(దండుగుల శ్రీనివాస్)
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)కు ఎదురైన సంఘటన ఇది. పార్టీలో తనను పట్టించుకోలేదనే కారణంతో బీఆరెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చాడు కేసీఆర్. ఆ తరువాత రాజ్యసభ మెంబర్‌ను చేశాడు. తన కూతురుకు ఇందూరులో రాజకీయంగా అడ్డమేమీ ఉండొద్దనే ఇదంతా చేశాడు. ఆ తరువాత షరా మామూలే. వేరే పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చే విలువ, గౌరవం.. తన పార్టీలో చేరిన తరువాత ఆశించొద్దు. అది అందరికీ తెలుసు. కానీ డీఎస్ తెలుసుకోలేకపోయాడు. తన సమకాలీకుడే అయినందున కేసీఆర్ తనకు మంచి ప్రయార్టీ ఇస్తాడనుకున్నాడు. కానీ పట్టించుకోలేదు. పక్కన పెట్టేశాడు.
ఆ తరువాత డీఎస్ చిన్న కొడుకు అర్వింద్ రాజకీయ ఆరంగేట్రం చేశాడు. అదీ బీజేపీ నుంచి. ఇది కేసీఆర్‌కు ఊహించని షాక్. బిడ్డెకు ఎదురేలేకుండా చేద్దామని డీఎస్‌ను గంపకింద కమ్మేస్తే ఇదేందీ.. బీజేపీ ముసుగు తొడుక్కొని డీఎస్ ఇంటి నుంచే మరొకడా..? ఆ తరువాత కనీసం డీఎస్‌తో కలిసేందుకు కూడా టైమ్ ఇవ్వలేదు కేసీఆర్. ఓ సారి కలిసేందుకు వెళ్తే.. హేళనగా మాట్లాడాడు కేసీఆర్. తన మాట కొడుకు వినడం లేదని, అతని అభిప్రాయం అదేనని, చిన్నప్పట్నుంచే బీజేపీని అభిమానిస్తాడని చెప్పుకొచ్చాడు. ఎగాదిగా చూసి నువ్వేం తండ్రివయ్యా.. నువ్వు చెప్పినా వినడా..? అని.. అదే మాటను పక్కనున్న వారితో షేర్ చేసుకుని హేళనగా వెటకారంగా ఓ నవ్వు నవ్వి అక్కడి నుంచి చరాచరా వెళ్లిపోయాడు.
అదే ఆఖరు మీటింగు. ఆ తరువాత డీఎస్ .. కేసీఆర్‌ను కలవలేదు. కలిసే ప్రయత్నం చేయలేదు. పార్టీలో ఉన్నా లేనట్టుగానే ఒంటరిగా గడిపాడు. రాజ్యసభ సభ్యత్వం మాత్రం కంటిన్యూ అయ్యింది. పెద్ద కొడుకు సంజయ్‌ను జైలు పాలు చేయటం, తనను ఇటు కాంగ్రెస్ కూడా పెద్దగా పట్టించకోకపోవటం… జీవిత చరమాంకంలో నరకయాతన పడ్డాడు. ఇవన్నీ ఇప్పుడెందుకంటే.. కేసీఆర్‌కూ అదే సీన్ రిపీట్ కానుంది. కవిత ఏకంగా కేసీఆర్ వైఖరినే నిలదీస్తోంది. వ్యవహారశైలిని ప్రశ్నిస్తోంది. తనదాకా వస్తేగానీ తెల్వదన్నట్టు.. జాతిపిత ఇప్పుడు బిడ్డె రూపంలో రాజకీయంగా సవాళ్లు ఎదుర్కోనున్నాడు.