(దండుగుల శ్రీనివాస్)
యువతకు స్వయం ఉపాధి అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో లక్షలాది మంది తమ కాళ్లపై తాము నిలబడతారన్నారు. రూ. 6వేల కోట్లు కేటాయించామన్నారు. సబ్సిడీ ఇచ్చి వారికి రుణభారం తగ్గిస్తున్నామన్నారు. బ్యాంకర్లతో పలు దఫాలుగా దఫ దఫాలుగా మీటింగులు పెట్టారు. సిబిల్ స్కోరు లేకున్నా లోన్లు ఇవ్వాల్సిందేనన్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున లబ్దిదారుల జాబితా సిద్దం అన్నారు. వారి ప్రాజెక్టులు ఇక గ్రౌండ్ చేసుకోవచ్చన్నారు. అంతా చేసి ఉన్నపళంగా దీన్ని ఆపేశారు. అనర్హులు వచ్చి చేరారనే కారణం చెప్పారు. మళ్లీ ఎంక్వైరీ అన్నారు. నిజమేననుకున్నారు.
కానీ అసలు వాస్తవం ఇది కాదు. దీని కోసం కేటాయించిన నిధులు… దారి మళ్లించారు. రైతు భరోసాకు కేటాయించారు. రాజీవ్ యువ వికాసం కోసం మొత్తం 5 లక్షల మందికి సబ్సిడీ కింద రుణాలివ్వాలని, దీని కోసం రూ. 6వేల కోట్లను కేటాయించింది సర్కార్. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ సర్కార్ మెడకు రైతు భరోసా గుదిబండలా మారింది. మొదటి నుంచి దాన్ని ఆపేస్తూ ఏదో కారణాలు చెబతూ బ్రేకులు వేస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న యాసంగి సీజన్ కోసం ఇచ్చినట్టే ఇచ్చి మూడెకరాలకే పరిమితం చేశారు. ఆ పై నిలిపేశారు. ఇక దాని ఊసేలేదు. ఇప్పుడు వానాకాలం సీజన్ కోసం మళ్లీ స్టార్ట్ చేశారు. కానీ మధ్యలో ఆపేస్తే రైతులు కొట్టేలా ఉన్నారు. ఎలా.? ఎలా..?? నిధులు లేవు.
అందుకే రాజీవ్ యువ వికాసం కోసం దాచి పెట్టిన నిధులను ఇటు మళ్లించారు. ఇప్పుడు చకచకా రైతు భరోసా నిధులు పడుతున్నాయి రైతుల ఖాతాల్లో కానీ, యువ వికాసం లోన్ల కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని ఎగబడి మరీ దరఖాస్తులు చేసుకుని ఎదురుచూపులు చూస్తున్న వారికి మాత్రం రేవంత్‌రెడ్డి సర్కార్ మొండి చేయే చూపింది. ఇప్పట్లో ఈ పథకాన్ని ఇక పట్టాలెక్కించేలా కూడా కనిపించడం లేదు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని తలంచిన ప్రభుత్వం.. రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తున్న నేపథ్యం… రైతు భరోసాను ఆపకుండా టకీటకీ ఇస్తే తప్ప కొంతలో కొంత ఉపశమనం దొరుకుతుందని భావించింది. దీని కోసం యువ వికాసం లబ్దిదారులను బలిపెట్టింది.