(దండుగుల శ్రీనివాస్)
ఇదేందీ …! ఈ హెడ్డింగు పరమార్ధమేందీ శ్రీనివాసా..! ఏంలేదు. శివరాత్రి తెల్లారే పోలింగు. శివాలయాలకు వెళ్లి పూజలు చేసుకుని ఉపవాసాలు వదిలేసే సరికి పుణ్యకాలం కాస్తా ముగుస్తుంది. ఇక ఎప్పుడు ఓటేస్తారు..? వేస్తారా..? వేయరా..?? నేనొక్కడినీ వేయకపోతే రిజల్టు తారుమారవుతుందా…? అనే అనాసక్తి అందరినీ ఆవహిస్తే. ఇక అంతే సంగతులు. పోలింగ్ పర్సెంటేజీ ఢమాల్ అంటుంది. ఈ పోలింగ్ శాతం తగ్గడం ఎవరికో మేలు చేస్తుంది. మరెవరికో చెడు చేసి పెడుతుంది. వారెవరు. అందుకే అన్నాను.. ఈ శివరాత్రి ఎవరి కొంప ముంచనుందని. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటీజే 70 శాతం లోపు నమోదుయ్యింది.
ఇప్పుడు 50 శాతం కూడా దాటుతుందా లేదా అనే అనుమానాలు ఆయా పార్టీ అభ్యర్థులే వ్యక్తం చేస్తున్నారు. సహజంగానే పోలింగ్ పెరిగితే కాంగ్రెస్ అభ్యర్థికి మేలు జరుగతుందని అనుకుంటారంతా. కానీ ఇక్కడ పోలింగ్ శాతం పెరిగితే బీజేపీ అభ్యర్తికే మేలు అని అంచనాకొచ్చారు బీజేపీ శ్రేణులు. అందుకే ఈ శివరాత్రి మా కొంపముంచుతుందా అని కూడా ముందే అనుకుంటున్నారు. అంటే ఈ లెక్కన.. బీజేపీ అంచనా ప్రకారం.. పోలింగు శాతం తగ్గనుంది. అది కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపు తీరాలకు చేర్చనుంది.
ఇప్పుడిదే ముచ్చట కొనసాగుతుంది అంతట. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంలో ఉన్నాడనే ప్రచారమూ జోరందుకున్నది. రెండో స్థానంలో బీసీ అభ్యర్థి ఉండగా… మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉన్నాడట. మరి ఈ శివరాత్రి ఎవరి కొంప ముంచనుందో చూడాలి. ఎవరికి దండలేయనుందో.. ఎవరిని దండిచనుందో ఉత్కంఠ కొనసాగుతున్నది.