(దండుగుల శ్రీనివాస్)
ఊకో ఈ అప్పుల గోలనేనా.. కేసీఆర్ లెక్క కొత్త పథకాలు, కొంగొత్త నిర్ణయాలు తీసుకోరా..? ఆ రోజులే వేరు. ఆ పదేళ్ల కాలమే వేరు. నెలలో కనీసం మూడు నాలుగు రోజులైనా పాలాభిషేకాలు లేకుండా ఉండేవి కావు. అంతటి స్పూర్తి ప్రధాత, దాత కేసీఆర్. ఈ వర్గం ఆ వర్గమని కాదు.. అన్ని వర్గాలకు ఏదో ఒకటి చేయాలె.. పాలాభిషేకాలు చేయించుకోవాలె.. తెలంగాణ జాతి పితను నేనే అని అనిపించుకోవాలె.. దీని కోసమే కదా ఆయన తపన. అందుకే అన్ని వర్గాలు ఆయనకు భుజకీర్తులు ధరింపజేసే కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా చేసేవారు. ఆయనకూ ఇలా పాలాభిషేకాలు చేయించుకోవడమంటే ఎంతో ఇష్టం.
ఈ పొగడ్తలు వీనుల విందులాయనకు. అలా ఆ రోజులు గడిచిపోయేవి. వద్దన్నా పథకాలు వడ్డించేవాడు. అప్పుల గోల లేకపోయేది. ఆ విషయాలే చెప్పేవాడు కాదు. పైగా మనది ధనిక రాష్ట్రమని ఆయన చెప్పే ఆ మాటలకు వచ్చే కిక్కే వేరప్పా..! అంతటి సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజులు మళ్లీ వస్తాయా.. ! ఇప్పటి రోజులు చూస్తుంటే అవి కనిపించడం లేదు కనుచూపు మేరలో. ఒక్క ఒక్క పాలాభిషేకం ప్లీజ్…అని అడుక్కునే రోజులు వచ్చాయి. అప్పట్లో కొందరు గిట్టని వాళ్లు మమ్మల్ని చూసి పాల ప్యాకెట్ల బ్యాచ్ అనేవాళ్లు.. దీనికి మే మేమీ సిగ్గుపడేవాళ్లం కాదు.
అవును.. బరాబర్ చేస్తం పాలాభిషేకాలు.. ఆయన మాకోసం ఇంత చేస్తే మేం ఆయనకోసం ఒక్క పది రూపాయాలు పెట్టి ఒక్క పాలప్యాకెట్‌తో ఆ ఫోటోపై పాలు చిలకరించలేమా..? ఇప్పుడు ఎందుకు మీరు చేస్తలేరు..? అసలు కాంగ్రెస్ పాలనలో పాల ప్యాకెట్ల గిరాకీ మొత్తం పడిపోయింది తెలుసా..? ఎందుకు..? పాలాభిషేకాలు చేయడం లేదు. చేసేలా పాలన లేదు మరి. ఎప్పుడు చేస్తారు..? ఎప్పుడు పాలాభిషేకాల ఆ సుందర దృశ్యాలు చూడాలి….!?????