(దండుగుల శ్రీనివాస్)
కత్తి కాంతారావు సినిమా ఈవీవీ తీసింది. సూపర్ హిట్. కామెడీ అదుర్స్. బడ్జెట్ పద్మనాభం సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి తీసింది. ఇదీ సూపర్ హిట్టే. పిసినారి, పొదుపరి హీరో ప్రధాన పాత్రగా వచ్చిందిది. సరే ఈ రెండు సినిమాలూ హిట్టే. అసలు ఈ టైటిల్ ఏందీ..? ఈ హిట్టూ .. ఫట్టూ ఏందీ..?? నేను చెప్పేది సినిమాల గురించి కాదు. ఆ సినిమాలకు కరెక్టుగా యాప్ట్ అయ్యే రెండు ప్రధాన పాత్రల గురించి. ఒక పాత్ర కేసీఆర్. ఇంకో పాత్ర రేవంత్‌రెడ్డి. ఒకరు కత్తి కాంతారావు. ఇంకొకరు బడ్జెట్ పద్మనాభం. కేసీఆర్‌కు కత్తి కాంతారావు అని ఎందుకు పేరు పెట్టావ్ బ్రదర్…? ఎందుకంటే.. ఆయనన్నాడు కదా. కత్తి ఒకరికిచ్చి నన్ను యుద్దం చేయమంటే ఎలా..? అని. అందుకే కేసీఆర్ ఇప్పుడు కత్తి కాంతారావు అయ్యిండు. అసలు కత్తి కేసీఆర్ చేతిలోనే ఉంది. అదే ప్రతిపక్ష పాత్ర. ఇప్పుడే అస్సలైన యుద్దం చేయవచ్చు. అధికారం ఉన్నప్పుడు వినలేదు. చెప్పేవాళ్లు లేరు. కళ్లు నెత్తికెక్కినయి. అహంకారం ఆకాశానికంటింది. ఇప్పుడు నేలదించిండ్రు. కత్తి చేతికిచ్చిండ్రు. కానీ కేసీఆర్‌కు అధికారముంటేనే కత్తి చేతిలో ఉన్నట్టంట. ఇదెక్కడి సిద్దాంతమో. డెబ్బై వేల పుస్తకాలలో దేంట్లో రాసి వుందో.
తెలంగాణ సాధించిన జాతిపితగా అందరు తనను పిలవాలనుకున్నాడు. తప్పులేదు. ఎవరు కాదన్నా.. కేసీఆర్ ఉద్యమ దళపతే. రాష్ట్రం వచ్చింది. దళితుడికి ఇస్తానన్న సీఎం కుర్చీపై మోజు పెరిగింది. తనే సీఎంగా పాలించి… చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా పాలన చేసి అజరామరంగా నిలిచిపోతే.. ఇదే ఆలోచన కేసీఆర్‌ది. దీని వెనుక కీర్తి ఖండూతి సహజంగానే. ఇక సీఎం అయ్యాడు. అధికారం చేతిలో ఉంటే ఆ మజా ఎలా ఉందో అనుభవించాడు. సహజంగానే ఎవరి మాట వినేవాడు కాదు. ఇక సీఎం పదవి చేతిలో ఉండే. ఇబ్బడిముబ్బడిగా పథకాలు. అంతా ఆహో ఓహో అని కీర్తించాలనే యావ. పనికిమాలిన, పేదల దరిచేరని, ఖజానాకు భారీ భారం అయ్యే పథకాలెన్నో వచ్చి పడ్డాయి. బయటపడనీయలేదు. గుట్టు చప్పుడు కాకుండా సంసారం నెట్టుకొచ్చిండు. ఎట్లాగు వరుసగా తనే నాలుగు టర్ములు సీఎం అని ఫిక్సయిపోయాడు. కానీ ఇక్కడ పతకం బెడిసికొట్టింది. అనూహ్యంగా కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. కేసీఆర్ చేసిన అప్పులు. తప్పులు. తిప్పలు. చిప్పలు.
