(దండుగుల శ్రీనివాస్)
అంగట్లో అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శని..! చాలా పాత సామెత. ఇదిప్పుడు కేటీఆర్‌కు వర్తిస్తుంది. కేసీఆర్ బయటకు రాకపోవడం, పూర్తిగా పార్టీ బాధ్యతలు, నిర్ణయాలను కేటీఆర్‌కే వదిలేయడం చాలా సందర్భాల్లో ఇబ్బందులనే తెచ్చిపెడుతోంది. తాజాగా మీడియాపై దాడి చేయడాన్ని బీఆరెస్ సమర్థిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోంది. దీనికి కేసీఆర్ ఆమోదం ఉందా ..? అనేది చెప్పలేం. గతంలో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కూడా ఏబీఎన్‌ను, ఆంధ్రజ్యోతిని తిట్టిన, విమర్శించిన సంఘటనలున్నాయి. అప్పుడు తెలంగాణ ఇష్యూ కాబట్టి.. దానికి ఆమోదం లభించింది. కానీ ఇప్పుడు అప్పటంతా సీన్ లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్‌కు ఇతన సినీ హీరోయిన్లకు సబంధాలు అంటగడుతూ మహా టీవీలో వల్గర్ థంబ్‌నెయిల్స్ పెట్టి పోస్ట్ చేశారు. ఇది ముమ్మూటికీ దిగజారుడుతనమే. అంతలా ఓ చానెల్ దిగజారి వ్యూస్ కోసం పాకులాడటం సిగ్గుచేటు.
అందులో పనిచేసే ఓ లేడీ జర్నలిస్టు కూడా దీన్ని ఒప్పుకున్నది. మావోళ్లు వ్యూస్ కోసం అలాంటి థంబ్‌నెయిల్స్ పెట్టి ఉంటారు. తరువాత తీసేశామన్నది. మరి జరిగిన డ్యామేజీ పరిస్థితి ఏంటీ..? వ్యక్తిత్వ హననం చేసి .. మీడియా ముసుగులో ఏం చేసినా నడస్తుందంటే.. ముందైతే దానికి ప్రజాదరణ ఉండదు. అయితే దీనిపై బీఆరెస్ దాడి చేసిన విషయం వివాదస్పదమైంది. ఈ దాడి సంస్కృతి ఎవరు చేసినా కరెక్టు కాదు. పైగా దీనిని సమర్థించడమే కాదు.. ఇకపై మరిన్ని దాడుల చేస్తామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవేశంగా మాట్లాడటం మూలంగా ఆ పార్టీకి వచ్చే లాభం అణువంత కూడా ఉండకపోగా.. మరింత డ్యామేజీనే చేస్తుంది. మీడియాను బెదిరిస్తే ఎవరూ బెదరరు.
సమయం వచ్చినప్పుడు దీన్ని చిలువలు పలువలుగా చేసేందుకే ఎదురు చూస్తాయి. తప్పుడు వార్తలపై నిరసన తెలుపవచ్చు. లేదా తన చేతిలోనే మీడియా ఉంది. నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఉండనే ఉన్నాయి. ఇవి కాకుండా ఓ బలమైన సోషల్ మీడియానే రన్ చేస్తున్నాడు కేటీఆర్. తిప్పికొట్టొచ్చు. మొత్తంగా అసలు హీరోయిన్స్ ఫోన్లు ట్యాపింగే కాలేదనే అధికారిక వర్గాల లీక్ సమాచారం కూడా బయటకు వచ్చింది. కానీ ఆలోపు కేటీఆర్‌ను ఎంతలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలో అంత చేసి వదలిపెట్టింది కాంగ్రెస్, ఆ పార్టీ సోషల్ మీడియా. కుటుంబ సభ్యుల జోలికి వస్తే, హద్దులు మీరితే బట్టలిప్పి మరీ కొడతానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్.. మరి కేటీఆర్‌కు కుటుంబం లేదా.. తమైతే ఒకలా… మంది అయితే పర్వాలేదా..? సరే, ఇప్పుడు మీడియా దాడి వద్దకు వద్దాం. తెలంగాణ బీఆరెస్ జారీగా అంటూ ఆంధ్రజ్యోతిలో ఆర్కే రాసుకున్నాడు.
దీనిపై సోషల్ మీడియా సాక్షిగా తిప్పికొట్టారు. తిట్టారు. విమర్శించారు. దుమ్మెత్తిపోశారు. ఆర్కేని. ఇది ఓకే. జగదీశ్‌రెడ్డి మాటలతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. ఇంతటి పరిస్తితి వచ్చేలా చేసింది బీఆరెస్. ఇది ముమ్మూటికీ కరెక్టు కాదు. కేటీఆర్.. సీఎంను అరేయ్… తురేయ్ కొట్టడం. వాని బొంద అంటు సంబోధించడం కూడా ఫ్రస్టేషన్‌ను సూచిస్తున్నది. కేటీఆర్ కాబోయే సీఎంగా చెప్పుకునే ఆ పార్టీకి కూడా ఇది మంచిది కాదు. కానీ కేటీయారే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదని. దానికి ఎవరూ ఏం చేయలేరు. కానీ ఇంకా మీలో అహంకారం అణువంత కూడా తగ్గలేదనే ప్రచారానికి మాత్రం ఇలాంటి చర్యలు, మాటలు ఊతమిస్తున్నాయి. మధ్యలో బీజేపీ వచ్చి మీ టీ న్యూస్ మీద దాడి చేస్తం జాగ్రత్త అనడం … మరీ దిగజారుడుగానే ఉంది.
ఈ వివాదంలో మేము ఏమీ అనకపోతే వెనుకబడతామనే దోరణే తప్ప.. ఓ ఆలోచనతో కూడిందైతే కావామాటలు. అంటే మీడియా అంటే ఎంత పలుచనో, ఎంతటి చిన్నచూపో… వీళ్లకు వీళ్లే తీసిపారేసుకుని, పార్టీలుగా విడిపోయి.. బరిబాతల నిలబెడుతున్నారు. నిలబడుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు. ఇప్పటికే సోషల్ మీడియాకు హద్దులు లేకుండా పోయాయి. ఎవరేం రాస్తున్నారో కంట్రోల్ లేదు. ఇప్పుడు మీ గురించి మంచిగా రాసిన చేతులే చెంపలు వాయించేందుకూ వెనకాడవు. పొడిగిన నోళ్లే. బూతులు తిట్టేందుకు ఎక్కువ రోజులు పట్టదు. మరి తనదాకా వస్తే అన్నట్టుగా ఎవరికి వారు ఇతరుల మీదే కదా జరిగింది దాడి.. అనే విధంగా దీన్ని ప్రోత్సహిస్తే.. ఇంకా రెట్టిస్తే, రెచ్చగొడితే.. దిగజారుడు రాజకీయాలు మరింత పీక్‌కు చేరుకోగలవు. అవి అందరి పీకల మీదకు రాగలవు. పీడకలలే మిగలగలవు. తస్మాత్ జాగ్రత్త.
Dandugula Srinivas
Senior Journalist
8096677451