(దండుగుల శ్రీనివాస్)
మరో మూడు నాలుగు టర్ములు.. అంటే పదిహేను, ఇరవై ఏండ్ల పాటు తనే సీఎంగా ఉంటే బీఆరెస్, బీజేపీ బతుకులు బస్టాండ్ కాకతప్పదని ఆ పార్టీల నేతలు భయపడుతున్నారని అన్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. ఏడాది పాలనలోనే తనను తట్టుకోలేకపోతున్నకేసీఆర్, బీజేపీ నేతలు.. ప్రభుత్వంపై బండలేస్తున్నారని, దిగిపోవాలని కోరుకుంటున్నారని అన్నాడు. వనపర్తిలో జరిగిన భారీ బహిరంగ సభనుద్దేశించి సీఎం మాట్లాడాడు. ఐదేళ్ల కోసం తమను జనాలు ఎన్నుకుంటే అప్పుడే దిగిపోవాలని కోరుకోవడమేంటని ప్రశ్నించాడాయన. పదేండ్ల పాటు దోచుకున్నారు. పచ్చగున్న తెలంగాణను మంటగలిపారు. వెచ్చగున్న చోట ఫామ్‌హౌజ్ లల్ల పండుకున్నారు. చేయాల్సిందంతా చేశారు.
దోచుకోవాల్సిందంతా దోచుకున్నారు. ఇప్పుడు మాకిచ్చారు జనాలు అధికారం. అప్పుడే తట్టుకోలేకపోతున్నారు. ఇక పదిహేను, ఇరవై ఏండ్ల పాటు నేనే సీఎంగా ఉండి.. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మీ బతుకులు బస్టాండే అని విషయం ఇప్పుడే తెలిసిపోయింది వారికి. అందుకే ఇవన్నీ అబద్దాలు ఆడుతూ సర్కార్‌పై బండలేస్తున్నారని ఘాటు విమర్శలు చేయడం కలకలం రేపింది