(దండుగుల శ్రీ‌నివాస్‌)

కేసీఆర్ మీద మ‌రింత ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఆర్కేకు మంచి అవ‌కాశం దొరికింది. అది ఆయ‌న కూతురు క‌విత రూపంలోనే రావ‌డంతో త‌న క‌త్తికి ప‌దును పెట్టాడు. వ‌రుస‌గా వార్త క‌థ‌నాలు ఆంధ్ర‌జ్యోతిలో వండి వారుస్తున్నాడు. గ‌తంలో ష‌ర్మిల పార్టీ పెట్టే విష‌యంలో కూడా అంతే అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన ఆర్కే.. క‌విత విష‌యంలో మ‌రింత దూకుడుగా పోతున్నాడు. గ‌త రెండ్రోజులుగా ఆ ప‌త్రిక‌లో పూర్తి క‌ల్పిత‌, డ్యామేజీ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కేసీఆర్ రాయ‌బారం పంపాడు నిజ‌మే. కానీ అక్క‌డేం మాట్లాడారో ఎవ‌రికీ తెలియ‌దు. కేసీఆర్.. క‌విత‌కు ఫోన్ చేసి మాట్లాడాడ‌ని రాశాడు. అంత సీన్ అక్క‌డ లేదు.

28Vastavam.in (4)

ఇక ఇవాళ వచ్చిన వార్తైతే .. కాంగ్రెస్‌తో క‌విత రాయ‌బారం న‌డిపిందని. ఆపార్టీలోకి వెళ్లేందుకు రెడీ అవుతోంద‌ని. ఇది మ‌రింత భిన్న‌మైన, అవాస్త‌వ క‌ల్పిత క‌థ‌నం. దీన్ని క‌నీసం ఎవ‌రూ నిజ‌మా..!? అని కూడా శంకించ‌రు. పూర్తిగా అబ‌ద్ద‌మ‌నే కొట్టి పారేస్తారు. మ‌రెందుకు ఆర్కే ఈ క‌థ‌నాలు రాస్తున్నాడు..? ఒకటే కార‌ణం. క‌విత‌ను మ‌రింత బ‌ద్నాం చేయాలె. త‌ద్వారా కేసీఆర్ మ‌రింత కుంగిపోవాలె. అంతిమంగా పార్టీ భ్ర‌ష్టు ప‌ట్టుపోవాలె. కేటీఆర్ దూకుడుకు కళ్లెం వేయాలె. ఇవ‌న్నీ ఆర్కే మ‌దిలోని ఆలోచ‌న‌లు. ఆ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా సాగుతున్నాయా క‌థ‌నాలు. ఇవి ఆరంభం మాత్రమే. ఇంకా ముందు ముందు ఆ పేప‌ర్లో వ‌చ్చే వార్త‌లు కాంగ్రెస్‌కు కంటికి ఇంపుగా, క‌విత టీమ్‌కు ఒళ్లు జ‌ల‌ద‌రింపుగా, బీఆరెస్ టీమ్‌కు వికారంగా ఉండ‌నున్నాయి. వాస్త‌వానికి, క‌విత కాంగ్రెస్‌ను, రేవంత్‌రెడ్డిని పొట్టు పొట్టు తిడుతున్న‌ది. మొన్న‌టికి మొన్న ఫార్మూలా- ఈ కార్ రేసు కేసులో ఏబీసీ నోటీసుపై స‌త్వ‌రం స్పందించింది.

