(దండుగుల శ్రీనివాస్)
ఇదేందీ విచిత్రంగా ఉంది హెడ్డింగు. హెడ్డు ఉండే పెట్టావా..? హ్యాంగోవర్ ఏమైనా అయ్యిందా..?? బీఆరెస్ కార్యకర్తలు కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నారా..? ఎందుకు..? కాంగ్రెస్ ఖతమైపోతున్నది. ఇక అంతా మనదే రాజ్యం. ఏ ఎన్నిక వచ్చినా మనదే గెలుపు అని అనుకుంటున్నారు కదా. అదీగాక కాంగ్రెస్ గెలవటము అంతా ఈజీగా లేదు కదా. మరెందుకు ఈ ముచ్చట. నిజ్జంగా వాళ్లు అలాగే అనుకుంటున్నారా..? సంచలన వార్తలకు అలవాడు పడి ఈ విధమైన వార్తలు వండి వార్చుతున్నావా..?? వెయిట్ వెయిట్ బ్రదర్. జర్రాగు.
25Vastavam.in (4)
ఓ కేసీఆర్, ఓ కేటీఆర్, ఓ కవిత….. అధికారం వెలగబెట్టిన పదేళ్లూ ఉద్యమకారులను , బీఆరెస్ శ్రేణులను పట్టించుకోలేదు. ఆ తరువాత జనాలు కర్రుకాల్చి వాత పెట్టారు. ఓటమి పాలయ్యారు. అధికారం కోల్పోయారు. ఇప్పుడు కళ్లు తెరిచారు. మనం మనం ఒక్కటి అంటున్నారు. మీది తెనాలే మాది తెనాలే అని కూడా కలుపుకుపోయే పనిని తలకెత్తుకున్నారు. అప్పుడు ఉద్యమ సమయంలో త్యాగం చేసి ఇళ్లూ ఒళ్లూ గుల్ల చేసుకుని రోడ్డున పడ్డారు. అధికారం వచ్చినంక కూడా పదేళ్ల పాటు దిక్కూమొక్కు లేక కుటుంబాలను ఆగం చేసుకున్నారు. ఓడినంక నెత్తికెక్కిన కళ్లు కిందకు దిగాయి. ఇప్పుడిప్పుడే మమ్మల్ని కానుతున్నారు.
ఇప్పుడు గిట్ల బీజేపీ గెలిచిందే అనుకో. కాంగ్రెస్ ఓడిందే అనుకో. ఇగ జూస్కో. మావోళ్ల పరిస్థితి. చూశారా..! కాంగ్రెస్ పని ఖతమైంది. అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇక మనదే రాజ్యం. మనదే గెలుపు. మనదే అధికారం. జనం మా వైపే చూస్తున్నారు. అని మళ్లీ అదే అహంకారం నెత్తికెక్కుతుంది. అలా జరగొద్దంటే. కాంగ్రెస్సే గెలవాలి. బీజేపీ ఓడాలి. మేమే వాళ్లకు మళ్లీ దిక్కుగా కనిపించాలి. మా దగ్గరకి రావాలి. మాకు లొంగాలి. అహంకారం వదలాలి. మమ్మల్ని పట్టించుకోవాలి. పార్టీ పదవులివ్వాలి. ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్సే గెలవాలి. ఇదే బీఆరెస్ శ్రేణుల, ఉద్యమకారుల అంతరంగం. అంతర్మథనం.