చేలా.. ఇరువురి మధ్య ఓ ఆరోగ్యకరమైన ఒప్పందం చేయించి.. చర్చలు ఫలప్రదం అయ్యేలా రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవడంతో ఈ సంక్షోభానికి తెరపడింది. ఇటు కార్మికులు ఖుష్.. అటు నిర్మాతలూ తమ కోట్ల విలువైన ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నందున ఆనందం.. ఉభయ కుశలోపరిగా సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న చొరవ, చర్యలు తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసింది.
సినీ కార్మికుల జీవితాలకు, ఉపాధికి ఊతం ఇచ్చింది. ఇవాళ్టినుంచి షూటింగులు ప్రారంభమయ్యాయి. సీఎం సూచనల మేరకు ఈ చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నది తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్. కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. వేతన సమస్యలకు న్యాయమైన పరిష్కారం లభించేలా శాశ్వత పరిష్కారం దిశగా సర్కార్ బాటలు వేసింది.
టాలీవుడ్‌కు కొత్త ఉదయం..
తెలుగు ఇండస్ట్రీని మరింత డెవలప్ చేయాలనే ఆలోచన సీఎంకు ఉన్నట్టుగా గతంలో ఆయ పలు సినీ వేదికలపై తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. భవిష్యత్తులో ఇక్కడి సినీ ఇండస్ట్రీ అంతర్జాతీయంగా ఎదగాలన్నదే సర్కార్ లక్ష్యంగా పలు కీలక సంస్కరణలు, మౌళిక వసతులు కల్పించేందుకు, సదుపాయాల కల్పనకు రెడీగా ఉంది. ఈ సందర్బంగా మరోమారు సీఎం సినీ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆధునిక టెక్నాలజీ, స్టూడియోలు నిర్మాణాల ద్వారా ఇక్కడ మరింత నాణ్యమైన సినిమాల నిర్మాణాలకు దోహదం చేస్తుందని సర్కార్ భావిస్తోంది. ఈ దిశగా వడివడిగా చర్యలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ అందాలను చూపించటం ద్వారా ప్రపంచ సినీ దర్శకులను కూడా ఆకర్షించడం తద్వారా రాష్ట్రం అన్ని విధాలుగా సినిమాలకు ఓ మైలురాయిగా, కీలక కేంద్రంగా ఉందనే సంకేతాలు పంపడం కూడా సర్కార్ ఉద్దేశ్యంగా ఉంది. జాతీయ–అంతర్జాతీయ సినీ సదస్సులు కూడా హైదరాబాద్‌లో నిర్వహించేలా.. ఆ స్థాయి ప్రమాణాలు పెంపొందించుకునేందుకు కావాల్సిన సదుపాయాలన్నీ సర్కార్ చేస్తున్నది. సర్కార్ సామాజిక బాధ్యతగా టిక్కెట్‌పై చిన్న సెస్‌తో పాఠశాలలు, గృహాలు, సదుపాయాలు కార్మికులకు కల్పించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం శుభ పరిణామం. సినీ కార్మికుల కుటుంబాలకు ఇది కొత్త ఉదయం లాంటిదనే చెప్పాలి.
సంక్షోభాన్ని సకాలంలో నివారించి, పరిశ్రమను తిరిగి పుంజుకునేలా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సినీ వర్గాలంతా ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపాయి.
Dandugula Srinivas
Senior Journalist
8096677451