బీజేపీ విష‌యంలో కూడా అంతే. వ‌డ్డీతో స‌హా చెల్లిస్తాన‌ని జైలు నుంచి విడుద‌లైన త‌రువాత శ‌ప‌థం చేసిన ఆమె… వ‌రంగ‌ల్ స‌భ‌లో తండ్రి ఆ పార్టీని ఎందుకు టార్గెట్ చేయ‌లేద‌నే విష‌యాన్ని కూడా పొందుప‌ర్చింది. ఇప్ప‌టికిప్పుడు ఆమె ఏ పార్టీలోకి పోయే ఆలోచ‌న లేదు. సేమ్ కేసీఆర్ స్టాండ్ లాగే. కేసీఆర్‌ను కూడా బీజేపీతో జ‌త క‌డ‌తాడు… కాంగ్రెస్‌లో విలీనం కాబోతున్నాడు.. అనే ఎన్ని క‌థ‌నాలు వండినా అవ‌న్నీ ఉత్త ఫేక్ ముచ్చ‌ట్లు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టే రాజ‌కీయ వ్యూహాలు, క‌ల‌వ‌డాలుంటాయి త‌ప్పితే ఇప్ప‌టిక‌ప్పుడు ఏ పార్టీకి స‌పోర్టుగా ఉండి త‌న‌ను తాను త‌గ్గించుకోడు కేసీఆర్‌. అదే బాట‌లో ప‌య‌నిస్తోంది క‌విత‌. బీఆరెస్‌లో ఉంటూ త‌న‌కంటూ సొంత బ‌ల‌గాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. జాగృతి పేరు మీదే ముందుకు సాగాల‌ని డిసైడ్ అయ్యింది. దీని వ‌ల్ల ఎవ‌రికీ ఇమ్మీడియ‌ట్ న‌ష్టం లేదు. బీఆరెస్‌ను ఇరుకున పెట్టాల‌ని లేదు క‌విత‌కు. అదే స‌మ‌యంలో త‌న దారి త‌న‌ద‌నే తండ్రికి, అన్న‌కు సిగ్న‌ల్ ఇచ్చేసింది. సింగ‌రేణి జాగృతి టీమ్ ఏర్పాటు అందులో భాగ‌మే.

ఇక రాష్ట్ర క‌మిటీలు, అనుబంధ కమిటీలు, జిల్లా క‌మిటీలు బ‌లోపేతం కానున్నాయి. అంద‌రినీ ఆమె మార్చ‌నుంది. దీనికి రాజ‌కీయ రంగు తీసుకురానుంది. పార్టీ ఏర్పాటు ప‌క్కా. కానీ అది ఇప్పుడు కాదు. స‌మ‌యం వ‌చ్చే వ‌ర‌కు వేచి చూసి అప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ జాగృతి పేరు మీద త‌న ప‌ని తాను దూకుడు చేసుకుంటూ పోవ‌డ‌మే ఇప్పుడామె ముందున్న క‌ర్త‌వ్యం. మొన్న‌టి కొత్త ప‌లుకులో కూడా ఆర్కే చెత్త‌గా ప‌లికాడ‌ని బీఆరెస్ టీమ్ ఆర్కే పై సోష‌ల్ మీడియాలో దాడి మొద‌లుపెట్టింది. ఎప్ప‌టికైనా మా బాపు కేసీఆరే సీఎం.. గుర్తుంచుకో, ఖ‌బ‌డ్దార్ కేసీఆర్‌..! అంటూ చెత్త చెత్త‌గా తిడుతూ సోష‌ల్ మీడియాలో ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. బీఆరెస్ సోష‌ల్ మీడియా దీన్ని వైర‌ల్ చేస్తోంది. బిడ్డె భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్‌ను పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చిపాడేద్దామ‌ని తుపాకీని సిద్దం చేసుకుని పెట్టుకున్నాడు ఆర్కే.

ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌మాట‌. క‌విత‌ను డీమోర‌లైజ్ చేయ‌డం… త‌ద్వారా పార్టీని, కేసీఆర్‌ను జ‌నాల ముందు ప‌ల‌చ‌న చేయ‌డం ఆర్కే ల‌క్ష్యం. ఇప్పుడు ఆర్కే మీడియాలో అదే వంటావార్పు కార్య‌క్ర‌మం న‌డుస్తోంది. అందులో మ‌సాలాలు బాగా ద‌ట్టించి వండ‌టంతో ఆ ఘాటు, క‌విత‌, కేటీఆర్‌, కేసీఆర్ అండ్ టీమ్‌ల‌కు ముక్కు పుటాలు అదిరేలా,అజీర్తి చేసేలా ఉంటున్నాయి. ఉండ‌నున్నాయి.