(దండుగుల శ్రీనివాస్)
ఎట్టకేలకు ఊరిస్తూ ఊరిస్తూ కేబినెట్ విస్తరణకు ఓకే చెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఉగాది తరువాత కేబినెట్ విస్తరణ ఉంటుంది. నలుగురికి చాన్స్ లభించింది. మరో ఇద్దరి పేర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే రెడ్లు ఎక్కువయ్యారనుకుంటే.. సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లకు చాన్స్ ఇచ్చింది అధిష్టానం. ఎస్సీ కోటా నుంచి వీ 6 వివేక్‌కు, బీసీ కోటా నుంచి శ్రీహరి ముదిరాజ్‌పేర్లు ఫైనల్ చేసింది. ఇది అందరికీ తెలిసిన వార్తే. శాఖల్లో కూడా భారీ మార్పులుంటాయనీ తెలుసు. కానీ ఒకరి కేబినెట్ నుంచి తొలగిస్తారని జరుగుతున్న ప్రచారం ఇప్పుడింకా బలపడింది. ఇదిప్పుడు హాట్ వార్తగా మారింది. ఎవరిని తొలగిస్తారు..? ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా కొండా సురేఖనా..? జూపల్లి కృష్ణారావునా..?? తేలాల్సి ఉంది. వీరిద్దరూ సీఎం రేవంత్‌కు దగ్గరే అనే పేరుంది.
కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఔట్ కాకతప్పదు. ఎవరిపై వేటు పడుతుందనే విషయాన్ని సామాజిక కోణం దృష్టితో ఆలోచిస్తే… కొండా సురేఖ సేఫేనని చెప్పాలి. ఎందుకంటే.. కొండా పద్మాశాలి. ఆమె భర్త మున్నూరుకాపు. ఈమెకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రెండు మేజర్ కులాలకు ప్రాతినిథ్యం కల్పించినట్టయ్యింది ప్రభుత్వానికి. ఇదికాక మహిళా మంత్రిని తొలగించాలనే ఆలోచన అంత ఈజీగా చేయరు. ఇవన్నీ ఆమెకు కలిసి వచ్చే అంశాలే. మరి జూపల్లిని తొలగిస్తే…?? అసలు ఎందుకు తొలగిస్తారు..?? ఆ మధ్య సీఎం కేటీఆర్ అని సంభోదించి ఇరుకున పడ్డాడు జూపల్లి. కేటీఆర్ కూడా దీనిపై స్పందించి ఇక నీ మంత్రి పదవికి గండం ఉంది చూసుకో జర జాగ్రత్త అని కామెంట్ చేశాడు. ఇదొక్కటే కారణం కాకపోయినా.. మొదటి నుంచి సర్కార్ దృష్టిలో నెగిటివ్ కోణంలో ఉన్న వారిలో జూపల్లి ఒకడు.
కొండాను కాదంటే జూపల్లి బలి కావాల్సిందే. జూపల్లి ప్లేస్ ఎవరికిస్తారు…? వెలమ సామాజిక వర్గానికి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లీడర్ ప్రేమ్‌సాగర్‌కు ఇవ్వొచ్చు. లేదంటే రెడ్ల లో ఒకరికే ఇవ్వాలి.. అదీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికే ఇవ్వాలని అనుకుంటే సుదర్శన్‌రెడ్డికి కట్ చేసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మదన్‌మెహన్‌కు కూడా ఇవ్వొచ్చు. మదన్ మోహన్ కన్నా… ప్రేమ్ సాగర్‌కే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కు మంత్రే లేకుండా పోతాడు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా వాసే అయినందున…? అతనికి కొరకరాని కొయ్యగా ఉన్న సుదర్శన్‌రెడ్డికి ఇవ్వకుండా ఆపేస్తారా..? చూడాలి. కానీ సుదర్శన్‌రెడ్డికే కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని సీఎం పట్టుబట్టాడు. దీని పై క్లారిటీ రానుంది.