(దండుగుల శ్రీనివాస్)
ఏం సెబితిరి ఏం సెబితిరి… అప్పులు లేనోలెవలూ అన్నడు..? ఎవలూ చేతులెత్తలే. అందరికీ అప్పులే ఉన్నయి. ఒక్క కల్వకుంట్ల ఫ్యామిలీకి, బీఆరెస్ టీమ్‌కు తప్ప.. ! జనం పరిస్థితి ఊపర్ షేర్‌వానీ అందర్ పరేషానీ లెక్కుందన్నమాట. సీఎంను ఎక్కిరిద్దామని అందుకున్న పల్లవే కానీ.. ఒకవేలు అటు చూపితే మిగిలినవి మిమ్మల్నే చూపుతున్నయి రామా..! పదేండ్లు పాలించిండ్రు. జనం బొక్కల బనీన్లు ఏసుకునే పరిస్థితే ఉంది. నిజం చెప్పిండ్రు. పదేండ్లు పాలించి మీరు చేసిన పుణ్యమే ఇది. నిజం ఒప్పుకుండ్రు. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకే. బాగుపడుతందుకు కాదు. అప్పుల పాలైతందుకు. మీరు చేసిన అప్పులకు తిప్పలు ఈ సర్కార్ కంటిన్యూ చేస్తున్నది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డరన్నమాట. ఇదీ నిజమే. మీరెవరు వచ్చినా ఏం ఒరిగిందేమీలేదని తేలిపోయింది. జనానికీ తెలిసిపోయింది. అప్పులు పుడతలేవని రేవంతు చెప్పినట్టుగా, తెలంగాణ జనం అంతా అప్పుల్లో ఉన్నారని నువ్వూచెప్పావు. ఇద్దరూ ఇద్దరే అన్నమాట.
27Vastavam.in (4)
ఓటేసిండ్రు కదా ఐదేండ్లు శిక్ష అనుభవించండనీ అన్నడు. అంటే కాంగ్రెస్‌కు ఓటేసినందుకు కసా..? ఈ సర్కార్ ఒద్దంటున్నరంట జనాలు. అంటే జనానికి బుద్దొచ్చిందని చెబుతున్నాడు రాముడు. అంతేగానీ వాళ్ల పాపాలు, లోపాలేమీ లేవని చెబుతున్నాడు. వాళ్లంతా కరెక్టే. పిచ్చి జనమే కేసీఆర్‌ను కాదని రేవంతును తెచ్చిపెట్టుకున్నరు. ఇప్పుడు తగిన శాస్తి జరిగిందంటున్నడు. ఇలా సమయం దొరికినప్పుడల్లా తండ్రీకొడుకులూ ఇద్దరూ జనాన్ని శాపనార్ధాలు పెడుతున్నారు. దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడూ అదే చేస్తున్నరు. ఇంకా చేస్తనే ఉంటరు. మూడేండ్ల దాకా. పాపం ఈ మూడేండ్లు ఏం చేయలేకపోతున్నామని కూడా బాధపడిపోయాడు రాము.
పార్టీ మారిన ఎమ్మెల్యేలను సన్నాసులు, దద్దమ్మలన్నాడు. అప్పుడు పార్టీలోకి గుంజుకున్న మీరు కూడా సన్నాసులు, దద్దమ్మేల అయితరు కదా …! పాత విషయాలొద్దు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క. ఇప్పుడు అధికారం పోయినంక ఇట్ల తిక్కతిక్క. అంతే. అందరిదీ ఇదే తంతు. సీఎంను మైండ్ దొబ్బిందనే విధంగా మాట్లాడినవ్. గతంలో చాలా సార్లు చెప్పిన ముచ్చటనే ఇది. మరి నీ మైండ్ కూడా దొబ్బిందేమో అనిపిస్తుంది రాము.వాడు వీడు అంటావు. ముఖ్యమంత్రి గారు అని మరోసారి అంటావ్. రాము, రెమో అంటావు. నిజం చెప్పొద్దు.. నువ్వు రాము, రెమో అన్నప్పుడల్లా నువ్వే ఆ రాము అనిపిస్తుంది. నీ పేరు కూడా రామే కదా. నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నట్టుంటుంది.
చివరాఖరు ముచ్చట. నువ్వు మాట్లాడుతున్నంత సేపు ఆ వేదిక మీదున్నోళ్లు ఆముదం తాగినట్టు ముఖం పెట్టారు జర గమనించు. సీనియర్లు అయితే నీ వంక భయం భయంగా చూస్తున్నారు. ఏం మాట్లాడతాడో. ఏం తడబడతాడో. నాలుక మడతెడతాడోనని. అంటే, ఇంకా నువ్వు నన్ను మించిన ఘనుడు లేడనుకుంటున్నావ్. ఇంకా యువరాజేనని భ్రమలోనే ఉన్నావ్. అధికారం లేదనే విషయం తెలిసినప్పుడల్లా ఇట్లా ఎడాపెడా ఏది పడితే అది..మాట్లాడే క్రమంలో నిజాలూ చెబుతున్నావ్. పదేండ్ల పాలన లోపాలు, పాపాలను చెప్పకనే చెబుతున్నావ్. మూడేండ్ల ఆగాల్నా అని మదనపడుతున్నావ్. ఈ దుస్థితికి కారణమైన జనాలను శపిస్తున్నావ్. అనుభవించుండ్రి కొడుకుల్లారా..! అన్నట్టుగా రాము, రెమో పాత్రాల్లో జీవించేస్తున్నావ్. ఏమంటావ్. కాదంటావా..??