(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఆ పేర్ల‌కు ఎల‌ర్జీ వ‌చ్చింది. వాటిని ప‌ల‌క‌డానికి కొంద‌రు ఇష్ట‌ప‌డ‌టం లేదు. అంద‌రికీ తెలిసిన పేర్లే. అంద‌రి నోళ్ల‌లో నానే పేర్లే. వీఐపీల‌వే కానీ… అవి ప‌ల‌కాలంటే కొన్ని నోర్ల‌కు కంప‌ర‌మొస్తున్న‌ది. చికాకు న‌శాల‌నికంటున్న‌ది. అదే అత‌డే.. ఆయ‌నే అబ్బ‌.. ఆ పేరెందుకుగానీ.. ఇలా కానిచ్చేస్తున్న మాట‌. అది అర్థ‌మయిపోతుంది మిగితా వారికి. కేసీఆర్ నోటి వెంట రేవంత్ రెడ్డి పేరు రాదు. విన‌బ‌డ‌దు. అన‌డు. ప‌ల‌క‌డు. చికాకాయ‌నకు. ఎల‌ర్జీ ఆయ‌న నోటికి ఆ పేరంటే.

అందుకే ఎంతటి పెద్ద బ‌హిరంగ స‌భైనా, ప్రెస్‌మీటైనా.. ఇంకేదైనా.. ప‌రోక్షంగా, చ‌మ‌త్కారంగా, వెట‌కారంగా, కారం పూసిన‌ట్టుగా, సామెత‌లు జోడించి.. పిట్ట‌క‌థ‌లు త‌గిలించి అలా అల‌వోక‌గా అర్థ‌మ‌య్యేలా చ‌మ‌క్కులుంటాయే గానీ.. పేరు రాదు. చురుకులంటిస్తాడే గానీ పేరు పెట్టి ప‌ల‌క‌డు. పేరుతో తిట్ట‌డు. పేరునే ఉచ్చ‌రించ‌డు. ఉచ్చ‌రించేందుకు ఆ పెద‌వులు క‌ల‌వ‌వు. ఆ నోరు పెగ‌ల‌దు. అంతే. ఇప్పుడు రేవంతు వంతు. మొన్న‌టి దాకా సైకో రాము అని బిరుదాంకితం చేశాడు. ఇప్పుడు ఇక ఆ పేరు ఉచ్చ‌రించేందుకు తీవ్రంగా చికాకు ప‌డుతున్నాడు. ఛీ ఛీ.. అని చీద‌రించుకుంటున్నాడు. ఆ పేరెందుకులే.. అత‌గాడితో నాకేంటిలే..? అని అంటూనే అర్సుకుంటున్నాడు. తిట్ట‌క‌నే తిడుతున్నాడు.

పేరు లేకుండానే ఎత్తిపొడుస్తున్నాడు. స‌వాల్ విసురుతున్నాడు. రా కాస్కో అంటూ ఛాలెంజులు కాస్తున్నాడు. మొత్తానికి కేసీఆర్ నోటి వెంట ఇప్ప‌టి వ‌ర‌కు ఇక‌పై .. రేవంత్ పేరు రాదు. ప‌ల‌క‌డు. ఇక‌పై రేవంతు.. కేటీఆర్ పేరు ఉచ్చ‌రించ‌డు. పిల‌వ‌డు. మాట‌ల్లేవు. మాట్లాడుకోవ‌డాల్లేవు. అంతే. బ‌స్‌..!

Dandugula Srinivas

Senior Journalist

8096677451