(దండుగుల శ్రీనివాస్)
తెలంగాణ జాగృతి అని మళ్లీ కొత్త పాటందుకున్నది అక్క. బాపు పేరు చెప్పి సెంటిమెంట్ రాజేసి ఎట్లైనా సీఎం కావాలని చూస్తున్నాడు అన్న. భలే భలే మంచిగైంది. మీ తిక్క కుదరింది. నన్ను ఫామ్‌హౌజ్ కు పరిమితం చేస్తారా..? తగిన శాస్తి జరిగింది. తెలంగాణకు నేనే దిక్కు.. అని మళ్లీ సెంటిమెంట్ రాజేస్తూ వ్యూహ రచనలో మునిగి వున్నాడు బాపు. అందుకే మళ్లీ తెలంగాణ జర్నలిస్టు ఫోరం .. కదం తొక్కే టైమ్ వచ్చిందని ముందుకొచ్చారు. మళ్లీ అల్లం బెల్లమయ్యాడు. కోదండరామ్‌కు వ్యతిరేకంగా ఆనాడు కేసీఆర్ పుట్టించి అటకెక్కించిన తెలంగాణ వికాస సమితి కూడా లేస్తున్నది. ఇలా అన్నింటికీ జవజీవాలందిస్తున్నారు.
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్నారు. ఈ సెంటిమెంట్ ఆయింట్‌మెంట్ పనిచేస్తదా.? అంత సీన్ లేదు. అది నడవని ముచ్చట. కానీ అంతకు మించి మార్గం లేదు. అధికారం తెచ్చిపెట్టిందదే. మళ్లీ అధికారం దిశగా తీసుకుపోతుందనే ఆశా దానితోనే. కానీ జనం సెంటిమెంట్‌ను మరిచారు. నమ్మకాన్ని వమ్ముచేసిన బాపు, అక్క, అన్నలు ఎంత ఆయింట్‌మెంట్ పూసినా ఆ గాయాలు మానేలా లేవు. వాళ్లు నమ్మేలా లేరు. అక్కడ అధికార వాటా కోసం కొట్లాట జరుగుతున్నది. ఇప్పట్నుంచే హుషార్ అవుతున్నారు. రేపు అధికారం మనదే.. అప్పుడు ఎవరిది ఎంత నడవాలె..? ఏ పొజిషన్‌లో ఎవలం ఉండాలె..? ఇప్పుడు ఆ లొల్లి ముగ్గురిలో నడుస్తున్నది. ముగ్గురూ ముగ్గురే అన్నట్టుగా సాగుతోంది.
నమ్మి నానబోస్తే పుచ్చు పుర్రెలయినట్టు .. ఒకరిని మార్పు కోసం తీసుకొస్తే.. కోసినా ఏం చేయలేనంటున్నాడు. ఇంకొకరిని ఇక చాలు మీ పాలన .. అని ఫామ్‌హౌజ్ లో కూసోబెడితే.. చూశారా.. మళ్లీ మేమే యాదికొస్తున్నాం.. తప్పదు మా కాళ్లకాడికి రావాల్సిందేనని బీరాలు పలుకుతూ ఇప్పట్నుంచి అధికారాల వికేంద్రీకరణపై నజర్ పెట్టారు. మధ్యలో తెలంగాణ ప్రజలను మాత్రం వెర్రి గొర్రెలను చేస్తున్నారు. హ్యాపీ ఫార్మేషన్ డే అందరికీ.