(దండుగుల శ్రీనివాస్)
రేషన్‌కార్డులివ్వడం ప్రభుత్వం బాధ్యత. దానికే ఇంతలా డప్పు కొట్టుకోవాలా..? ఓసోస్.. మేమూ ఇచ్చాం లేవేయ్..! ఇంచుమించు ఇవే మాటలన్నడు కేటీఆర్. అంతే కాదు. అదే ఫ్లోలో పాలిచ్చే బర్రెను కాదని ఎగరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని కూడా అన్నాడండోయ్. మరి మీ పాలిచ్చే బర్రె.. అదే మీరు.. అంటే మీ పార్టీ. అదేనండి మీరు వెలగబెట్టిన పదేండ్లు.. ఎందుకియ్యలే మరి రేషన్‌కార్డులు? మేం ఇవ్వనిదే ఇన్ని రేషన్కార్డులెక్కడియి.? అంటారేమో. ఎప్పుడిచ్చారు. ఎప్పుడు ఆ వెబ్‌సైట్‌ను క్లోజ్ చేశారు. దానికి తాళం వేసేసి ఏళ్లు అవుతున్నా.. దరఖాస్తులు కుప్పలు తెప్పులుగా వచ్చి పడుతున్నా… ఒక్కటంటే ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేకపోయారెందుకు? అది మీకూ తెలుసు. మరెందుకు గెలికి రెచ్చగొట్టి .. అదే మీరనే భాషలో చెప్పాలంటే ఎగిరి తన్నించుకుంటారు.
రేషన్కార్డులెందుకియ్యలే. పథకాలు ఎక్కువ మందికి ఇయ్యాలని. ఇస్తే బడ్జెట్‌పై భారం పడుతుందని. మరి ఆదాయం, ఖర్చు.. భారం అంతా తెలిసినోళ్లేనాయె. కొత్త పథకాలెందుకు..? ఇచ్చేటివే అర్హులందరికీ వచ్చేలా చూడొచ్చు కదా. దళితబంధు లాంటి పనికి మాలిన పథకాలెందుకు ప్రవేశపెట్టారు. ఎవరిమ్మన్నారు? భర్త చనిపోతే వీడో పింఛన్ కోసం ఎన్నేండ్లు ఎదురుచూశారో తెలుసా..? వాటిని తాళాలేశారు. కొత్త పింఛన్ ఒక్కరికంటే ఒక్కరికి ఇవ్వలేదు. దాని తాళం చెవి కలెక్టర్ల దగ్గరో, ఎమ్మెల్యే దగ్గరో లేకుండె. ఏకంగా కేసీఆర్ దగ్గరే ఉండె. అంత జాగ్రత్త మనిషి. మరి అప్పులెట్లయినయ్.. రేషన్కార్డులిస్తేనే అప్పులు పెరిగిపోయాయా? ఇప్పుడెందుకు రేషన్కార్డలా..? ఓస్ అంతేనా..? అదే లెక్కనా..? అని తీసిపారేసినట్టు మాట్లాడి జనాన్ని మరీ చీపుగా చూడటమెందుకు??
దీనికి ముందున్నది మనమే. పదేండ్ల తప్పొప్పులూ మనముందరే ఉన్నాయి. జనం ఓడించారు. ఒప్పుకోవాలె. లోపాలు సరిచేసుకోవాలె. పాపాలు కడిగేసుకోవాలె. చెంపలేసుకోవాలె. జనం అప్పుడు గానీ మీరు కొంతలో కొంత మారిండ్రు అని అనుకుంటరు. కానీ జనం మీదే కసి తీర్చుకున్నట్టుగా.. మంచిగైంది బిడ్డ.. మీకట్లనే కావాలనే పైశాచికనందపు మాటలు, అహంకారం వీడని కామెంట్లు.. ఇంకా కడుపు రగిలేలా చేస్తాయేగానీ కనికరం చూపవు కదా రామన్నా. మళ్లీ అధికారంలోకి వస్తే ఆ తప్పులు చేయమని అన్నావు. అంతేగానీ తప్పులు ఒప్పుకుంటున్నం. చెంపలేసుకుంటం… కలిసి పనిచేద్దాం.. అని మాత్రం అనవు. అధికారం వచ్చినంక ఆ తప్పులు చేయబోమనే అంటున్నావ్.
అసలు అధికారం రావాలంటే మనం మారినట్టు ముందు జనాలు నమ్మాలె గదానే రామారావన్న. అప్పుడే జనాలు మీకు అధికారం ఇచ్చేసినట్టు. అధికారంలో మీరు కలలు గనే ఈ గద్దెనెక్కేసినట్టు..కలలు కనేసి.. ఆ తప్పులు చెయ్యం.. అని చెప్తే.. ఎట్లా..? ఆ సీటు దాకా పోవాలంటే.. ఆ పీఠం దక్కాలంటే.. జనం పూర్తిగా నమ్మాలె. కార్యకర్త గాయాలు మానాలె. అందుకు సమయం పడుతుంది. ఆ సమయంలోనే మీ పరివర్తన ఎట్లుందో చూస్తరు. మీ ప్రవర్తన మారిందా లేదా అని లెక్కలేసి తీర్పు చెబుతరు. అంతేగానీ రాబోయే తీర్పును కూడా మీరే ముందే ఊహించేసి ఆశించేసి …. ఓకే ఓకే మారినం తియ్.. అని చెబితే నమ్మడం కష్టమే.
Dandugula Srinivas
Senior Journalist