మరి రేవంత్‌రెడ్డేమన్నా తక్కువ తిన్నాడా..? అబీ నహీతో కబీ నహి అన్నడు. నువ్వు ఒకటి చెబితే నేను వంద చెబుతానన్నాడు. తుమ్ షేర్ హయ్‌తో హమ్ సవ్వా షేర్ అన్నడు. అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు బడ్జెట్ సుద్దలు చెబతుండు. చెప్తే చెప్పినవ్ గానీ, మరీ సీఎంగా ఉండి రాష్ట్రం ఇజ్జత్ తీసుడు కరెక్టేనా. అదేదో జనం నిన్ను, కాంగ్రెస్‌ను ఏరికోరి ఎంపిక చేసినట్టు. నవ్వు లేకపోతే ఇక ఎవరూ పాలించేవారే లేరని జనం డిసైడ్ అయ్యి నీకు బద్దలు కట్టినట్టు. చావు తప్పి కన్ను లొట్ట బోయిన చందంగానే నువ్వు గెలిచావు రేవంత్. అది మరిచిపోకు.
రేవంత్ మాటలు చూస్తే.. ఆంద్రోడు ఎవడో అతనిలో పరాకాయ ప్రవేశం చేసినట్టే ఉంది. తెలంగాణ విఫల ప్రయత్నమేనని అంతా అనుకున్నారు. దాని కోసమే ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు మంచి శుభారంభం పలుకుతున్నాడు రేవంత్. సీఎం హోదాలో అవ్వా మాటలు మాట్లాడాల్సినవి. సమ్మె చేస్తామంటే.. చేస్తే చేస్కోర్రి నాదేం పొయ్యింది. మీ తెలంగాణ పరువే కదా పోయేది అన్నట్టుగా మాట్టాడిండు. ఇంతకన్నా దారుణం ఉంటుందా..? వాళ్లను పిలిచి మాట్లాడు. బుజ్జగించు. ఇలా బహిరంగ వేదికల మీద రేవంత్ మాట్లాడే పద్దతి పక్కాగా బెదిరింపు దోరణి. బ్లాక్‌మెయిలింగే.
ఇప్పుడు ఇంత చెబుతున్న సీఎం… మళ్లీ ఎన్నికల నాటికి ఈ ఉచిత పథకాలు వల్లె వేయడా..? అవి చెప్పకుండానే ఎన్నికలకు పోతాడా…? చెబితే మరి ఇంకా నమ్మేదెవడు..? కనీసం పార్టీ భవష్యత్తును దృష్టిలో పెట్టుకునైనా ప్రవర్తించాలె. అదీ లేదు. అంటే ఇది రాష్ట్ర పరపతికే కాదు.. కాంగ్రెస్ భవిష్యత్తుకూ గొడ్డలిపెట్టే. డౌట్‌లేదు. సీఎం రేవంత్ స్థానంలో ఇంకెవరున్నా.. ఇలా దారుణంగా, హీనాతిహీనంగా మాట్టాడేవారు మాత్రం కాదు. ఇంటికి పెద్ద అని నువ్వే అంటావు. ఇంటి పెద్ద ఇంటి పరువు జజారున పడేసుకుంటాడా..? అని ఉద్యోగ సంఘాలనుద్దేశించి మాట్లాడిందీ నువ్వే. మరి నువ్వు చేసిందేమిటి రేవంతు. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, జనాలు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నది నీలాంటి సీఎంను చూడాలని కాదు. ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కోవాలని అస్సలే కాదు. ఏమన్నా అంటే కేసీఆర్ చేసిన పాపం అంటావు. ఆ పాపిని అందుకే కదా ఫామ్‌హౌజ్ లో పండవెట్టిండ్రు. నువ్వేం చేస్తావో చెయ్యి. లేదంటే ఇలాంటి మాటలతోనే కాలం గడుపుతా అంటే నీ చెయ్యి గుర్తు చెయ్యి విరిచేయడం ఖాయం.
ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ నాకు కత్తెందుకు ఇయ్యలేదని జనం మీద కసితో మాట్లాడతాడు.
నువ్వొచ్చి ఏదో వెలగబెడతావని రేవంత్‌కు అప్పగిస్తే దేశం ముందు రాష్ట్రం ఇజ్జత్ తీసినట్టే మాట్లాడవట్టే. అంటే ఈ రెండు సినిమాలూ ఫ్లాప్ ఇక్కడ.
జనం ఇంకా ఇంకా ఫ్లాప్. గెలిపించి ఓడారు. గెలిచి జనం మనసులో వీరిద్దరూ దారుణంగా ఓడారు.
Dandugula Srinivas
8096677451