(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ దయ్యాలు కవితకు మంచే చేస్తున్నాయి. దయ్యాలంటే అందులో కీలకమైన దయ్యం.. అక్క వేరు కుంపటి పెట్టడానికి ప్రధాన కారణమైన దయ్యం కేటీఆరేనని ప్రత్యేకంగా మళ్లీ చెప్పనవసరం లేదనుకుంటా. కేసీఆర్ దేవుడే కానీ .. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి.. అని కదా అక్క చెప్పింది. ఆ దయ్యాల వల్లే కదా తను వేరు కుంపటి పెట్టాల్సి వచ్చింది. ఆ దయ్యాలు అక్కకు మంచే చేశాయి. అంటే అవి మంచి దయ్యాలన్నమాట. ఎలా మంచి చేశాయి..? ఎందుకు…? అంటారా..? ఆమె వేరు కుంపటి పెట్టి తనకు తాను నిరూపించుకునే క్రమంలో .. రాష్ట్ర నేతగా ఎదిగేందుకు పడుతున్న తపనకు దయ్యాలు రూట్ క్లియర్ చేశాయి. బీఆరెస్ పిలుపునిస్తే తప్ప.. అంటే అయితే కేసీఆర్ ఫామ్‌హౌజ్ నుంచో.. లేదా కేటీయారే అనుకుంటే తప్ప ధర్నాలు, నిరసనలు, పలకరింపులు, ఖండనలు, మెచ్చుకోళ్లు.. ఇవేమీ జరగవు. ప్రాంతీయ పార్టీలో అంతే మరి. కానీ ఈ బీఆరెస్‌లో మరీ దారుణం. ఆ విషయం అందరికంటే అక్కకే బాగా తెలుసు.
ఓటమి తరువాత కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యాడు. ఏం చేయాలన్నా, ఏం చెప్పాలన్నా కేటీఆర్… అండ్ టీమే. ఆ కేటీఆర్ మొత్తం తను పెట్టుకున్న సోషల్ మీడియా టీమ్ మీదే ఆధారపడ్డాడు. వాళ్లు ఏం చెబితే అది. ఎంత చెబితే అంత. అంతా ట్విట్టర్ గూట్లో గుడ్లు పెట్టడం, సోషల్ మీడియాలో ఓ కామెంట్ పెట్టడం.. ఇదే పని నిత్యం. ఇక డైరెక్టుగా ప్రజలతో సంబంధాలు లేవు. వాళ్లను కలిసి మాట్లాడడాలు లేవు. నిరసనలు లేవు. ధర్నాలు లేవు. పిలుపులు లేవు. జిల్లాల్లో నిస్తేజంగా ఉండిపోయారు బీఆరెస్ టీమ్ అంతా. కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ కు నోటీసులిస్తే ధర్నాలు లేవు. ఆందోళనలు లేవు. కానీ కవిత ధర్నా చేసింది. అదే తన వేరు కుపంటి జాగృతి వేదికగా. ఇవాళ సంగారెడ్డి ఘటనలో కూడా సీఎం తరువాత ఆమె అక్కడికి చేరుకున్నది. బాధిత కుటుంబాలతో మాట్లాడి వచ్చింది. ఇలాంటి సత్వర స్పందనలు ప్రజలకు మరింత చేరువ చేస్తాయి.
వాస్తవానికి ఇవన్నీ కేటీఆర్ చేయాల్సినవి. కానీ అక్కకు ఇప్పుడు మాంచి స్వేచ్ఛ దొరికింది. చాన్స్ దిరికిందే తడువు ఆమె దూసుకెళ్తున్నది. ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. అంత టీమ్ ఉన్న కేటీఆర్ ఏం చేయలేకపోతున్నాడు. కానీ తన కొద్ది పాటి టీమ్‌తో, తన శ్రేయోభిలాషుల సలహాలతో ఆమె సమకాలీన రాజకీయాలపై సత్వరం స్పందిస్తున్నది. కొంత కాంట్రవర్సీగా మాట్లాడినా.. అదీ వ్యూహంలో భాగమే అని తెలుస్తోంది.
తను తీసుకున్న నిర్ణయం, ఎంచుకున్న వేరు కుంపటి వేదిక.. ఏదైతే కవిత అనుకున్నదో.. రాష్ట్ర నేతగా తనూ స్టేట్‌లో కీలక నేతగా ఎదగాలనుకున్నదో ఆ దరి చేస్తున్నదనిపిస్తోంది. తండ్రి మీద దండయాత్రను ఇలా పరోక్షంగా ఆమె కొనసాగిస్తూ.. అన్నపై తిరుగుబాటు బావుట ఎగురవేస్తూ.. తనంటే ఏంటో నిరూపించుకునే క్రమంలో ఆమె వేస్తున్న ప్రతీ అడుగు ఒక్క దెబ్బకు మూడు పిట్టలన్నట్టుగా కొనసాగుతోంది. అందులో సక్సెస్ కూడా అవుతూ వస్తోంది.
Dandugula Srinivas
Senior Journalist
8096677451