Dandugula Srinivas

 

ఇటు అటు కానీ హృద‌యంతోటి ఎందుకురా ఈ తొంద‌ర నీకు.. 1979లో వ‌చ్చిన ఇది క‌థ కాదు.. సినిమాలోని పాట ఇది. ఇప్పుడు కేటీఆర్ ప‌రిస్థితి చూస్తే అచ్చంగా ఈ పాట చ‌ర‌ణంలాగే ఉంది. ఎటో ఒక వైపు నిర్ణ‌యం తీసుకోవాల్సిన త‌రుణం వ‌చ్చిన‌ప్పుడు ఇట్ల‌నే ఉంటుంది. చాలా రోజులు, ఇంకెన్నో సార్లు త‌ప్పించుకోవ‌చ్చు. కానీ కొన్ని సంద‌ర్భాలు దొర‌క‌బ‌ట్టిస్తాయి. ఏదో ఒక‌టి తేల్చి చెప్పాల్సిందేన‌ని గ‌ల్లా ప‌ట్టేస్తాయి. ఇప్పుడు అదే టైం వ‌చ్చింది. అందుకే కేటీఆర్ త‌డ‌బ‌డుతున్నాడు. నాలుక మ‌డ‌తెడుతున్నాడు. ఇటు అటు కానీ ఆలోచ‌న‌ల‌తో ఏమి మాట్లాడాలో తెలియ‌క ఏదో ఒక‌టి మాట్లాడుతున్నాడు. కానీ దొరికిపోతున్నాడు. జ‌నాల‌కు ఓ క్లారిటీ ఇస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్నఅనుమానాల‌ను తానే నివృత్తి కూడా చేస్తున్నాడు. అస‌లేం మాట్లాడాడు కేటీఆర్‌?

ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి త‌న‌కు న‌చ్చ‌లేద‌న్నాడు. అది రేవంత్ నిర్ణ‌యం కాబ‌ట్టి గుడ్డిగా వ్య‌తిరేకించాల్సిందేన‌న్నాడు. ఆ వెంట‌నే నీకు బీసీ ఎవ‌రూ దొర‌క‌లేదా? అని కూడా అన్నాడు. అంటే బీసీని పెడితే మేం ఓటేసేవాళ్ల‌మే.. కానీ నువ్వు రెడ్డిని పెట్టావు.. త‌ప్పు నీదే అని సాకు వెతుక్కునే ప్రయ‌త్నం చేశాడు. బీసీల‌పై నీకంత ప్రేమ ఉంద‌ని చెప్పావుగా..! ఏదీ నీ ప్రేమ..? అన్న‌ట్టుగా మాట్లాడాడు. అంటే నువ్వు మాలాగేన‌న్న మాట‌. బీసీలంటే మాకు ప‌డ‌దు. నువ్వు దీన్ని ఓవ‌ర్ టేక్ చేద్దామ‌నుకున్నావ్‌.. కానీ ఇలా దొరికిపోతున్నావ్.. అని సంతోష‌ప‌డిన‌ట్టే ఉంది. అల్ప సంతోషిలాగా. ఇక కంచ ఐల‌య్య‌ను పెట్టొచ్చు క‌దా? అని కూడా ఏదో ఉచిత స‌ల‌హా ఇచ్చాడు. బాగానే స‌ల‌హాలిస్తున్నాడు క‌త్తీ త‌న‌ది కాదు.. జుట్టూ త‌న‌ది కాద‌న్న‌ట్టు. కానీ ఇక్క‌డో విష‌యం కేటీఆర్ మ‌రిచిపోతున్నాడు. ముందుంది అస‌లు క‌థ‌. రేపు భ‌విష్య‌త్తులో బీఆరెస్ పార్టీని కూడా బీసీల త‌క్కెట్లో పెట్టి చూస్తార‌ని. ఎవ‌రెవ‌రికి ఎన్నెన్ని సీట్లిస్తున్నారు. మీ సంగ‌తేంది? మీ స్టాండ్ ఏంద‌ని గ‌ల్లా ప‌ట్టి అడిగే రోజులూ ఉంటాయ‌ని. అవి ఎంతో దూరం లేవ‌ని.

