(దండుగుల శ్రీనివాస్)
ఏడాది గడిచినా అవే మాటలు. సాకులు వెతుక్కునే ప్రయత్నాలు. అసమర్థతను కప్పిపుచ్చుకునే యత్నాలు. మొత్తానికి ఇప్పుడు రేవంత్ చేస్తున్నది డైవర్షన్ పాలిటిక్స్. వాస్తవానికి ఇక్కడ చేసేందుకు ఏమీ లేదు. చేయాలంటే ఖజనా వెక్కిరిస్తోంది. హైడ్రాతో రియల్ మరీ దారుణంగా పడిపోయింది. అన్ని రంగాల్లో అదే పరిస్థితి. దీనికి తోడు ఇచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యమైపోయింది. ఇక మిగిలుంది ఒకటే. అదే తన సహజ దోరణిలో ఆరోపణలు చేయడం. విరుచుకుపడటం. సవాల్ విసరడం. మీడియాకు ఫీలర్ వదలడం. కొన్ని రోజుల పాటు అది చర్చలో ఉండేలా చేయడం. గతంలో కేసీయారూ ఆడపాదడపా వాడిన ప్రయోగమే.
ఇప్పుడు రేవంత్‌కు ఇది తప్ప వేరే దారే కనిపించడం లేదు. అందుకే బట్టకాల్చి మీదేసే రాజకీయాలనే నమ్ముకున్నాడు. కానీ జనాలు మాత్రం ఈ వైఖరిని చీదరించుకుంటున్నారు. యాక్ .. అనే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఎన్ని రోజులు కేసీఆర్, కేటీఆర్ జపం. ఏదైనా చేయాలనుకుంటే చేసేయ్.. అది చాతగాక…వాళ్లు అడ్డుపడుతున్నారు. వీళ్లు సహకరించడం లేదు. కేసీఆర్ లేస్తే మనిషిని కాను.. అన్నట్టుగా రేవంత్ కూడా నేనే తలుచుకుంటే.. మీకు చిప్పకూడే అంటున్నాడు. కానీ అది వీలుకావడం లేదు. చేసేలా లేడు. అయ్యేలా లేదు. అసలు ఆ మాటలు ఇప్పుడు వళ్లెవేస్తే జనాలు నవ్వుకునే పరిస్థితి ఉంది. కేటీఆర్ పార్టనర్ ఎవడో చచ్చాడట. దానికి ఎందుకు విచారణ కోరలేదంటాడు.
కాళేశ్వరం కేసులో ఓ అడ్వకేట్, మొన్న హత్యకు గురైన కేసులపై ఎందుకు విచారణ అడగటం లేదు కేటీఆర్ అని అంటున్నాడు. కేటీఆర్ అడగాల్నా..? నిజమేందో వెలికి తీసి నువ్వే కేటీఆర్‌ను బద్నాం బద్నాం చేసి జైలు పాలు చేయరాదు…? ఎవరొద్దన్నారు…? కేసీఆర్, కిషన్‌రెడ్డి ఇద్దరూ పార్టనర్లంటాడు. మెట్రో విస్తరణను కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నాడంటున్నాడు. చిన్నపిల్లగాడు తన వస్తువును పక్కోడు తీసుకుని పారిపోయిండని ఏడ్చినట్టే ఉంది రేవంత్ ఏడుపు గొట్టు మాటలు. ఇక ఈ వట్టిమాటలు కట్టి పెట్టి .. గట్టి మేలు తలపెట్టవోయ్… రేవంతు..! ఇది నేనంటున్న మాట కాదు. నీ శ్రేయోభిలాషులే అంటున్నారు.