(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఎన్నో హామీలిచ్చి గ‌ద్దెనెక్కిన స‌ర్కార్‌కు అవి అమ‌లు చేయ‌డం అంత వీజీ కాద‌ని తెలిసిపోయింది. బ‌డ్జెట్ త‌ల‌కిందులుగా ఉన్న విష‌యం అధికారంలోకి వ‌స్తేగానీ తెలియ‌దు. కొత్త ప‌థ‌కాలు, హామీల మాట దేవుడెరుగు.. పాత‌వి కొన‌సాగించ‌డానికే త‌ల్ల‌డ‌మ‌ల్ల‌డ‌మ‌వుతోంది రేవంత్ స‌ర్కార్‌. కానీ త‌క్కువ బ‌డ్జెట్ సినిమాలు సూప‌ర్ హిట్ అయిన‌ట్టు.. త‌క్కువ ఖ‌ర్చుతో స‌ర్కార్ ప్ర‌వేశ‌పెట్టిన కొన్ని ప‌థ‌కాలు మంచి మైలేజీనే తీసుకొస్తున్నాయి. రైతు భ‌రోసా, రైతు రుణ‌మాఫీ కోసం వేల కోట్లు గుమ్మ‌రించినా.. ఎక్క‌డో ఏదో వెలితి. ఇంకా ఏదో అసంతృప్తి. మాకు రాలేద‌నే అస‌హ‌నం. దీంతో అంద‌రికీ సంపూర్ణంగా మేలు చేయ‌లేని దుస్థితి. అంద‌రి మ‌న్న‌న‌లు పొంద‌లేని ప‌రిస్థితి. రైతు కేంద్రంగా ఎంత రాజ‌కీయం న‌డిపినా.. పాత స‌ర్కారే కొంచెం బెట‌రనే ఫీలింగుకు ఇంకా చెర‌ప‌లేక‌పోతున్న‌ది రేవంత్ స‌ర్కార్‌.

ఇప్పుడు ఈ కొత్త ప‌థ‌కాలు ఏంటో చూద్దాం. ఇందులో ప్ర‌ధానంగా ఫ్రీ బ‌స్సు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల్లో మొట్ట మొద‌టిగా అమ‌లు చేసింది ఈ ప‌థ‌కాన్నే. ఇది స్టార్టింగ్‌లో ఇబ్బందుల పాలైంది. చాలీ చాల‌ని బ‌స్సుల‌తో మ‌హిళ‌ల‌కు న‌ర‌కంగా మారింది. కానీ అల‌వాటు ప‌డ్డారు. ఆధార్ కార్డు చెంత పెట్టుకుని ఎక్క‌డికైనా వెళ్లొచ్చ‌నే ధీమా వారిలో పెరిగింది. ప‌ర్సులో న‌యా పైసా లేక‌పోయినా… ఒక్క ఆధార్ కార్డుంటే చాలు అని ఫిక్స్ అయిపోయారు. ఈ ప‌థ‌కాన్ని ఎవ‌రున్నా అమ‌లు చేయాల్సిందే. లేక‌పోతే అంత సంగ‌తులు. అంత‌లా క‌నెక్ట‌య్యారు లేడీస్‌. ఇక మ‌రీ త‌క్కువ బ‌డ్జెట్‌తో అమ‌లు చేసి జ‌నాధార‌ణ పొందిన ఇంకొక ప‌థ‌కం స‌న్న‌బియ్యం.

అప్పుటి స‌ర్కార్ కూడా ఆలోచ‌న చేసింది. అమ‌లులో జాప్యం చేసింది. దొడ్డు బియ్యం అమ్ముకుని స‌న్న‌బియ్యం కొనుక్కునే ప‌రిస్థితి ఉంది.అంతా స‌న్న‌బియ్యానికి అల‌వాటు ప‌డ్డారు. ఇదే జ‌నం నాడిని ప‌సిగ‌ట్టి స‌న్న‌బియ్యం ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న‌ది స‌ర్కార్‌. ఇక ఇవాళ రేష‌న్ కార్డుల జారీ ప్ర‌క్రియ‌. వాస్త‌వానికి రేష‌న్ కార్డుల ఇవ్వ‌డ‌మంటేనే స‌ర్కార్‌కు భారం. అందుకే కేసీఆర్ స‌ర్కార్ ఆనాడు దీని జోలికి పోలేదు. రేష‌న్ కార్డు ప్ర‌మాణికంగానే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అమ‌ల‌వుతాయి. అందుకే ఇవి ఎన్ని ఎక్కువ‌గా ఇస్తే అంత భార‌మ‌నే ఫీలింగు ప్ర‌భుత్వాల‌కు ఉంది.

కానీ కాంగ్రెస్ స‌ర్కార్ ఇప్పుడు కొత్త రేష‌న్‌కార్డులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. వీటి కోసం చాలా రోజుల నుంచి చాలా మంది ఎదురుచూస్తున్నారు. పెద్ద ప‌థ‌కాలు స‌ర్కార్ ఖ‌జానాకు గండికొట్టి .. రావాల్సినంత మైలేజీని ఇవ్వ‌క‌పోగా.. ఈ త‌క్కువ బ‌డ్జెట్ సినిమాలు సూప‌ర్ హిట్ ఖాతాల చేరుతున్నాయి. కీలెరిగి వాత‌లా.. జ‌నం నాడెరిగి ప‌థ‌కాల‌న్న‌మాట‌.

Dandugula Srinivas

Senior Journalist

8096677451