(దండుగుల శ్రీనివాస్)
బీజేపీ, బీఆరెస్ ఒకర్నొకరు తిట్టుకుంటున్నారు. వాదులాడుకుంటున్నారు. ఆల్టర్నేట్ పార్టీగా మేమంటే మేమని నిరూపించుకునే క్రమంలో హద్దులు దాటి రాజకీయాలు చేస్తున్నారు. మేము కలిసిపోలేదు. కలవడం లేదు. విలీనం లేదు. అంతా తూచ్ అని ప్రజలను నమ్మించే ప్రయత్నంలో రాజకీయాలు చేసుకుంటున్నారు. జనాల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. కవిత, ఎంపీ రమేశ్ ఇద్దరూ బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అని చెప్పిన తరువాత బండి సంజయ్.. కూడా దీన్ని ధ్రువీకరించిన తరువాత ప్రజల్లో ఇక వీరిని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఎప్పటికైనా ఈ రెండు పార్టీలు ఒక్కటే అనే రూఢీకి వచ్చాయి.
దీన్ని తొలగించుకునే క్రమంలో రెండు పార్టీలు పోటీలు పడుతున్నాయి. ఎన్ని పోటీలు పడినా.విలీనం ఉండదనే విషయాన్నే చెప్పుకుంటున్నాయి తప్ప.. భవిష్యత్‌లో పొత్తు ఉండదనే విషయాన్ని ఒప్పుకుంటలేవు. బాహాటంగా చెప్పడం లేదు. ఈ రెండు పార్టీలకు రేపు అసెంబ్లీలో ఎన్ని సీట్లొస్తాయో తెలియదు. అధికారంలోకి రావడానికి సరిపడా సంఖ్యాబలం ఉంటుందనే నమ్మకం లేదు. అందుకే అప్పటి అవసరాల రీత్యా పొత్తుకు మాత్రం గేట్లు బార్లా తెరుచుకునే ఉన్నారు. విలీనం ఉండబోదనేది స్పష్టం. కానీ పొత్తులుండవనే విషయం ఏ నేతా చెప్పడం లేదు. బండి సంజయ్‌ను ఫోన్ ట్యాపింగ్ విషయంలో పిలిపించి వివరణ తీసుకున్న తరువాత ఆయన కేసీఆర్, కేటీఆర్‌పై ఘాటుగానే స్పందించారు.
తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనం ఈ మాటలు విన్న తరువాత బీజేపీ వేరు.. బీఆరెఎస్ వేరు అనుకోవాలనేది వారి అభీష్టం. కానీ జనం నమ్మడం లేదు. కేసీఆర్ తనయ కవితే బయటకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించడాన్ని ప్రజలు నమ్ముతున్నారు. సీఎం రమేశ్ కూడా ఇదే విషయాన్ని చెప్పిన తరువాత.. ఇదే బండి సంజయ్ అవును ఇది నిజమే.. ఇద్దరితో మీటింగు ఏర్పాటు చేయిస్తాను.. వస్తావా? ఎవరిది కరెక్టో అని తగుదునమ్మా అని మధ్యలో దూరారు. ఇంత జరిగిన తరువాత విలీనం ఉండదని అందరికీ తెలుసు. విలీనం చేయాల్సిన అసవరమూ బీఆరెస్‌కు లేదు. ఎందుకంటే కావాల్సినంత ధనం ఉంది. మరో ఇరవై ఏండ్ల పార్టీ నడిపించే సొత్తు ఆ పార్టీ సొంతం. కానీ అధికార అవసరాల కోసం మాత్రం పొత్తు ఉంటుందనేది కొట్టిపారేయలేని సత్యం.
స్టేట్ ప్రెసిడెంట్ రామ చంద్రారావు కూడా విలీనం ఉండదనే అంటున్నారు. కానీ పొత్తు కూడా పెట్టుకోమని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే రేపు ఏ అవసరం వచ్చునో.. గతంలో ఎంతైనా బీఆరెస్ మిత్ర పక్షమేనాయె..అందుకే ఏమైనా జరగొచ్చు. అప్పటి వరకు ఇలా జనాల ముందు నువ్వు కొట్టినట్టు చెయ్.. నేను ఏడ్చినట్టు చేస్తా.. అనే రాజకీయాలను ప్లే చేస్తున్నాయి బీజేపీ, బీఆరెస్ పార్టీలు.
DANDUGULA Srinivas
Senior Journalist
8096677451