ఇక యూరియా కొర‌త‌నూ ఓ సాకుగా తీసుకున్నాడు. బీజేపీ, బీఆరెస్‌కు ఉన్న లోపాయికారి ఒప్పందం అంద‌రికీ తెలిసిపోయింది. కానీ ఇంకా జ‌నాన్ని మ‌భ్య‌పెట్టేందుకు బీఆరెస్ ప‌డుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. క‌విత దీన్ని బ‌య‌ట‌పెట్టేసింది. ఎంపీ సీఎం ర‌మేశ్ దీన్ని ధ్రువీక‌రించాడు. బండి సంజ‌య్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. అయినా ఏవేవో మాట‌లు చెప్పి త‌ప్పించుకుంటూ వ‌స్తున్న బీఆరెస్‌, కేటీఆర్‌.. ఇప్పుడు ఉప రాష్ట్రప‌తి ఎన్నిక నేప‌థ్య దొంగ‌ను దొర‌క‌బ‌ట్టించింది. యూరియాను సెప్టెంబ‌ర్ 9లోగా ఎవ‌రు రైతుల‌కందిస్తారో.. వారికే మా ఓట‌ని ప‌రోక్షంగా తాము ఎన్డీయే అభ్య‌ర్థికే ఓటేస్తామ‌ని చెప్పుకొచ్చాడు కేటీఆర్‌. ఈ మాట‌ల్లో ఏమ‌న్నా అర్థ‌ముందా? ఆ అంత‌రార్థం తెలుసుకోలేనంత పిచ్చోళ్ల జ‌నాలు? ఇంకా ఎన్ని రోజులు మోసం చేసి రాజ‌కీయాలు చేస్తావ్ కేటీఆర్‌? యూరియా ఇవ్వాల్సింది కేంద్రం. వాళ్ల‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్లెత్తు మాట మాట్లాడ‌ని కేటీఆర్‌.. క‌నీసం మా కోటా మాకు విడుద‌ల చేయండ‌ని అడ‌గ‌ని బీఆరెస్‌.. ఇప్పుడు కేంద్రం యూరియాను విడుద‌ల చేస్తుంది. అది రైతుల‌కు అందుతుంది.. అందుకే మేము ఎన్డీయే అభ్య‌ర్థికి ఓటేశామ‌ని స‌మ‌ర్థించుకుని, స‌ర్ధి చెప్పుకుని, త‌ప్పించుకునే య‌త్నం చేస్తుంద‌న్న‌మాట‌. జ‌నాలు చెవిలో పెట్టుకుని ఇవ‌న్నీ చూస్తూ .. అవునా.. నిజ్జ‌మా? అని అనుకోవాల‌న్న‌మాట‌. ఇట్లా ఉంది మ‌రి కేటీఆర్ వైఖ‌రి.

ఇక మార్వాడీ గో బ్యాక్ ఉద్య‌మానికే వ‌ద్దాం. ఏమ‌న్నాడు కేటీఆర్‌. పొట్ట‌కూటి కోసం వ‌చ్చిన‌వాళ్ల మీద మా పేచీ, మా పొట్ట‌కొట్టేవాళ్ల మీదే పేచీ. ఇక్క‌డా ఇటూ అటు కానీ మాట‌లే. ఎవ‌రి వైపుంటావో చెప్ప‌వ‌య్యా సామీ! అంటే. ఉద్య‌మం చేయండ‌ని అన‌డు. మార్వాడీల‌కు మా మ‌ద్ద‌తు అని అన‌డు. కాంగ్రెస్‌, బీజేపీ దీనిపై త‌మ వైఖ‌రిని ముందే చెప్పేశాయి. కానీ బీఆరెస్ మాత్రం గోడ మీద పిల్లిలా త‌మాషా చూస్తున్న‌ది. ఇది మ‌న‌కు ప‌నికి వ‌స్తుందా? పనికి రాదా? నాలుగు ఓట్లు తెచ్చిపెడుతుందా? ఎవ‌రిని ఉసిగొల్పాలే. ఎవ‌రి వైపు ఉండాలె. ఎవ‌రితో దోస్తీ చేస్తే మ‌న‌కు లాభం..? ఇవ‌న్నీ లెక్క‌లేసుకుంటున్న‌ది. ఇన్ని క్లారిటీలేని ముచ్చ‌ట్లు చెబుతూ మీడియాను, జ‌నాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్న కేటీఆర్‌కు మంచి క్లారిటీ ఉంది. తాము ఏం చేయ‌ద‌లుచుకున్నారో. కేసీఆర్‌కూ మంచి స్ట్రాట‌జీ ఉంది. జ‌నాల‌ను ఎలా బురిడీ కొట్టించాలో? అధికారం ద‌క్కించుకోవాలంటే ఎలాంటి స‌మీక‌ర‌ణలు త‌మ‌కు క‌లిసిసొస్తాయో? అవే వారు చేస్తున్నారు. జ‌నం చెవిలో పవ్వులు పెట్ట‌డం ఈ నేత‌ల‌కు కొత్తేం కాదు. కానీ చెవిలో ఇంకా పువ్వులు పెట్టుంచుకునేందుకు జ‌నం సిద్దంగా ఉన్నారా? అనేదే ఇప్పుడు అస‌లైన ప్ర‌శ్న‌.

You missed